టాప్ స్టోరి: ఈ 10 సినిమాలు ఉన్నట్టా లేనట్టా?
కొన్ని సినిమాల ప్రకటనలు చూడగానే వెంటనే క్యూరియాసిటీ పెరుగుతుంది.
కొన్ని సినిమాల ప్రకటనలు చూడగానే వెంటనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇలాంటి ఒక గొప్ప కథ కాస్టింగ్‌తో సినిమా తీస్తున్నారు.. కచ్ఛితంగా థియేటర్ కి వెళ్లి చూడాలని ఆడియెన్ మైండ్ లో నాటుకుంటుంది. కానీ కొన్నిసార్లు ఫేట్ వేరేగా ఉంటుంది. ఆ సినిమాలు ఎప్పటికీ రిలీజ్ కావు అని తెలిసి నిరాశపడటం ఆడియెన్ వంతు అవుతోంది. భారీ అంచనాల నడు రిలీజ్‌కి వస్తాయి అనుకున్న సినిమాలు.. ఏళ్ల తరబడి ప్రకటనలు చేసినా, అప్పుడప్పుడు టీజర్ విడుదలతో ఉత్సాహం పెంచినా కూడా అవి థియేటర్లకు రాకపోవడం నిరాశకు గురిచేస్తోంది. రకరకాల కారణాల వల్ల ఇటీవల కొన్ని సినిమాలు మధ్యంతరంగా నిలిపేసారు. సంవత్సరాలుగా వాటిలో కొన్నింటిని ఎన్నడూ చూడలేమని నిర్ధారణ అవుతోంది. వీటిలో కొన్నిటిని టీజర్లతో ప్రేక్షకులకు గొప్పగా పరిచయం చేయడం గమనించదగినది. కొంత కాలంగా ఆగిపోయిన పెద్ద బాలీవుడ్ చిత్రాల జాబితాను పరిశీలిస్తే...
ర్యాంబో, హీరో నం.1 , హేరా ఫేరి 3, ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ, తఖ్త్, దోస్తానా 2 వంటి భారీ బడ్జెట్ బాలీవుడ్ సినిమాలు అర్థాంతరంగా ఆగిపోయాయి. వీటిలో కరణ్ జోహార్ సారథ్యంలోని మోస్ట్ అవైటెడ్ చిత్రం `తఖ్త్` ఆగస్ట్ 2019లో మొదటిసారిగా ప్రకటించారు. సుమిత్ రాయ్, హుస్సేన్ హైద్రీ ఈ సినిమాకి స్క్రిప్టును అందించగా, కరణ్ దర్శకత్వం వహించాల్సి ఉంది. ఈ చిత్రం మొదట 24 ఏప్రిల్ 2020న విడుదల కావాల్సి ఉంది. మహమ్మారి కారణంగా ఆలస్యం అయింది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, అలియా భట్, కరీనా కపూర్, అనిల్ కపూర్, విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్ వంటి పెద్ద స్టార్స్ నటిస్తున్నారు.
ప్రముఖ ఫిలింమేకర్ ఆధిత్య ధర్ `ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ` పేరుతో సినిమా తీయాలనుకున్నారు. విక్కీ కౌశల్ టైటిల్ పాత్రకు ఎంపికయ్యాడని కథనాలొచ్చాయి.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది కానీ థియేటర్లలో విడుదల కాలేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆదిత్య ఎట్టకేలకు ఈ చిత్రం గురించి ఒక అప్‌డేట్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ - ``ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ఆపి ఉంచాం. నేను నిజాయితీగా ఉంటాను.. ఈ మూవీపై అందరి దృష్టి ఉంది. కానీ ఇలాంటి భారీ బడ్జెట్ సినిమా కోసం పని చేయడం చాలా పెద్ద విషయం. మేం చూస్తున్న VFX నాణ్యతకు చాలా ఖర్చవుతుంది. మనకు ఇప్పటివరకూ ఎవరూ దాని కోసం ప్రయత్నించలేదు. సాంకేతికత అందుబాటులోకి వచ్చే వరకు లేదా సినిమా హాళ్లు పెరిగే వరకు మేము వేచి ఉండాల్సి ఉంది`` అన్నారు.
ఫర్హాన్ అక్తర్ చిత్రం `జీ లే జరా`ను 2021లో తిరిగి ప్రకటించాడు. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ వాకౌట్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే స్టార్ కాస్ట్‌లో భాగమైన అలియా భట్ ప్రాజెక్ట్ ఆలస్యం గురించి మాట్లాడింది. ``కొన్నిసార్లు ప్రతిదానికీ సమయం పడుతుంది. కలిసి పని చేయడానికి సరైన సమయం కోసం వేచి ఉండాలి. కానీ ఏదో ఒక రోజు ఈ సినిమా పెద్ద తెరపైకి రావాలన్నదే అందరి హృదయాల్లోని ఉద్దేశమని భావిస్తున్నాను`` అని వ్యాఖ్యానించింది.
మున్నా భాయ్ MBBS ఫ్రాంచైజీ లో మూడవ భాగం కోసం బ్లాక్ బస్టర్ ద్వయం సంజయ్ దత్- రాజ్ కుమార్ హిరాణీ తిరిగి కలిసి పని చేస్తారని కథనాలొచ్చాయి. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చిత్రీకరణకు వెళ్లలేదు. అయితే ఈ చిత్రం తరువాత కార్యరూపం దాల్చవచ్చని చిత్రనిర్మాత రాజ్‌కుమార్ హిరాణీ టీజ్ చేసారు. మున్నాభాయ్ సిరీస్ కంటే ముందే షారూఖ్ తో డంకీ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇది ఉందా లేదా? అన్నదానికి ఇంకా నిర్ధారణ లేదు.
కొన్నాళ్ల క్రితం హృతిక్ రోషన్- కరీనా కపూర్ లతో కరణ్ జోహార్ భారీ చిత్రానికి కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో ప్లాన్ చేసారు. కానీ ఆ తరువాత దర్శకుడు కాస్టింగ్ ని మార్చారు. అలియా భట్ - వరుణ్ ధావన్ ఇందులో ప్రధాన జంటగా నటిస్తారని ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. కరణ్ నిర్మించే మరో భారీ చిత్రం అర్థాంతరంగా వివాదాలతో ఆగిపోయింది. జాన్వీ కపూర్, కార్తీక్ ఆర్యన్, లక్ష్ లల్వానీ నటించిన `దోస్తానా 2` అకస్మాత్తుగా ఆగిపోయింది. కార్తిక్ ``అన్ ప్రొఫెషనల్`` ప్రవర్తన ప్రాజెక్ట్‌ను నిలిపివేయడానికి దారితీసిందని ప్రకటించారు. తరువాత కార్తీక్ స్థానంలో వేరొకరు నటిస్తారని ప్రకటించినా కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిపి వేసినట్టు వెల్లడైంది. ఈ చిత్రం గురించి జాన్వీ ది లాలాంటాప్‌తో మాట్లాడుతూ, `మేం ఆ చిత్రం కోసం దాదాపు 30 నుండి 35 రోజుల పాటు షూట్ చేసాము. నా అభిప్రాయం ప్రకారం షూటింగ్ చాలా బాగా జరిగింది. సినిమా ఎందుకు ఆగిపోయిందో నాకు తెలియదు`` అని వ్యాఖ్యానించింది.
సంజయ్ లీలా భన్సాలీ తీయాల్సిన రెండు ఇలానే పెండింగులో ఉన్నాయి. ఇన్షా అల్లాహ్ చిత్రం అతడి ప్రాజెక్టులలో ఒకటి.. కళాత్మక చిత్రాల దర్శకుడు తీయాల్సి ఉంది. సల్మాన్ ఖాన్‌ల- భన్సాలీ కలయికకు గుర్తుగా ఉంటుందని భావించారు. ఆలియా భట్ కథానాయికగా ఎంపికైంది. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు నిర్మాణంలో లేదు. సినిమాను వాయిదా వేసామని సల్మాన్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ప్రకటించారు. భన్సాలీ ప్రకటించిన వాటిలో ఆగిపోయిన మరో చిత్రం బైజు బావ్రా. మొదట్లో ఈ చిత్రంలో రణబీర్ కపూర్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలు పోషిస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అలియా భట్ -రణ్‌వీర్ సింగ్‌లు ప్రధాన జంటగా ఎంపికయ్యారు. అయితే ఈ సినిమాపై ఇంకా ఎలాంటి ప్రకటనలు రాలేదు.
ఇటీవల టైగర్ ష్రాఫ్ కెరీర్ వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ కష్ట కాలంలో అతడు తన కంబ్యాక్ కోసం గట్టి ప్రణాళికలో ఉన్నాడు. కానీ ఈపాటికే నటించాల్సిన ర్యాంబో , హీరో నం.1, గణపథ్ 2 చిత్రాలు పూర్తిగా మరుగున పడ్డాయి. అవి భారీ బడ్జెట్లతో తీయాల్సిన భారీ యాక్షన్ చిత్రాలు. కానీ దర్శకనిర్మాతలు వెనకడుగు వేసారు. అక్షయ్ కుమార్ సహా భారీ తారాగణంతో హేరా ఫేరి 3 ని ప్రకటించాక కూడా ఆపేసారు. అక్షయ్ , సునీల్ శెట్టి, పరేష్ రావల్ వంటి పెద్ద స్టార్లు ఇందులో నటించాల్సి ఉంది. కానీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీని గురించిన కొత్త అప్ డేట్ లేదు.
వీటిలో కొన్ని సినిమాలు కరోనా క్రైసిస్ వల్ల సంపులో పడ్డాయని కూడా కథనాలొచ్చాయి. భారీ బడ్జెట్లను రిస్క్ చేయలేక నిర్మాతలు మధ్యలోనే వదిలేసారు.