హాస్యబ్రహ్మ కొత్త రూపాలు బహు బాగున్నాయి!

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అనగానే తెలుగు ప్రేక్షకులకు ఆయన కామెడీ సన్నివేశాలు, ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌, నవ్వు తెప్పించే మీమ్స్ గుర్తుకు వస్తాయి.

Update: 2024-09-11 07:51 GMT

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అనగానే తెలుగు ప్రేక్షకులకు ఆయన కామెడీ సన్నివేశాలు, ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌, నవ్వు తెప్పించే మీమ్స్ గుర్తుకు వస్తాయి. కానీ బ్రహ్మానందం లో అంతకు మించిన విలక్షణ నటుడు దాగి ఉన్నాడు అనే విషయం ఈ మధ్య తెలుస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు బ్రహ్మానందం కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేశారు, ఆయనను హాస్య బ్రహ్మ అంటూ ప్రశంసించారు. కానీ ఆయనలో కమెడియన్ మాత్రమే కాకుండా గొప్ప నటుడు, పౌరాణిక పాత్రలకు సరిపోయే గొప్ప డైలాగ్‌ డెలవరీ చేయగల నటుడు ఉన్నాడని ఈతరం ప్రేక్షకులకు, సినీ వర్గాల వారికి అర్థం అవుతోంది.

కొన్ని రోజుల క్రితం బ్రహ్మానందంను కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో చూశాం. ఆ సినిమాలో చక్రపాణి పాత్రకు బ్రహ్మానందం ప్రాణం పోశారు. రంగస్థల నటుడిగా ఎమోషన్‌ పండిస్తూ బ్రహ్మీ చేసిన పాత్ర విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. స్క్రీన్‌ స్పేస్ ఎక్కువ సమయం ఉండి ఉంటే కచ్చితంగా అవార్డు కి అర్థం అనడంలో సందేహం లేదు. అలాంటి పాత్రలో మరోసారి బ్రహ్మానందం కనిపించబోతున్నారు. 'ఉత్సవం' సినిమాలో బ్రహ్మానందం మరోసారి నాటక రంగానికి చెందిన నటుడిగా కనిపించబోతున్నాడు.

ఉత్సవం సినిమా కోసం బ్రహ్మానందం పౌరాణిక పాత్రలో కనిపించాడు. గతంలో సీనియర్‌ ఎన్టీఆర్‌, స్టార్‌ నటుడు ఎస్వీఆర్‌ పోషించిన పాత్ర ను ధరించి గుక్క తిప్పుకోకుండా డైలాగ్‌ చెప్పి సర్‌ప్రైజ్‌ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఉత్సవం సినిమా స్థాయిని పెంచే విధంగా బ్రహ్మానందం పాత్ర ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఒక్క వీడియోతో ఉత్సవం సినిమా స్థాయిని పెంచడంతో పాటు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో బ్రహ్మీ కీలక పాత్ర పోషించారు.

ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉత్సవం లో బహు రూపాలను, పలు పౌరాణిక పాత్రల్లో బ్రహ్మానందం ను చూడబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇన్నాళ్లు బ్రహ్మానందంను కేవలం కమిడియన్ గా మాత్రమే చూసిన తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు పౌరాణిక పాత్రల్లో, అది భారీ డైలాగ్స్ ఉండే పాత్రల్లో కనిపించడంతో సర్‌ప్రైజ్ అవుతున్నారు. ముందు ముందు బ్రహ్మానందం చిల్లర కామెడీ పాత్రల్లో కాకుండా ఇలాంటి వెయిట్‌ ఉన్న పాత్రల్లో, సీరియస్ పాత్రల్లో కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News