కొత్త తరం కమెడియన్స్ కమ్‌ హీరోస్‌ ఫ్యూచర్‌ ఏంటి?

కమెడియన్స్ హీరోలు అవ్వడం టాలీవుడ్‌ లో కొత్తేం కాదు. ఇప్పటికే ఎంతో మంది కమెడియన్స్ హీరోలుగా నటించారు.

Update: 2024-03-13 15:30 GMT

కమెడియన్స్ హీరోలు అవ్వడం టాలీవుడ్‌ లో కొత్తేం కాదు. ఇప్పటికే ఎంతో మంది కమెడియన్స్ హీరోలుగా నటించారు. వారిలో కొందరు హిట్ అవ్వగా మరి కొందరు ఒక్కటి రెండు సినిమాలతోనే కనుమరుగయ్యారు. అప్పట్లో రాజబాబు మొదలుకుని తాజాగా వైవా హర్ష వరకు ఎంతో మంది తెలుగు కమెడియన్స్ హీరోలుగా చేసి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

అలీ, రాజేంద్రప్రసాద్‌ మరి కొందరు హీరోలుగా కమెడియన్‌ కమ్‌ హీరో అనిపించుకున్నారు. అయితే కొత్త తరంకు చెందిన కమెడియన్స్ లో చాలా తక్కువ మంది మాత్రమే హీరోలుగా హిట్‌ అవుతున్నారు. సునీల్ హీరోగా చేసి కొన్నాళ్లకే కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.

ఈ మధ్య కాలంలో పలువురు కమెడియన్స్ హీరోలుగా మారి తమ అదృష్టంను పరీక్షించుకున్నారు. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది సుడిగాలి సుధీర్‌. జబర్దస్త్‌ ద్వారా ఈయన పరిచయం అయ్యి, బుల్లి తెర స్టార్‌ అనిపించుకుని వెండి తెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు కమర్షియల్‌ గా సుడిగాలి సుధీర్ హిట్‌ అందుకోలేదు.

ప్రియదర్శి కూడా కమెడియన్ గా మంచి పేరు దక్కించుకున్నాడు. హీరోగా బలగంతో పాటు మరో రెండు మూడు సినిమాలు చేశాడు. బలగం మినహా ప్రియదర్శికి భారీ విజయాలు దక్కలేదు. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

యూట్యూబ్‌ నుంచి సినిమాల్లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన వైవా హర్ష హీరోగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుందరం మాస్టర్‌ సినిమాతో హీరోగా పరిచయం అయిన హర్ష కి కాలం కలిసి రాలేదు. ఆ సినిమా కి పాజిటివ్ టాక్ దక్కలేదు.

అభినవ్ గోమఠం కూడా కమెడియన్‌ గా చాలా ఫేమస్. ఆయన ఈ మధ్య మెయిన్ లీడ్‌ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు కమెడియన్ గా వచ్చినంత ఫేమ్‌ మాత్రం హీరోగా రాలేదని చెప్పాలి. ఇంకా పలు సినిమాల్లో ఈయన నటిస్తూనే ఉన్నాడు.

వెన్నెల కిషోర్, సత్యం రాజేష్‌ ఇలా చాలా మంది కూడా కమెడియన్‌ గా చేస్తూ హీరోగా ప్రయత్నిస్తున్నారు. ఒక వేళ హీరోగా సక్సెస్ అవ్వకుంటే అంతా కూడా కమెడియన్‌ గా కంటిన్యూ అవుతున్నారు. హీరోగానే చేయాలని వీరు పట్టుదలతో ఉంటే మాత్రం కష్టం అని గతంలో కమెడియన్స్ ఎదుర్కొన్న పలు అనుభవాలు చెప్పకనే చెబుతున్నాయి.

Tags:    

Similar News