వినోద‌రంగంలోని ధ‌నికుల్లో చిరంజీవి లేరా?

ఇటీవ‌ల భార‌త‌దేశంలోని టాప్ 100 ధ‌నికులైన సెల‌బ్రిటీల గురించి హురున్ ఇండియా ఒక జాబితాను వెలువ‌రించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-02 02:45 GMT

ఇటీవ‌ల భార‌త‌దేశంలోని టాప్ 100 ధ‌నికులైన సెల‌బ్రిటీల గురించి హురున్ ఇండియా ఒక జాబితాను వెలువ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ జాబితాలో షారూఖ్, జూహీ చావ్లా, హృతిక్ రోష‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి సినిమా స్టార్ల పేర్లు ఉన్నాయి. కానీ ఈ జాబితాలో టాలీవుడ్ కోలీవుడ్ నుంచి ఒక్క హీరో పేరు కూడా లేదు.

1000 కోట్లు అంత‌కుమించిన ఆస్తులు ఉన్న సినీప్ర‌ముఖుల జాబితాను హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్ర‌క‌టించ‌గా అందులో సౌత్ స్టార్ల పేర్లు ఒక్క‌టీ క‌నిపించ‌క‌పోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. నిజానికి హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో చేర్చేందుకు మెగాస్టార్ చిరంజీవి అత‌డి కుటుంబం క‌నిపించ‌లేదా?

చిరంజీవి స‌హా మెగా కుటుంబ హీరోలంద‌రి నిక‌ర ఆస్తులు క‌లుపుకుని 6000 కోట్లు ఉంటుంద‌ని జాతీయ మీడియాలు గ‌తంలో క‌థ‌నాలు ప్ర‌చురించాయి. కేవ‌లం చిరంజీవి ఆస్తి 1600 కోట్ల వ‌ర‌కూ ఉంద‌ని, చ‌ర‌ణ్ కూడా ఇంచుమించు ఇదే రేంజులో కూడ‌బెట్టార‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. చ‌ర‌ణ్ - ఉపాస‌న జంట ఆస్తులు పెద్ద స్థాయిలో ఉన్నాయి. ప్ర‌ఖ్యాత GQ మ్యాగ‌జైన్ 2022 క‌థ‌నం ప్రకారం.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నికర ఆస్తి విలువ రూ. 1650 కోట్లు. ఈ ఆదాయాలు నటనకు పారితోషికం, వ్యాపార వెంచర్లు, ప‌లు రంగాల్లో పెట్టుబడులు సహా వివిధ వనరుల నుండి వచ్చాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా చిరంజీవి కొన‌సాగుతున్నార‌ని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది.

భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఫిల్మీ ఫ్యామిలీగా మెగా ఫ్యామిలీకి గుర్తింపు ఉంది. ఈ కుటుంబానికి ఐదు ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ‌ సంస్థలు(బ్యాన‌ర్లు) ఉన్నాయి. ఈ కుటుంబంలో హీరోలంద‌రికి ద‌శాబ్ధాల పాటు కెరీర్ జోరు కొన‌సాగింది. సంపాద‌న పెరిగిందే కానీ త‌ర‌గ‌లేదు. చిరంజీవి ఇంట్లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్, నాగ‌బాబు, రామ్ చ‌రణ్, అల్లు అర్జున్, మేన‌ల్లుళ్లు సాయి తేజ్, వైష్ణ‌వ్ తేజ్, వ‌రుణ్ తేజ్ ఇలా ప‌లువురు హీరోలు ఉన్నారు. వీరంద‌రి సంప‌ద‌లు కూడా క‌లుపుకుంటే ఏకంగా మెగా కుటుంబానికి 6000 కోట్ల ఆస్తులున్నాయ‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ హురున్ ఇండియా ధ‌నికుల జాబితాలో చేరేందుకు మెగాస్టార్ అర్హ‌త సాధించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. పారిశ్రామిక వేత్త‌ల్లో గౌత‌మ్ అదానీ, ముఖేష్ అంబానీ తొలి రెండు స్థానాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News