రేవ్ పార్టీ కేసు లో నటి హేమకు మరో ఎదురుదెబ్బ..?
నాలుగు నెలల క్రితం జరిగిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది.
నాలుగు నెలల క్రితం జరిగిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. అందుకు కారణం టాలీవుడ్ నటి హేమ అందులో పాల్గొన్నట్లు ఆరోపణలు రావడమే. తాను అసలు ఆ పార్టీకి వెళ్లలేదని హేమ అనేకసార్లు తెలిపింది. హైదరాబాద్ లోని తన ఇంట్లో ఉన్నట్లు వీడియోను పోస్ట్ చేసింది. తనకు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పింది.
అయితే కొద్ది రోజుల క్రితం, విచారణకు హాజరు కావాలని హేమకు బెంగళూరు పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇవ్వగా.. ఆమె అందుబాటులోకి రాలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ అనంతరం ఆమెను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా.. జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇవ్వగా.. హేమ జైలు నుంచి బయటకు వచ్చింది.
ఇటీవల ఆమెపై విధించిన సస్పెన్షన్ ను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎత్తివేసింది. తాను అత్యున్నత ల్యాబ్స్ లో టెస్టులు చేయించుకున్నట్లు రిపోర్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది హేమ. వాటిని 'మా'కు కొన్ని రోజుల క్రితం పంపింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని లేఖ రాసింది. అందుకే బెయిల్ పై బయటకు వచ్చానని పేర్కొంది. తనకు మద్దతు తెలపాలని కోరింది. రిపోర్టులను పరిశీలించిన మా.. సస్పెన్షన్ ను ఎత్తివేసేలా నిర్ణయం తీసుకుంది.
ఇదంతా బాగానే ఉన్నా.. హేమకు ఇప్పుడు భారీ షాక్ తగిలినట్టు వార్తలు వస్తున్నాయి. రేవ్ పార్టీ కేసుపై దర్యాప్తు చేపట్టిన బెంగళూరు పోలీసులు రీసెంట్ గా ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో 88 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. వారిలో హేమ పేరు కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
మొత్తం 1086 పేజీలతో ఉన్న ఛార్జ్ షీట్ ను పోలీస్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆ విషయం సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. ఛార్జ్ షీట్ విషయంపై నటి హేమ స్పందిస్తే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.