నా ఇమేజ్‌ని మార్చుకోవడానికి చాలా కష్టపడ్డాను: బాబీ డియోల్
నటుడిగా తన ఇమేజ్‌ని మార్చుకునే ఆలోచన గురించి.. కెరీర్ ప్రయాణం గురించి బాబి తెలిపాడు.
ఐఫా అవార్డ్స్ 2024 ఉత్సవాల్లో స్టారాధిస్టార్ల సందడి చూశాం. అందరితో పాటు `యానిమల్` విలన్ బాబీ డియోల్ కూడా అక్కడ షైన్ అయ్యాడు. అతడిలో మునుపెన్నడూ లేని ఉత్సాహం కనిపించింది. యానిమల్ చిత్రంలో అబ్రార్ గా అతడి నటనకు ఉత్తమ ప్రతినాయకుడిగా అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భాన్ని అతడు సెలబ్రేట్ చేసుకున్నాడు. అవార్డ్ అందుకున్న ఆనందంలో అతడు ఏఎన్ఐతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను ముచ్చటించాడు. నటుడిగా తన ఇమేజ్‌ని మార్చుకునే ఆలోచన గురించి.. కెరీర్ ప్రయాణం గురించి బాబి తెలిపాడు.
బాబీ డియోల్ `యానిమల్`లో అబ్రార్ హక్ అనే క్రూరుడైన నిశ్శబ్ద(మూగవాడైన) విలన్ గా నటించాడు. అతడు తన పాత్రతో అబ్బురపరిచాడు. ప్రతి ఒక్కరూ ఈ పాత్రను మెచ్చుకున్నారు. పరిశ్రమ తనను మరిన్ని ప్రతినాయక పాత్రల్లో చూస్తోంది కదా.. మిమ్మల్ని అలాగే ఫిక్స్ చేసినట్టేనా? అని మీడియా ప్రశ్నించగా.. బాబీ స్పందిస్తూ.. నా ఇమేజ్‌ని మార్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. చివరకు నా ఇమేజ్‌ని మార్చుకున్నాను. చాలా డిఫరెంట్‌గా ఉండే క్యారెక్టర్‌లు చేస్తున్నాను! అని ప్రస్తుత సినిమాల్లో తనకు ఆఫర్ చేసిన పాత్రల గురించి బాబీ మీడియాతో అన్నారు.
కెరీర్‌లో తాను ఎదుర్కొన్న పోరాటాల గురించి కూడా అతడు చెప్పాడు. కష్టమైన రోజులు జీవితంలో భాగమని నేను అనుకుంటున్నాను. నేను వాటిని చూసి ఫీలవ్వను. ఓ మై గాడ్ నేను అలాంటి సంధి కాలం గడిపాను... నేను ఇక నటుడిగా ఉండను! అని అనుకోను. మనం కష్టపడి పనిచేస్తే, గుర్తింపు వచ్చే రోజు వస్తుంది! అని అన్నాడు. ఐఫా వేదికపై ఐకానిక్ జమాల్ కుడు స్టెప్‌ను ప్రదర్శించాడు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నేపథ్య గానం సహా పలు అవార్డులను గెలుచుకుంది. ఇది ఈ చిత్రానికి పని చేసిన వారందరికీ గుర్తుండిపోయే మూవ్ మెంట్. ఐఫా ఉత్సవాలు ఈరోజుతో ముగుస్తున్నాయి. ముగింపులో హనీ సింగ్, శిల్పా రావు, శంకర్-ఎహసాన్-లాయ్ వంటి కళాకారులు ప్రేక్షకుల కోసం ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు.