నటీనటులు : సిద్ధార్థ్, నిమిషా సజయన్, సహస్ర శ్రీ, సబియా తస్నీమ్, అంజలి నాయర్ తదితరులు
సంగీతం : దిబు నైనన్ థామస్, విశాల్ చంద్రశేఖర్(నేపథ్య సంగీతం)
సినిమాటోగ్రఫీ: బాలాజీ సుబ్రహ్మణ్యం
నిర్మాత: సిద్ధార్థ్
రచన, దర్శకత్వం: ఎస్.యు.అరుణ్‌కుమార్
తెలుగు వారికి ఏమాత్రం పరిచయం అక్కర్లేని హీరో సిద్ధార్థ్. తమిళ హీరోనే అయినా ఆయన చేసిన ఒకప్పటి తెలుగు సినిమాల వల్ల అతనికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. లాస్ట్ ఇయర్ మహా సముద్రంలో నటించిన సిద్ధార్థ్ ఈసారి తనే నిర్మాతగా మారి అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
మున్సిపాలిటీ లో పనిచేసే ఈశ్వర్ అలియాస్ చిన్నా (సిద్ధార్థ్)కు తన అన్న కూతురు సుందరి అలియాస్ చిట్టి (సహస్ర శ్రీ) అంటే ప్రాణం. అన్న చనిపోవడంతో వదిన, చిట్టి ఇద్దరిని బాధ్యతగా చూసుకుంటాడు ఈశ్వర్. చిట్టి స్నేహితురాలు మున్ని (సబియా తస్నీమ్) పై లైంగిక దాడ్ జరుగుతుంది. మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఆరోపణలతో పాటుగా ఓ వీడియో సాక్ష్యం కూడా ఉంటుంది. చిన్నా మీద పడిన ఈ మరక చెరిగిపోక ముందే చిట్టి కనిపించకుండా పోతుంది. చిట్టిని కిడ్నాప్ చేసింది ఎవరు..? చిట్టి కోసం చిన్నా ఏం చేశాడు..? చిట్టి ని చిన్నా దక్కించుకున్నాడా..? లాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.
కథనం - విశ్లేషణ :
చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంతో సిద్ధార్థ్ చేసిన ఈ చిన్నా అటెంప్ట్ మంచి ప్రయత్నమని చెప్పొచ్చు. అన్న చనిపోయాక అన్న కూతురు చిట్టికి తనే అన్ని అన్నట్టుగా అండగా ఉన్న ఈశ్వర్ పాత్రలో సిద్ధార్థ్ మరోసారి తన వెర్సటాలిటీ చూపించారు. చిన్నారులపై లైంగిక దాడుల మీద కథ రాసుకున్న దర్శకుడు అరుణ్ కుమార్ ఆ కథను నడిపించిన తీరు అక్కడక్కడ కాస్త స్లో అయినట్టు అనిపించినా సరే ఓవరాల్ గా తన దర్శకుడిగా తన ముద్ర వేశాడు.
చిన్నా సినిమా మొదలైన కొద్దిసేపటికే బాబాయ్ అమ్మాయి అనుబంధానికి ఆడియన్స్ కూడా ఎంగేజ్ అవుతారు. ఇక తను చేయని తప్పుకి చిన్నా శిక్ష అనుభవించగా ఇంటర్వెల్ సీన్ కథను మరో వైపు తీసుకెళ్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక పంథాలో నడించిన చిన్నా సినిమా సెకండ్ హాఫ్ కిడ్నాప్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లోకి మారుతుంది. ఇలాంటి కథలు చెప్పాలంటే కథ రాసుకుంటే సరిపోదు ఆ పాత్రలకు న్యాయం చేసే నటులు కావాలి చిన్నాలో అది బాగా కుదిరింది.
సెకండ్ హాఫ్ సినిమా అంతా కాస్త సాగదీసినట్టు అనిపించినా వెంటనే సరిదిద్దుకున్నాడు దర్శకుడు. ఇక ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ కచ్చితంగా ఇలాంటి సంఘటన మనకు జరిగితే ఎలా ఉంటుంది అన్న రీతిలో ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. క్లైమాక్స్ లో కూడా పగ తీర్చుకోవడం కాదు కుటుంబానికి అండగా ఉండటమే ముఖ్యమని ముగించడం మెప్పించింది.
సిద్ధార్థ్ సినిమా అంటే ఒకప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాలి అన్నంత ఎగ్జైట్ మెంట్ ఆడియన్స్ లో ఉండేది. అయితే దశాబ్ద కాలం నుంచి సిద్ధార్థ్ కేవలం తమిళ సినిమాలే చేస్తూ వచ్చాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన మహా సముద్రం కూడా మెప్పించలేదు. అయితే ఈసారి తనే నిర్మాతగా చేసిన చిన్నా తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో కెరీర్ బెస్ట్ మూవీ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పాడు సిద్ధార్థ్. నిర్మాతగా అతను ఎంచుకున్న కథ.. దాన్ని చెప్పాలని చేసిన సిన్సియర్ ఎఫర్ట్ చూస్తే అతను చెప్పింది నిజమే అని ఒప్పుకోవాల్సిందే.
ప్రతి సినిమాను కమర్షియల్ మీటర్ లో చూడటం కష్టం. కానీ చిన్నా లాంటి సినిమాల వల్ల మనలో మనం జాగ్రత్త పడతాం.. చుట్టు పక్కన ఏం జరుగుతుంది అని అన్వేషణలో ఉంటాం. రోజు న్యూస్ ఛానెల్స్, పేపర్స్ లో చదివే చిన్నా సినిమా కథల్లాంటి వార్తలు వింటూనే ఉంటాం. అలాంటి కథతో సిద్ధార్థ్ చేసిన ఈ ప్రయత్నం హృదయాలను టచ్ చేసింది.
నటీనటులు :
ఈశ్వర్ పాత్రలో సిద్ధార్థ్ మరోసారి తన నటన ప్రతిభ కనబరిచాడు. ఎక్కడ సిద్ధార్థ్ తన లవర్ బోయ్ ఇమేజ్ ని గుర్తు చేయలేదు. ఎలాంటి పాత్రలో అయినా తను సూట్ అవుతాడని మరోసారి ప్రూవ్ చేశాడు. ఇక సినిమా కథలో భాగమైన ఇద్దరు చిన్నారులు కూడా బాగా చేశారు. చిట్టి పాత్రలో చేసిన సహస్ర శ్రీ, మున్నీ పాత్రలో నటించిన సబియా తస్నీమ్ ఇద్దరు బాగా చేశారు. ఈశ్వర్ వదిన పాత్రలో అంజలి నాయర్ తన సహజ నటనతో మెప్పించారు. నిమిషా సజయన్ కూడా పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. సిద్ధార్థ్ స్నేహితులుగా చేసిన ఇద్దరితో పాటుగా మిగతా పాత్రదారులంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం :
చిన్నా సినిమాకు సాంకేతిక వర్గం కూడా మంచి సపోర్ట్ అందించింది. బాలాజీ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. సినిమా కథకు తగినట్టుగా కెమెరా వర్క్ ఉంది. మ్యూజిక్ కూడా కథ కథనానికి అనుగుణంగా ఉంది. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డైరెక్టర్ అరుణ్ కుమార్ తను రాసుకున్న కథకు మంచి కథనంతో సినిమా చూసిన ఆడియన్స్ ఆలోచించేలా చేశాడు.
చివరిగా :
చిన్నా.. సిద్ధార్థ్ సిన్సియర్ ఎఫర్ట్..!
రేటింగ్ : 2.5/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater