మరీ ఇంత లైట్ తీసుకున్నారేంటి 'బ్రో'?
ఓటీటీ లు వచ్చిన తర్వాత పెద్ద సినిమాల మరియు చిన్న సినిమాల యొక్క శాటిలైట్ మార్కెట్ దారుణంగా పడిపోయింది
ఓటీటీ లు వచ్చిన తర్వాత పెద్ద సినిమాల మరియు చిన్న సినిమాల యొక్క శాటిలైట్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు రికార్డ్ స్థాయి రేటింగ్ లను బుల్లి తెర ద్వారా దక్కించుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు బుల్లి తెరపై స్టార్ హీరోల సినిమాలు డైలీ సీరియల్స్ కంటే కూడా తక్కువ రేటింగ్ ను నమోదు చేసుకోవడం విడ్డూరంగా అనిపిస్తుంది.
ఒకప్పుడు 25 కి పైగా రేటింగ్ ను దక్కించుకున్న తెలుగు సినిమా లు ఇప్పుడు పది నుంచి పదిహేను రేటింగ్ ను దక్కించుకోవడం గొప్ప విషయం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇలాంటి సమయంలో వచ్చిన పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ను జీ తెలుగు ప్రతిష్టాత్మకంగా టెలికాస్ట్ చేసింది. బ్రో సినిమాకు వచ్చిన రేటింగ్ చేసి ఛానల్ వారితో పాటు ఫ్యాన్స్ కూడా అవాక్కవుతున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల జీ తెలుగు లో ప్రసారం అయిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల 'బ్రో' సినిమాకు 7.24 రేటింగ్ నమోదు అయిందట. ఆ మధ్య వచ్చిన బీమ్లా నాయక్ సినిమా దాదాపుగా 9 రేటింగ్ ను దక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు బ్రో సినిమా అంతకంటే తక్కువ రేటింగ్ ను నమోదు చేయడం ఫ్యాన్స్ కి నిరాశ మిగిల్చింది.
బ్రో సినిమాకు సూపర్ హిట్ టాక్ రాలేదు.. అలా అని ఫ్లాప్ టాక్ కూడా రాలేదు. ఎక్కువ శాతం మంది థియేటర్ మరియు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై చూశారు. కనుక బ్రో సినిమాకి బుల్లి తెరపై ఎక్కువ రేటింగ్ రాలేదు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. బ్రో సినిమాకు వచ్చిన రేటింగ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల యొక్క శాటిలైట్ బిజినెస్ పై కచ్చితంగా ప్రభావం ఉండే అవకాశం ఉంది.
తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ్య సీతమ్ సినిమాకు రీమేక్ గా రూపొందిన 'బ్రో' సినిమా కు దర్శకత్వం వహించాడు. ఒరిజినల్ వర్షన్ కి దర్శకత్వం వహించిన సముద్ర ఖని తెలుగు వర్షన్ లో చిన్న చిన్న మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మెగా ఇమేజ్ జత కలవడం వల్ల కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాల్సి వచ్చింది. అందుకే సినిమా దారి తప్పిందని రివ్యూలు వచ్చాయి. అందుకు తగ్గట్లే ఇప్పుడు టీవీ రేటింగ్ నమోదు అయింది అనేది కొందరి అభిప్రాయం.