స్టార్ హీరో పాము మింగకుండా నిచ్చెన ఎక్కుతాడా?
ఒకప్పుడు కింగ్ ఖాన్ కానీ ఇప్పుడు కాదు అంటూ కొందరు నీరసం మాటలు మాట్లాడారు.
'జీరో` లాంటి డిజాస్టర్ తర్వాత కింగ్ ఖాన్ షారూఖ్ డీలా పడిపోయాడు. అతడికి ఊహించని విధంగా మైండ్ బ్లాంక్ అయింది. అంతకుముందు కూడా చెప్పుకోదగ్గ విజయాల్లేక భేజారెత్తాడు. ఐదారేళ్ల పాటు అయోమయ పరిస్థితిలోనే గడిపాడు. ఓవైపు ఖాన్ సామ్రాజ్యంపై కోర్టు కేసులు ముప్పిరిగొలపనీకుండా చేసాయి. ఒకప్పుడు కింగ్ ఖాన్ కానీ ఇప్పుడు కాదు అంటూ కొందరు నీరసం మాటలు మాట్లాడారు. అయితే ఊహించని విధంగా గత సంవత్సరం కింగ్ ఖాన్ కంబ్యాక్ అదిరిపోయింది. 2023 షారూఖ్ నామ సంవత్సరంగా మారింది.
పఠాన్- జవాన్ చిత్రాలతో వరుస పెట్టి 1000 కోట్ల క్లబ్ లు ఖాతాలో వేసాడు. రికార్డ్ బ్రేకింగ్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ తాను కింగ్ అని నిరూపించాడు. మాస్ లో ఇప్పటికీ కింగ్ ఖాన్ కి గ్రాఫ్ చెక్కు చెదరేలేదని ఆ రెండు సినిమాలు నిరూపించాయి. ఇయర్ ఎండ్ లో డంకీ సినిమాతోను మంచి హిట్టు కొట్టి హ్యాట్రిక్ విజయాలతో తిరుగేలేని బాక్సాఫీస్ రారాజు అని నిరూపించాడు.
అదంతా అటుంచితే, ఇప్పుడు మరో ఖాన్ అమీర్ కూడా కింగ్ ఖాన్ లాగా గ్రేట్ కంబ్యాక్ చూపిస్తాడా? అంటూ ఒకటే డిష్కసన్ నడుస్తోంది. అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చడ్డా` లాంటి భారీ బడ్జెట్ చిత్రంతో బాగా చేతులు కాల్చుకున్నాడు. ఈ సినిమాతో తానొకటి తలిస్తే రిజల్ట్ ఇంకేదో అయింది. ఫారెస్ట్ గంప్ రీమేక్ ని చెత్తగా తీసాడంటూ విమర్శల్ని ఎదుర్కొన్నాడు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో ఇక సినిమాల ఊసు తేకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇటీవల ఫ్యామిలీ ఫంక్షన్లు, కుమార్తె ఇరా ఖాన్ పెళ్లి వేడుకతో తన బిజీ లైఫ్ కి చెక్ పెట్టి, పూర్తిగా కుటుంబం కోసం సమయం గడుపుతున్నాడు. ఇలాంటి ఆనందకర సమయంలో ఇప్పుడు అమీర్ ఖాన్ తిరిగి కెరీర్ ని రీబిల్డ్ చేయాలని చూస్తున్నాడు. ఫిబ్రవరిలో తన బ్లాక్ బస్టర్ మూవీ తారే జమీన్ పర్ కి సీక్వెల్ కథతో `సితారే జమీన్ పర్`ని ప్రారంభించనున్నాడు. అలాగే `లాహోర్ 1947`ని ప్రారంభించేందుకు అమీర్ ఖాన్ సిద్ధమయ్యారు. సన్నీ డియోల్ కథానాయకుడిగా అమీర్ ఖాన్ నిర్మించనున్న `లాహోర్: 1947` ఫిబ్రవరి 12న ప్రారంభం కానుంది.
`సితారే జమీన్ పర్` సాంఘిక నాటకం డ్రామా నేపథ్యంలో సినిమా. దీనికోసం అమీర్ ఖాన్ ఆర్ఎస్ ప్రసన్నతో కలిసి పని చేస్తారని తెలిసింది. జెనీలియా డిసౌజా (దేశ్‌ముఖ్) ఇందులో కథానాయికగా నటించే అవకాశం ఉంది. అదే సమయంలో రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించనున్న`లాహోర్: 1947`లో సన్నీ డియోల్‌తో తన తొలి సహకారాన్ని ప్రకటించారు. ఈ రెండు చిత్రాల కోసం ఖాన్ సర్వసన్నాహకాల్లో ఉన్నారు. అమీర్ కి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 2 నుండి సితారే జమీన్ పర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. అమీర్ గత కొన్ని నెలలుగా సితారే జమీన్ పర్ కోసం ప్రిపరేషన్ మోడ్‌లో ఉన్నాడు .. ఫిబ్రవరి 2 నుండి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకువెళతాడు. ఈ చిత్రం కోసం తన రూపాన్ని బాగా తగ్గించుకున్నాడు. నటీనటుల విషయంలో చాలా ప్రిపరేషన్ సాగించాడు. పాత్రధారులతో ప్రాక్టీస్ సెషన్‌లు చేయించాడు. ఫిబ్రవరి 2 నుంచి సితారే జమీన్ పర్ మారథాన్ షెడ్యూల్ ను వేగంగా పూర్తి చేస్తారని తెలిసింది. అలాగే అమీర్ ఖాన్ ఈ చిత్రానికి 70 నుండి 80 పని దినాలు కేటాయించారు. ప్రీ-ప్రొడక్షన్‌లో ఎక్కువ సమయం వెచ్చించడంతో అతడు ప్రేక్షకులకు అందించే వేగవంతమైన చిత్రాలలో ఇది ఒకటి అవుతుందని తెలిసింది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఇప్పటికే `సితారే జమీన్ పర్` క్రిస్మస్ 2024 కి విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే లాహోర్: 1947 తేదీని రివీల్ చేయలేదు.
`లాహోర్: 1947`పైనా భారీ అంచనాలున్నాయి. చాలా కాలం తర్వాత కల్ట్ డైరెక్టర్ రాజ్‌కుమార్ సంతోషి- సన్నీ డియోల్‌ల కలయికలో ఈ చిత్రం చాలా ప్రత్యేకం కానుంది. ఇందులో అమీర్ గెస్ట్ అప్పియరెన్స్‌లో కనిపిస్తారు. అయితే దీనిపై ఇంకా అధికారిక నిర్ధారణ లేదు. కొన్నేళ్ల తర్వాత అమీర్ ఖాన్ నటనలో కొనసాగుతూనే, ప్రొడక్షన్ పనితోను ఒకే సమయంలో బిజీ అవుతున్నారు. అయితే ఖాన్ ఆడే చదరంగంలో నిచ్చెనలన్నీ ఎక్కి గేమ్ పూర్తి చేస్తాడా? లేక పాములు మింగేయగా కిందికి పడిపోతాడా? అన్నది ఇప్పుడే చెప్పలేం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమీర్ ఖాన్ సొంత బ్యానర్‌లో తెరకెక్కిన రెండు చిత్రాలు 2024 ప్రథమార్థంలో విడుదల కానున్నాయి. అమీర్ బ్యానర్ నిర్మించగా కిరణ్‌రావు దర్శకత్వం వహించిన లపాటా లేడీస్ .. సంజయ్ మిశ్రా నటించిన ప్రీతమ్ ప్యారే చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.