ఫ్యాన్స్ గురించి చిరు కామెంట్స్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి తాజాగా అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డు వేడుకలో పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి తాజాగా అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డు వేడుకలో పాల్గొన్నారు. అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డును చిరు దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డును అందుకునేందుకు చిరంజీవి ఆ వేడుకకి హాజరు అయ్యారు. ఆ సమయంలోనే బాలకృష్ణ, వెంకటేష్ లతో వేదికను షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. ఐఫా వేడుకల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానుల గురించి, వారిపై తనకు ఉన్న ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి.
అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డును సొంతం చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... తన అభిమానులు చూపించే అభిమానం మించిన అవార్డు ఇంకోటి లేదని, వారి అభిమానం తర్వాతే మిగిలిన అన్ని అవార్డులు అన్నట్లుగా మెగాస్టార్ కామెంట్స్ చేశారు. చిరంజీవికి ఫ్యాన్స్ అంటే ప్రత్యేకమైన అభిమానం అనే విషయం గతంలోనూ పలు సార్లు నిరూపితం అయింది. ఆయన మాటల్లోనే కాకుండా చేతల్లోనూ ఫ్యాన్స్ పై ఉన్న అభిమానంను పలు సార్లు చూపించారు. ఇప్పుడు మరోసారి ఆయన తన అభిమానం ను చూపించారు.
చిరంజీవి ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి అవ్వాల్సి ఉన్నా ఇటీవల చిరంజీవి తీవ్రమైన వైరల్ ఫివర్ తో బాధ పడ్డారు. దాదాపు మూడు వారాల పాటు పూర్తిగా ఇంటికే చిరంజీవి పరిమితం అయ్యారు. అందుకే విశ్వంభర సినిమా కాస్త ఆలస్యం అయింది. అక్టోబర్ లో సినిమా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా ను 2025 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
విశ్వంభర సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రల్లో పలువురు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారట. మొత్తానికి ఈ సినిమా చాలా స్పెషల్ గా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. చిరంజీవి చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. చిరు గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. కానీ విశ్వంభర మరోసారి చిరంజీవి స్టామినాను ఇండియన్ సినిమాకు చూపించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.