మెగాస్టార్ కి దర్శకుడు కావలెను..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమా విశ్వంభర ను చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమా విశ్వంభర ను చేస్తున్నారు. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో విశ్వంభర ను నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా ఆ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. చిరంజీవి చాలా సంవత్సరాల తర్వాత ఒక సోషియో ఫాంటసీ కథ లో నటిస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా విశ్వంభర ఉంటుందనే నమ్మకం మెగా ఫ్యాన్స్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
విశ్వంభర కంటే కూడా ముందు చిరంజీవి తన కూతురు సుస్మిత బ్యానర్ గోల్డ్ బాక్స్ బ్యానర్ లో ఒక సినిమాను చేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సుస్మిత బ్యానర్ లో సినిమా దాదాపు కన్ఫర్మ్ అనుకున్న సమయంలో అనూహ్యంగా భోళా శంకర్ తో పాటు మరో ఫ్లాప్ పడటంతో చిరంజీవి ఆలోచనలో పడ్డారు. అందుకే విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేసేందుకు కమిట్ అవ్వడం, వెంటనే డేట్లు కూడా ఇవ్వడం జరిగింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. మరో నాలుగు, అయిదు వారాల్లో విశ్వంభర సినిమా పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవి కొత్త సినిమా మెగా 157 ను ప్రారంభించాలని అనుకున్నారు. అందుకే ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరు 157 ను ప్రకటించాలని అనుకున్నారు. సుష్మిత బ్యానర్ లో చిరు 157 సినిమా రూపొందబోతుంది. అధికారికంగా ప్రకటన చేయాలని భావించినప్పటికి దర్శకుడి ఎంపికపై తుది నిర్ణయం తీసుకోలేదు. అందుకే వాయిదా వేశారట.
ఆ మధ్య ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలి అనే ఉద్దేశ్యంతో చిరంజీవి మారుతి మొదలుకుని మోహన్ రాజా, హరీష్ శంకర్, అనుదీప్ ఇంకా కొంత మంది కొత్త దర్శకులకు ఓకే చెప్పాడు. కానీ వారిలో ఏ ఒక్కరు కూడా 157 వ సినిమాకు న్యాయం చేస్తారని చిరంజీవి నమ్మడం లేదట. అందుకే ఇప్పటికి కూడా దర్శకుడి పై తుది నిర్ణయానికి చిరు 157 మేకర్స్ మరియు యూనిట్ సభ్యులు నిర్ణయానికి రాలేక పోతున్నారట. అందుకే చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆ సినిమా అప్డేట్ ఇవ్వలేదని అంటున్నారు. విశ్వంభర సినిమా షూటింగ్ పూర్తి అయ్యి, విడుదల అయిన తర్వాతే 157 వ సినిమా పై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.