ఆ ఇద్దరు హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిందా?
ఇతర హీరోలతో పోలిస్తే వైవిధ్యంగా ఎనర్జిటిక్ గా కనిపించే హీరోలకు, కథలు, పాత్రలతో ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించే హీరోలకు ప్రత్యేకించి ఫాలోయింగ్ పెరుగుతోంది.
స్టార్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ని డిసైడ్ చేసేది ఏది? సక్సెస్ రేటు.. అతడి నటన.. ఛరిష్మా.. ఇంకేది? అంటే ఇవన్నీ హీరోలకు అవసరం. ఈ మూడింటా ఏది లేకపోయినా సినీ ప్రపంచంలో నటులుగా వెలగడం, ఫాలోవర్స్ ని సంపాదించుకోవడం అంత సులువేమీ కాదు. ఇతర హీరోలతో పోలిస్తే వైవిధ్యంగా ఎనర్జిటిక్ గా కనిపించే హీరోలకు, కథలు, పాత్రలతో ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించే హీరోలకు ప్రత్యేకించి ఫాలోయింగ్ పెరుగుతోంది. ఎన్ని ఉన్నా సక్సెస్ అనేది గీటురాయిగా మారుతోంది.
సోషల్ మీడియాలు శాసిస్తున్న ఈ రోజుల్లో అభిమానుల మధ్య కలతలు గొడవలు హీరోల ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాయే కానీ వారి గౌరవాన్ని పెంచడం లేదు. ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాల్లో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటం షాక్ కి గురి చేస్తోంది. ఒకరి ఫేవరెట్ హీరోని మరొకరు చిన్నబుచ్చుకునేలా చేయడం ఇబ్బందికరంగా మారింది.
ఇంతకుముందు పవన్ కల్యాణ్- ప్రభాస్ అభిమానుల మధ్య.. మహేష్ - పవన్ అభిమానుల మధ్య ఇలాంటి వార్ చూశాం. అటు బాలీవుడ్ లో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ అభిమానులు ఇందుకు మినహాయింపేమీ కాదు. వారి మధ్య ఇలాంటి ప్రత్యక్ష యుద్ధం జరుగుతోంది. తాజాగా రిలీజైన అక్షయ్ `స్కైఫోర్స్` పోస్టర్ లో అతడు కనిపించకపోవడం డెబ్యూ హీరో వీర్ పహారియాను పోస్టర్ లో వేయడంతో దీనిపై రచ్చ మొదలైంది. అక్షయ్ కి ఫాలోయింగ్ తగ్గిపోయి, స్టార్ డమ్ పడిపోయిందని దేవగన్ అభిమానులు విమర్శించారు. దీనికి ప్రతిగా సింగం ఎగైన్ పోస్టర్ లోను దేవగన్ ఒక్కడే కనిపించలేదని అక్షయ్ అభిమానులు ప్రతిదాడి చేసారు. అజయ్ దేవగన్ సోలోగా తన సినిమాలు ఆడే థియేటర్లకు జనాన్ని లాక్కు రాలేడని అక్కీ అభిమానులు విమర్శించారు.
ఆ ఇరువురి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాల్లో రచ్చ కొనసాగుతోంది. అయితే ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదని అభిమానులు గుర్తెరగాల్సి ఉంటుంది. నేడు ప్రాంతీయ విభేధాలను సైతం సినిమాలు చెరిపేస్తున్నాయి. అలాంటిది `మా హీరో.. మీ హీరో` అని ఇంకా డిబేట్లు పెట్టుకోవడం, ఘర్షణలకు దిగడం సరైనదేనా?. ఇది ఇండియన్ సినిమా.. మన హీరోలంతా పాన్ ఇండియా స్టార్లుగా ఎదగాలని బలంగా ఆకాంక్షించే సమయం వచ్చింది. ఫ్యానిజం స్టార్లలో కాన్ఫిడెన్స్ పెంచేందుకు సహకరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.