చాహల్ - ధనశ్రీ జంటకు కోర్టు విడాకులు మంజూరు
ఏబీపీ న్యూస్ వివరాల ప్రకారం.. గురువారం బాంద్రా ఫ్యామిలీ కోర్టులో తుది విచారణ జరిగింది.
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ అతడి భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ఈ జంట విడాకులను న్యాయమూర్తి ఖరారు చేసారని జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. ఏబీపీ న్యూస్ వివరాల ప్రకారం.. గురువారం బాంద్రా ఫ్యామిలీ కోర్టులో తుది విచారణ జరిగింది. దీనికి అవసరమైన అన్ని లాంఛనాలు కోర్టులో కొనసాగాయి. ఇద్దరూ ఉదయం 11:00 గంటలకు కోర్టుకు హాజరయ్యారు.
కేసుతో సంబంధం ఉన్న ఒక న్యాయవాది వివరాల ప్రకారం... విచారణ సమయంలో న్యాయమూర్తి(జడ్జి) ఈ జంటను కౌన్సెలింగ్ సెషన్‌కు హాజరు కావాలని ఆదేశించారు. దాదాపు 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ కొనసాగింది. న్యాయమూర్తి విడిపోవడానికి సమ్మతమేనా? అని జంటను చివరిగా ప్రశ్నించగా, చాహల్ - ధనశ్రీ ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నట్లు ధృవీకరించారని జాతీయ మీడియా కథనం పేర్కొంది.
తుది నిర్ణయం తీసుకునే ముందు దంపతులు గత 18 నెలలుగా విడివిడిగా నివసిస్తున్నామని కూడా వెల్లడించారు. విడిపోవడానికి కారణం... తమ మధ్య ఎప్పటికీ కలిసి ఉండే పరిస్థితులు, సానుకూలత కనిపించలేదని ఈ జంట పేర్కొన్నారు. అన్నిరకాల విచారణ తర్వాత న్యాయమూర్తి అధికారికంగా విడాకులు మంజూరు చేస్తూ చాహల్ - ధనశ్రీ ఇకపై భార్యాభర్తలుగా చట్టబద్ధంగా కలిసి లేరు అని ప్రకటించారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో సాయంత్రం 4:30 గంటలకు తుది తీర్పు వెలువడిందని మీడియా వెల్లడించింది.
అయితే బ్రేకప్ ప్రాసెస్ సమయంలో యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ ఇద్దరూ క్రిప్టిక్ పోస్టులతో రకరకాల సందేహాలు రేకెత్తించారు. ఈ జంట విడిపోతోందా లేదా? అన్నదానిపై స్పష్ఠత లేకుండా పోయింది. కానీ ఇప్పుడు జాతీయ మీడియా ఈ జంట విడిపోయిందని కథనాలు ప్రచురించింది. వారిద్దరూ ప్రస్తుతానికి తమ విడాకుల గురించి ఇంకా స్పష్టంగా ప్రస్తావించలేదు.