బ్రహ్మాస్త్ర 2.. సూపర్ క్రేజీ రూమర్
బ్రహ్మాస్త్ర పార్ట్ 2 లో రణబీర్ కపూర్ తో పాటు, రణవీర్ సింగ్ ను కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
బాలీవుడ్ బాహుబలి అంటూ పిలవబడిన బ్రహ్మాస్త్ర సినిమా రెండో భాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 లో రణబీర్ కపూర్ మరియు ఆలియా జంటగా నటించగా పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.
బ్రహ్మాస్త్ర పార్ట్ 2 లో రణబీర్ కపూర్ తో పాటు, రణవీర్ సింగ్ ను కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇటీవల బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కోసం రణవీర్ సింగ్ ను కలిశాడు అంటూ బాలీవుడ్ మీడియాలో కథలు వచ్చాయి. అది దేవ పాత్ర కోసం అని వారు బలంగా చెబుతున్నారు.
మొదట అనుకున్న దాని ప్రకారం దేవ పాత్రను కూడా రణబీర్ కపూర్ తో చేయించాలని దర్శకుడు భావించాడు. కానీ బ్రహ్మాస్త్ర పార్ట్ 1 కి వచ్చిన స్పందన నేపథ్యంలో స్క్రిప్ట్ లో మార్పులతో పాటు, పలు విషయాలను మార్చేయాలని దర్శకుడు అయాన్ ముఖర్జీ మరియు నిర్మాతలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
రణబీర్ కపూర్ తో పాటు రణవీర్ సింగ్ ను కూడా సినిమాలో నటింపజేయడం వల్ల కచ్చితంగా అతి పెద్ద మల్టీ స్టారర్ గా నిలిచే అవకాశం ఉంది. తద్వారా భారీ క్రేజ్ దక్కి సినిమాకు భారీగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ భావిస్తున్నారట.
ప్రస్తుతం బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో మరియు సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇదే కనుక నిజం అయితే కచ్చితంగా బ్రహ్మాస్త్ర పార్ట్ 2 క్రేజ్ భారీగా పెరగడం ఖాయం. ఇక బ్రహ్మాస్త్ర పార్ట్ 2 షూటింగ్ ను 2025 ప్రథమార్థంలో తీసుకు వెళ్లే విధంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్లాన్ చేస్తున్నాడట.