యువహీరోపై అనధికారిక నాన్ కోఆపరేషన్!
ఇన్ సైడర్లను కాపాడేందుకు ఔట్ సైడర్లకు అవకాశాలివ్వకుండా మాఫియా నిలువరిస్తోందనేది కంగన ఆరోపణ
బాలీవుడ్‌లో ఇన్ సైడర్, ఔట్ సైడర్ డిబేట్ ఎండ్‌లెస్‌గా సాగుతూనే ఉంది. ఇన్ సైడర్లను కాపాడేందుకు ఔట్ సైడర్లకు అవకాశాలివ్వకుండా మాఫియా నిలువరిస్తోందనేది కంగన ఆరోపణ. ఇన్ సైడర్ గ్యాంగ్ లో కరణ్ జోహార్, మహేష్ భట్, భన్సాలీ లాంటి ప్రముఖులు ఉన్నారని కంగన గతంలో ఆరోపించింది. వీలున్న ప్రతి సందర్భంలోను కరణ్, భట్స్ సహా నటవారసులందరినీ కంగన విమర్శిస్తూనే ఉంది.
అలాగే ఔట్ సైడర్ గా వచ్చి పెద్ద స్టార్ గా ఎదిగిన యువహీరో కార్తీక్ ఆర్యన్ ని కంగన ఎలాంటి భేషజం లేకుండా పబ్లిక్ లో పొగిడేస్తుంది. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ ఒక ఔట్ సైడర్ గా చేసిన ఓ కామెంట్ గురించి ఇండస్ట్రీలో వాడి వేడిగా చర్చ సాగుతోంది. తాను కొన్ని వరుస విజయాల్లో నటించినా కానీ, తనకు పెద్దల నుంచి పిలుపు రాలేదని, వారి నుంచి గుర్తింపు దక్కలేదని అతడు వాపోయారు. వారిని కలవాలని తాను కలగనడం లేదని, ఇకపైనా ఎదగాలంటే తాను మంచి స్క్రిప్టులను నమ్ముకుంటానని అతడు వ్యాఖ్యానించాడు. భూల్ భులయ 2, భూల్ భులయా 3 లాంటి బ్లాక్ బస్టర్లలో నటించిన కార్తీక్ ఆర్యన్ కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయినా ఇప్పటికీ పరిశ్రమలో ఇన్‌సెక్యూర్డ్ గా కనిపిస్తున్నాడు. తాను వరుసగా సక్సెస్ సాధించినా కానీ తన వెంట ఎవరూ రారని కూడా కార్తీక్ అన్నారు. నేను ఒంటరి యోధుడిని.. భవిష్యత్ లోను నాకు పరిశ్రమ మద్ధతు లభించదని కార్తీక్ వ్యాఖ్యానించారు. ఒంటరిగా తన పోరాటం ఇకపైనా సాగుతుందని అన్నారు.
నేను ఎందరినో కలిసినా సినీరంగంలో పెద్దవారిని కలవలేకపోయానని కార్తీక్ ఆర్యన్ వ్యాఖ్యానించాడు. అందుకే కెరీర్ పరంగా తన జాగ్రత్తలు తనకు ఉన్నాయని కూడా వివరణ ఇచ్చాడు. ఓవరాల్‌గా కంగన చెప్పినట్టు కార్తీక్ ఆర్యన్ కి వ్యతిరేకంగా మాఫియా పని చేస్తోందని అర్థం చేసుకోవాలి. గతంలో దోస్తానా 2 నుంచి కార్తీక్ ని తొలగించిన కరణ్ జోహార్ ఆ తర్వాత అతడితో సినిమా ఊసే ఎత్తలేదు. ప్రస్తుతం వారి మధ్య సాన్నిహిత్యం లేదు. కరణ్ జోహార్ తరహాలోనే పరిశ్రమలో చాలామంది పెద్దలు కార్తీక్ ఆర్యన్ తో సినిమాలు చేసేందుకు ముందుకు రాకపోవడం అతడిని నిరాశపరిచింది. పరిశ్రమ పెద్దల నుంచి కార్తీక్ పై అనధికారిక నిషేధం అమల్లో ఉందని కూడా అర్థం చేసుకోవాలి.