వైరల్ వీడియో: చైతూ అంటే ఇదే.. ఇలాంటివి ఎవరికీ తెలియదు!

సినిమాల ద్వారా రీల్ లైఫ్ లో ప్రేక్షకులను అలరించే హీరోలు, రియల్ లైఫ్ లో తాము చేసే మంచి పనుల వల్ల 'హీరోలు' అనిపించుకుంటారు.

Update: 2024-08-10 07:22 GMT

సినిమాల ద్వారా రీల్ లైఫ్ లో ప్రేక్షకులను అలరించే హీరోలు, రియల్ లైఫ్ లో తాము చేసే మంచి పనుల వల్ల 'హీరోలు' అనిపించుకుంటారు. అలాంటి అతికొద్ది మంది స్టార్స్ లో అక్కినేని నాగచైతన్య ఒకరు. అతను మంచి మనసున్న వ్యక్తి అని, గుడ్ హ్యూమన్ బీయింగ్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తోటి నటీనటులతో, దర్శకులతో ఎంతో వినయంగా నడుచుకునే చైతూ.. తన ఫ్యాన్స్ పట్ల ఎంతో ప్రేమను చూపిస్తారు. తన వ్యక్తిగత సిబ్బందిని కూడా సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటారు. చై వారికి ఎంత విలువ ఇస్తారనే దానికి తాజాగా జరిగిన ఓ విషయాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


కొంకిపూడి వెంకటేష్ అనే వ్యక్తి నాగ చైతన్యకు పర్సనల్ అసిస్టెంట్ గా వ్యవహరిస్తుంటారు. శుక్రవారం అతని పెళ్లి జరిగింది. రాజమండ్రిలో జరిగిన ఈ వివాహ వేడుకకు చైతూ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారిని ఆనందింపజేశారు. అక్కడే చాలాసేపు సమయం గడిపి, వారి కుటుంబ సభ్యులను సంతోష పరిచారు. అక్కడికి విచ్చేసిన అభిమానులతో ఓపికగా ఫోటోలు దిగి వారి హృదయాలను గెలుచుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాగ చైతన్య ఆగస్టు 8న హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. మరుసటి రోజే తన అసిస్టెంట్ మ్యారేజ్ కోసం హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి రాజమండ్రి వెళ్లారు. తన ఇతర పనులన్నీ పక్కన పెట్టి మరీ ఈ వివాహానికి అటెండ్ అయ్యారంటేనే చైతూ తన వ్యక్తిగత సిబ్బందికి, తన దగ్గర పనిచేసే వారికి ఎంత విలువ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇది అక్కినేని వారసుడి సింప్లిసిటీని, డౌన్ టూ ఎర్త్ స్వభావాన్ని మరోసారి అందరికీ తెలియజేస్తోంది. ఇది చూసి నిజంగా చై ఒక జెమ్ అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నిజానికి నాగచైతన్య ఎన్నో సార్లు తన మంచి మనసును చాటుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, ఎంతోమందికి హెల్ప్ చేసారు. కాకపోతే వాటిని బయటకు చెప్పుకోడానికి అతను పెద్దగా ఇష్టపడరు. అందుకే ఒకటీ రెండు విషయాలు మాత్రమే బయటకు వస్తుంటాయి. గతంలో ఓ చైల్డ్‌కేర్‌ సెంటర్‌ కు వెళ్లి అక్కడ క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరు నవ్వులు చిందించారు. సరదాగా ఆటలు ఆడి, బహుమతులు అందజేసి వారిలో మనో ధైర్యాన్ని నింపారు. అలానే ఇంతకముందు 'తండేల్' సెట్స్ లో తన అసిస్టెంట్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. ఇప్పుడు స్వయంగా పెళ్ళికి వెళ్లి అతన్ని సర్పైజ్ చేసారు. ఇవన్నీ సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి కాబట్టి చైతూ గురించి అందరికీ తెలిసింది. కానీ ఎవరికీ తెలియనివి చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఆయన అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పాలి.

ఇక సినీ కెరీర్ విషయానికొస్తే, లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, కింగ్ నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగచైతన్య.. వైవిద్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది 'దూత' అనే బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న చైతూ.. ప్రస్తుతం 'తండేల్' మూవీలో నటిస్తున్నారు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ లో తండేల్ రాజు అనే డీగ్లామర్ రోల్ లో చై కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.

Tags:    

Similar News