చిరుకు బ్రిటన్ పౌరసత్వం.. ఇదీ అసలే నిజం
చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు ప్రణాళికల్లో ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దుబాయ్ టూర్ ముగించి తిరిగి 'విశ్వంభర' చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తదుపరి అనిల్ రావిపూడితో కలిసి ఒక సినిమా చేయనున్నారు. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెతో నిర్మించనుంది. చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు ప్రణాళికల్లో ఉన్నారు.
ఇలాంటి సమయంలో అతడిపై సోషల్ మీడియాలో జరుగుతున్న తాజా ప్రచారం ఆశ్చర్యపరుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం ఇచ్చారని మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది పూర్తిగా అబద్ధమని మెగా కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి చిరంజీవిని యుకే (బ్రిటన్)లో సత్కరించేందుకు ఒక కార్యక్రమానికి ఆహ్వానించగా, దానికి చిరు హాజరు కావడం లేదని తెలిసింది.
ఇటీవలే చిరు యుఏఇ ట్రిప్ నుంచి తిరిగి హైదరాబాద్ కి వచ్చారు. ప్రస్తుతం విశ్వంభర షూట్ లో బిజీ అయ్యారు. ఇది ఫాంటసీ యాక్షన్ చిత్రం. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి, త్రిష, కునాల్ కపూర్, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ తదితరులు నటిస్తున్నారు.
గతంలో చిరంజీవి ఎమిరేట్స్ ఫస్ట్ ద్వారా యుఎఇ ప్రభుత్వం నుండి గోల్డెన్ వీసా అందుకున్నారు. మహేష్ వంటి ప్రముఖులకు ఈ వీసా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రముఖులు వారి వృత్తి నిబద్ధత, అంకితభావంతో చేసిన సేవలను గుర్తించి ఇచ్చే వీసా ఇది. ఈ వీసా రావాలంటే క్రిమినల్ రికార్డును కూడా పరిశీలిస్తారు.