మెగాస్టార్‌తో 'అభిమన్యుడు' డైరెక్టర్?
ప్రయోగాలు చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు.
ప్రయోగాలు చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. కమర్షియల్ జానర్ లో గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు లాంటి సినిమాల్లో నటించిన చిరంజీవి స్వయంకృషి, ఛాలెంజ్, అభిలాష, ఆపద్భాందవుడు లాంటి కల్ట్ సినిమాల్లోను నటించి ప్రయోగాల్లో రారాజు అని నిరూపించారు. `ఖైదీనంబర్ 150` లాంటి ఫక్తు కమర్షియల్ సినిమాలో నటించినా పొలిటికల్ డ్రామా కథాంశంతో `గాడ్ ఫాదర్`గా ప్రయోగం చేసినా, లేదా సైరా నరసింహారెడ్డిగా హిస్టారికల్ కంటెంట్ తో పాన్ ఇండియాను ఢీకొట్టినా జయాపజయాల గురించి ఆలోచించకుండా ప్రయోగాలు చేసారు చిరంజీవి.
అందుకే ఇప్పుడు ఆయన అభిమన్యుడు ఫేం పి.ఎస్. మిత్రన్ కి అవకాశం ఇచ్చారు అనగానే మరోసారి టాలీవుడ్ లో ఆసక్తికర డిబేట్ మొదలైంది. ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి ఇలా క్లూ అందిందో లేదో మెగాస్టార్ మరోసారి ప్రయోగానికి సిద్ధమయ్యారని భావిస్తున్నారు. సైబర్ క్రైమ్ నేపథ్యంలో అభిమన్యుడు లాంటి క్లాసిక్ ని విశాల్ హీరోగా తెరకెక్కించి సంచలనం సృష్టించిన మిత్రన్ ఇప్పుడు మెగాస్టార్ కి ఎలాంటి కథ వినిపించబోతున్నారు? అన్నది ఆసక్తిగా మారింది.
అంతేకాదు ఇంతకుముందు రామ్ చరణ్ తో సినిమా కోసం ప్రయత్నించిన మిత్రన్ అదే స్క్రిప్టును ఇప్పుడు చిరు కోసం డైవర్ట్ చేసారా? అన్నది సందేహం గా మారింది. చిరుతో అతడు చేసే సినిమా ఎలా ఉండబోతోంది? స్క్రిప్టు ఏంటి? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు వశిష్ట సినిమాకి పని చేసిన రచయితల బృందం మిత్రన్ తో కలిసి స్క్రిప్టు పై పని చేస్తున్నారని కూడా లీక్ అందింది. వశిష్టతో సినిమా మిత్రన్ సినిమా పట్టాలెక్కే వీలుందని కూడా తెలిసింది. వశిష్ట సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలనేది ప్లాన్. చిరు కుమార్తె సుస్మిత కొణిదెలతో కలిసి తమిళ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. భోళాశంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత చిరు మైండ్ ఫాస్ట్ గా మూవ్ అవుతోందనడానికి ఇది ఎగ్జాంపుల్. భోళా తప్పిదాన్ని ఇప్పుడు ఇలా కవర్ చేస్తున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అతడి ప్రత్యేకత అదే:
పి.ఎస్. మిత్రన్ తమిళ చిత్రాలతో పాపులరయ్యాడు. అతడు ప్రత్యేకత ఉన్న దర్శకుడు. హీరో (2019), సర్దార్ (2022), ఇరుంబు తిరై (2018) చిత్రాలతో పాపులరయ్యాడు. ఇరుంబు తిరై అభిమన్యుడు పేరుతో తెలుగులో విడుదలై విజయం సాధించింది.