స్టార్ కమెడియన్ కి ఘోర అవమానం!
ఇండియన్ చార్లీ చాప్లిన్ రాజబాబు వెండి తెరని ఏలిన దిగ్గజ నటుడు. అసాధారణ ప్రతిభతో ప్రేక్షకుల్ని మెప్పించిన గొప్ప నటుడు.
ఇండియన్ చార్లీ చాప్లిన్ రాజబాబు వెండి తెరని ఏలిన దిగ్గజ నటుడు. అసాధారణ ప్రతిభతో ప్రేక్షకుల్ని మెప్పించిన గొప్ప నటుడు. కామెడీ పాత్రల్లో ఆయనో లెజెండ్. కామెడీలో కొత్త పంథాని పరిచయం చేసిన నటుడు. రెండు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకుల్ని తనదైన కామెడీతో ఉర్రూతలూగించిన నటుడు. అప్పటి తరం దర్శకులు మెచ్చిన నట దిగ్గజం. నటుడిగానే కాదు నిర్మాతగానూ రాజబాబు పరిశ్రమలో రాణించారు. అలాంటి లెజెండరీ సైతం ఇండస్ట్రీలో అవమానించ బడ్డవారే అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజుబాబు తీరు నచ్చక ఓ నటుడు ఏకంగా తన సినిమా నుంచే తొలగించి అవమాన పరిచిన ఘటన గురించి సోదరుడు చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. `మా అన్నయ్య నాటకాలు వేసేవాడు . అది మా నాన్నగారికి ఇష్టం ఉండేది కాదు. ఆయన తిట్టడం .. కొట్టడం కూడా చేసేవాడు. అయినా నటన అంటే ఉన్న ఇష్టం కారణంగా అన్నయ్య మానుకునేవాడు కాదు. అలాంటి ఇష్టమే ఆయనను మద్రాసు తీసుకుని వెళ్లింది. అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఒక సినిమాలో ఛాన్స్ సంపాదించుకున్నాడు.
తొలి సినిమాలో అన్నయ్య మొదటి సీన్ రేలంగిగారి కాంబినేషన్లో పడింది . అది కూడా సింగిల్ డైలాగ్. రేలంగి గారు లోపల వేరే సీన్లో ఉన్నారు. అన్నయ్య మేకప్ వేసుకుని బయట కూర్చున్నాడు. అక్కడ నాగభూషణం గారు .. సత్యనారాయణగారు ఉన్నారు. వాళ్లు అన్నయ్యను మిమిక్రీ చేయమని అడిగితే చేశాడు. రేలంగిగారిని ఇమిటేట్ చేయమని అంటే చేశాడు. అదే సమయంలో లోపలి నుంచి పిలుపు వచ్చింది. దాంతో అన్నయ్య లోపలికి పరిగెత్తుకు వెళ్లాడు.
అప్పటి వరకూ రేలంగిని ఇమిటేట్ చేసిన అన్నయ్య లోపల కూడా తనకి ఇచ్చిన డైలాగ్ ను రేలంగి స్టైల్లో నే చెప్పాడు. అంతే రేలంగిగారికి చాలా కోపం వచ్చేసింది. `పాండీబజార్ నుంచి తీసుకుని వచ్చారా .. పంపించండి బయటికి` అని గట్టిగా కేక వేసారు. ఎంతమంది చెప్పినా రేలంగిగారు ఎవరి మాట వినిపిం చుకోలేదు. రాజుబాబుని తీసేయాల్సిందేనని పట్టుబట్టి కూర్చున్నారు. దాంతో ఆ సినిమాలో నుంచి రాజబాబుని తీసేశారు. తొలి సినిమాకే ఇలా జరగడంతో రాజబాబు చాలా బాధపడ్డాడు. సరదాగా చేసిన పనికి ఆయనెందుకు అంత సీరియస్ అయ్యాడని రాజుబాబు నాతో చాలాసార్లు అన్నాడు` అని అన్నారు.