ఫిష్ వెంకట్.. మెగా సాయానికి థాంక్స్!
కరోనా క్రైసిస్ సమయంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న మెగా కుటుంబం తమ సేవల్ని ఇప్పటికీ యథావిధిగా కొనసాగిస్తోంది.
కరోనా క్రైసిస్ సమయంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న మెగా కుటుంబం తమ సేవల్ని ఇప్పటికీ యథావిధిగా కొనసాగిస్తోంది. ముఖ్యంగా పరిశ్రమలో ఉన్న చాలా మంది పేద ఆర్టిస్టులను ఆదుకోవడంలో మెగాస్టార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారికి అవసరం మేర ఆర్థిక సహాయం అందించడం, అనారోగ్యంతో ఉన్నవారికి ఆస్పత్రి వైద్య సేవలను అందించడం వంటి సహాయం చేస్తున్నారు.
కేవలం తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి మాత్రమే కాదు, పొరుగున ఉన్న తమిళ చిత్ర సీమలో ఆర్టిస్టులకు కష్టంలో ఉన్నవారికి మెగాస్టార్ తనవంతు సహాయం అందిస్తున్నారు. అన్నయ్య నా ప్రాణం కాపాడాడు! అంటూ తమిళ నటుడు పొన్నాంబళం ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అనారోగ్యంతో ఉన్న తనకు అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయించారని, దానికోసం 65లక్షల మొత్తం ఖర్చును చిరంజీవి భరించారని వెల్లడించారు.
తెలుగు చిత్రసీమలో ఎందరో ఆర్టిస్టులు సాంకేతిక నిపుణులకు ఇలాంటి కష్టం వచ్చినప్పుడు చిరు ఆదుకున్నారు. వాటిలో చాలా గుప్తదానాలు ఉన్నాయి. పొట్టి వీరయ్య, అల్లరి సుభాషిణి, పవలా శ్యామల వంటి వారికి ఆర్థిక విరాళాలు అందించి వారిని కష్టంలో ఆదుకున్నారు. పేద కళాకారులకు సహకరించే కాదంబరి కిరణ్ సేవా సంస్థకు కూడా ఆర్థిక సాయం అందించారు చిరు. ఇంకా బయటికి తెలియని ఆర్థిక విరాళాలు ఎన్నో.
ఇప్పుడు టాలీవుడ్ లో ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసింది. గత కొన్ని నెలలుగా వెంకట్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. మూత్రపిండాల వైఫల్యం, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని తెలిసింది. అయితే అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి.. మెగా వారసుడు రామ్ చరణ్ కూడా తనకు చికిత్స చేయించుకోవడానికి సహకరిస్తున్నారని వెల్లడించారు. తన పరిస్థితిని తెలుసుకుని తండ్రీ కొడుకులు ఎంతగానో ఆర్థిక సహాయం చేసారని కూడా ఫిష్ వెంకట్ వెల్లడించారు. మెగా కుటుంబం ఈ తరహా సేవల్ని పరిశ్రమ కోసం నిరంతరాయంగా చేస్తోంది. అభిమానులు, కష్టంలో సహాయం అర్థించిన ప్రజలకు మెగా సాయం అందుతూనే ఉంది. ఫిష్ వెంకట్ కష్టం చూసి నిర్మాత చదవలవాడ లక్ష ఆర్థిక సహాయం చేసారు.