నేను 90 ఇస్తే బన్నీ 100 శాతం ఇచ్చాడు!
`పుష్ప-2`లో జాతర పాట ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ పాటలో బన్నీ పెర్పార్మెన్స్ కి మరోసారి జాతీయ అవార్డు ఖాయమనే ప్రచారం జరుగుతోంది
`పుష్ప-2`లో జాతర పాట ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ పాటలో బన్నీ పెర్పార్మెన్స్ కి మరోసారి జాతీయ అవార్డు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. సినిమా అంతా ఒక ఎత్తైతే? ఆ ఒక్క జాతర పాట మరో ఎత్తులా నిలిచింది. ఆ పాటలో బన్నీ ఆహార్యం నిజంగా గంగమ్మ తల్లినే తలపించింది. ఇక ఆ పాటలో బన్నీ డాన్సు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో సైతం ప్రేక్షకులకు పూనకాలొచ్చి ఊగిపోయారు.
మరి ఆ డాన్సు సృష్టి కర్త బన్నీ గురించి ఏమంటున్నాడు? ఆ పాట కోసం ఎంతగా శ్రమించాల్సి వచ్చింది? అన్నది తాజాగా కొరియోగ్రాఫర్ పొలాకి విజయ్ రివీల్ చేసారు. `టైటిల్ గీతాన్ని పూర్తిగా పుష్ప రాజ్ పాత్ర నుంచే కంపోజ్ చేసాం. పాటలో కనిపించే ఛాయ్ గ్లాస్ స్టెప్, ఫోన్ స్టెప్, ఫైర్ సిగరెట్టు స్టెప్ ప్రతీది పుష్ప పాత్ర తీరును ప్రతి బింబించేలా ఉంటాయన్నారు. జాతర పాట గురించి సుకుమార్ నాకు చెప్పినప్పుడు భావోద్వేగానికి గురయ్యాను.
ఆ పాటను మొదట ఓ బిట్ సాంగ్ లా చేయాలనుకున్నారు. ఆ పాట కోసం నేను 90 రోజులు ప్రిపేర్ అయ్యాను. 20 రోజుల పాటు షూటింగ్ చేసాం. మేము ఆ పాట కోసం 90 శాతం ఇస్తే బన్నీ 100 శాతంతో దాన్ని పూర్తి చేసారు. తన పెర్పార్మెన్స్ తోనే పాట మరో స్థాయికి వెళ్లింది. టైటిల్ గీతం, జాతర పాట కెరీర్ లోనే మైలురాయిగా మిగిలి పోతాయ`న్నారు. పోలాకి విజయ్ `కొబ్బరి మట్ట` సినిమాతో పరిచయమయ్యారు.
ఆ తర్వాత `పలాస` చిత్రంలో పాటలకు డాన్సు కొరియోగ్రఫీ చేసారు. ఆ రెండు సినిమాల్లో అతడి మాస్ స్టెప్పులు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. `పలాస`లో `నక్కిలీసు గొలుసు` పాట ఎంతో సంచలనమైందో తెలిసిందే. ఆ పాట విజయ్ కి మంచి పేరు తీసుకొచ్చింది. అవి చూసే సుకుమార్ పుష్ప సినిమాలో ఉ అంటావా మావ పాటకు గణేష్ ఆచార్య మాస్టర్ తో కలిసి పనిచేసే అవకాశం కల్పించారు.