ఎన్టీఆర్‌కి భారతరత్న.. చిరు పాత ట్వీట్ వైరల్
ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించకపోవడంపై తెలుగు సమాజంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నారు.
సీనియర్ నటుడు, లెజెండ్ ఎన్టీఆర్ కి కేంద్రం నుంచి కేవలం పద్మశ్రీ మాత్రమే వచ్చింది.. పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ లేవు. కెరీర్ లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ లేదు. నాటి కేంద్ర రాజకీయ సంకుచితత్వం కూడా దీనికి కారణం. కానీ ఇటీవల కేంద్రం తీరు మారుతోంది. తెలుగు వారిపై ప్రేమ పెరిగింది. అట్నుంచి సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇదే విషయంపై ఇప్పుడు మరోసారి తెలుగు ఫిలింసర్కిల్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్రభుత్వం అందించే పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవాన్ని అందుకున్నారు. గత ఏడాది అదే మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకోవడం వెనక కారణాలు గమనార్హం. నెమ్మదిగా తెలుగు చిత్రసీమ ప్రముఖుల ప్రతిభ, కృషికి కేంద్ర స్థాయిలో గొప్ప గుర్తింపు గౌరవం లభిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విభిన్న రంగాల నుంచి 2024లో మొత్తం ఐదుగురు తెలుగు తేజాలకు పద్మవిభూషణ్ పురస్కారాలు దక్కగా, 15 మంది తెలుగు వారికి పద్మ పురస్కారాల్ని ప్రకటించింది కేంద్రం.
అయితే పద్మ పురస్కార ప్రకటన వేళ... నందమూరి అభిమానుల్లో చాలా మంది నవరసనటసార్వభౌముడు, అన్నగారు ఎన్టీఆర్ కి భారతరత్న దక్కాలని కూడా ప్రస్థావిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక పురస్కారానికి అన్నివిధాలా అర్హత ఉన్న నటుడు, గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు అనే అభిప్రాయం అందరిలో ఉంది. తారక రామారావు విజయవంతమైన నటుడు, చిత్రనిర్మాత, దర్శకరచయిత, రాజకీయ నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.
ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించకపోవడంపై తెలుగు సమాజంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్‌కు `భారతరత్న` ఇవ్వాలని డిమాండ్ చేసారు. సంగీతకారుడు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న ఎలా లభించిందో అందరికీ గుర్తు చేస్తూ చిరంజీవి షేర్ చేసిన గత ట్వీట్ ఇప్పుడు మరోసారి అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
చిరంజీవి తన నోట్‌లో ఇలా రాశారు.``లెజెండరీ సింగర్ కం సంగీతకారుడు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న అవార్డు లభించింది. అదేవిధంగా ఎన్టీఆర్‌కు మరణానంతరం భారతరత్న ప్రకటించడం యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ ఘట్టం. త్వరలో ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకలు జరుపుకోబోతున్నాం, ఈ సందర్భంగా ప్రభుత్వం ఆ దిగ్గజ నటుడికి భారతరత్న ప్రకటించాలి`` అని చిరు అన్నారు. ఏ రోజుకైనా నవరసనటసార్వభౌముడు ఎన్టీఆర్ కి భారతరత్న ప్రకటిస్తారనే ఆశ అభిమానుల్లో సజీవంగా ఉంది.