వందల కోట్ల ఆస్తిపరుల్ని పెళ్లాడిన కథానాయికలు
అందాల కథానాయికలు క్రీడా రంగం నుంచి ప్రముఖులు లేదా పారిశ్రామిక, రాజకీయ రంగాల నుంచి ప్రముఖులను పెళ్లాడడం రెగ్యులర్ గా చూస్తున్నదే.
అందాల కథానాయికలు క్రీడా రంగం నుంచి ప్రముఖులు లేదా పారిశ్రామిక, రాజకీయ రంగాల నుంచి ప్రముఖులను పెళ్లాడడం రెగ్యులర్ గా చూస్తున్నదే. కొంతమంది బాలీవుడ్ తారలు పరిశ్రమ సహచరులను వివాహం చేసుకుంటుండగా, చాలా మంది నటీమణులు విజయవంతమైన ఎంటర్ ప్రెన్యూర్ లను ప్రేమించి పెళ్లాడిన సందర్భాలున్నాయి. వందల కోట్ల ఆస్తులతో అప్పటికే సెటిలైన వ్యాపారవేత్తలను వివాహం చేసుకున్న కొందరు కథానాయికల వివరాల్ని పరిశీలిస్తే....
సీనియర్ కథానాయికల్లో జుహి చావ్లా 1995లో మెహతా గ్రూప్ ఛైర్మన్ జే మెహతాను వివాహం చేసుకున్నారు. ఈ జోడీ సిమెంట్, ప్యాకేజింగ్ , ఇంజనీరింగ్ వంటి పరిశ్రమలను విస్తరించి, రూ.4,100 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉంది. జూహి - జే దంపతులు షారుఖ్ ఖాన్‌తో కలిసి ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను సొంతం చేసుకుని నిర్వహిస్తున్నారు. గజిని ఫేం అసిన్ 2016లో టెక్ మిలియనీర్ రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు. మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన రాహుల్ నికర ఆస్తి విలువ రూ. 1,300 కోట్లు అని ఫోర్బ్స్ తెలిపింది. భారతదేశపు మొట్టమొదటి ఏఐ-ఆధారిత ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ అయిన రివోల్ట్ ఇంటెలికార్ప్‌ను కూడా ఆయన ప్రారంభించారు. మరో సీనియర్ నటి రవీనా టాండన్ 2004లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీని వివాహం చేసుకున్నారు. అతడు స్వతంత్ర పంపిణీ సంస్థ అయిన ఏఏ ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు. వెరైటీ కథనం ప్రకారం.. AA ఫిల్మ్స్ పుష్ప 2, గేమ్ ఛేంజర్, కల్కి 2898 AD, దేవర వంటి భారీ దక్షిణాది చిత్రాల హిందీ పంపిణీ హక్కులను పొందింది. ఈ కొనుగోళ్లలో దాదాపు రూ. 450 కోట్లు పెట్టుబడి పెట్టగా భారీ లాభాలను ఈ సంస్థ ఆర్జించింది.
బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా 2016లో జీన్ గుడ్‌ఇనఫ్‌ను వివాహం చేసుకుని తన భర్తతో లాస్ ఏంజిల్స్‌కు మకాం మార్చారు. అమెరికన్ వ్యాపారవేత్త అయిన జీన్, అమెరికాకు చెందిన జలవిద్యుత్, విద్యుత్ సంస్థ అయిన ఎన్‌లైన్ ఎనర్జీలో ఉత్పత్తి& ఆర్థిక విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అతడికి 100 కోట్లు పైగా ఆస్తులున్నాయని కథనాలొచ్చినా, ప్రీతి జింటా నికర ఆస్తి విలువ రూ. 125 కోట్లుగా ఉందని అంచనా. స్టార్ హీరో అనీల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ తన దీర్ఘకాల భాగస్వామి ఆనంద్ అహుజాను 2018లో వివాహం చేసుకున్నారు. ఆనంద్ ఫ్యాషన్ బ్రాండ్ భానే వ్యవస్థాపకుడు. స్నీకర్ స్టోర్ వెజ్‌నాన్ వెజ్ సహ వ్యవస్థాపకుడు. అతడి కుటుంబం భారతదేశంలో అతిపెద్ద ఎగుమతి సంస్థ అయిన షాహి ఎక్స్‌పోర్ట్స్‌ను కలిగి ఉంది. ఆనంద్ అహుజా నికర ఆస్తుల విలువ సుమారు రూ. 4,000 కోట్లు.
అందాల కథానాయిక మౌని రాయ్ 2022లో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త, పెట్టుబడి బ్యాంకర్ సూరజ్ నంబియార్‌ను వివాహం చేసుకున్నారు. సూరజ్ నికర ఆస్తుల విలువ ఎంతో తెలియకపోయినా కానీ, మౌని రాయ్ నికర ఆస్తి విలువ రూ. 41 కోట్లుగా అంచనా. మౌని వ్యవస్థాపకురాలిగాను సుప్రసిద్ధురాలు. హీరామండి నటి షర్మిన్ సెగల్ 2023లో టొరెంట్ గ్రూప్ వారసుడు అమన్ మెహతాను వివాహం చేసుకున్నారు. అమన్ రూ.38,411 కోట్ల విలువైన సంస్థకు అనుబంధ సంస్థ అయిన టొరెంట్ ఫార్మాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. టొరెంట్ గ్రూప్ ఛైర్మన్ అయిన అతని తండ్రి సమీర్ మెహతా రూ.56,782 కోట్ల నికర ఆస్తి విలువను కలిగి ఉన్నారని అంచనా. దీనితో ఆయన భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. కీర్తి సురేష్ ఇటీవలే దుబాయ్ కి చెందిన బిజినెస్ మేన్ ఆంథోని తటిల్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. కీర్తి స్వయంగా 41 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉండగా, ఆంథోని ఆస్తుల విలువ 150 కోట్లుగా అంచనా. ఈ జంట ఆస్తులు సుమారు 200 కోట్లు.