సిల్క్ స్మిత బయోపిక్.. గ్లింప్స్ తోనే అంచనాలు పెరిగేలా..
నేడు పోస్టర్ తో పాటు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మినీ డ్రెస్ లో ఉన్న చంద్రిక.. సిల్క్ స్మిత రోల్ లో ఒదిగిపోయినట్లు కనిపించారు.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అలనాటి నటి సిల్క్ స్మిత ఓ సెన్షేషన్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె.. తన యాక్టింగ్ తో వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఆమె సాంగ్ ఉంటే చాలు.. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని అంతా ఫిక్స్ అయిపోయేవారు.
మొత్తం ఐదు భాషల్లో 450 చిత్రాల్లో నటించిన సిల్క్ స్మిత.. తన జీవితాన్ని మాత్రం అర్థాంతరంగా ముగించారు. కొన్నేళ్ల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే స్మిత మరణం ఇప్పటికీ ఓ మిస్టరీ అనే చెప్పాలి. పిన్న వయసులోనే అకస్మాత్తుగా మరణించాలని నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటనేది బయటకు రాలేదు.
అయితే సిల్క్ స్మిత బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తుండగా.. నేడు ఆమె బర్త్ డే సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది. సిల్క్ స్మితగా నటి చంద్రిక రవి కనిపించనున్నారు. జయ రామ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా.. STRI సినిమాస్ సంస్థ సిల్క్ స్మిత బయోపిక్ ను సిల్క్ స్మిత - ది క్వీన్ ఆఫ్ సౌత్ టైటిల్ తో నిర్మిస్తోంది.
నేడు పోస్టర్ తో పాటు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మినీ డ్రెస్ లో ఉన్న చంద్రిక.. సిల్క్ స్మిత రోల్ లో ఒదిగిపోయినట్లు కనిపించారు. గ్లింప్స్.. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ రోల్ తో ప్రారంభమైంది. ఇందిర తన టేబుల్ పై ఉన్న పేపర్స్, మ్యాగజైన్స్ లో సిల్క్ స్మిత సక్సెస్ స్టోరీలను గమనిస్తారు. ఆ తర్వాత ఎవరీ సిల్క్ అని అడుగుతారు. దీంతో మీరు ఐరన్ లేడీ అయినట్లు ఆమె మ్యాగ్నిటిక్ లేడీ అని సహాయకులు చెబుతారు. అనంతరం కారుతో చంద్రిక రవి ఎంట్రీ ఇస్తారు.
కారును పార్క్ చేసి.. ఒక బ్యాగ్ తో వీధుల్లో నడుస్తూ కనిపిస్తారు. దీంతో అంతా ఆమె వైపే కళ్లు మూయకుండా చూస్తారు. మూగ జీవాలకు బిస్కెట్లు పెడుతూ వెళ్తుంటారు. ఇంతలో ఓ అభిమాని తన ఎదురుగా నిల్చుంటారు. ఆమె తన లిప్ స్టిక్ తో అతడి బాడీపై లవ్ సింబల్ ను గీసి సిల్క్ ను రాస్తారు. ఆ తర్వాత అటు వెళ్లమాకే పడిపోతావ్.. విజయలక్ష్మి అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన డైలాగ్ తో గ్లింప్స్ ఎండ్ అయింది.
అయితే సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి కావడం గమనార్హం. ప్రస్తుతం సిల్క్ స్మిత బయోపిక్ అనౌన్స్మెంట్ గ్లింప్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. చంద్రిక రవి రోల్ కు కరెక్ట్ గా సరిపోయారని అంటున్నారు. విజయ్ అమృతరాజ్ నిర్మిస్తున్న బయోపిక్ షూటింగ్.. 2025 స్టార్టింగ్ లో ప్రారంభం కానుంది. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.