ఏడెక‌రాలు ఆక్ర‌మణ కేసులో ప్ర‌కాష్‌రాజ్‌పై కోర్టు విచార‌ణ‌

తాజాగా దీనిపై చెన్నై హైకోర్టులో విచార‌ణ సాగుతోంది. ప్ర‌కాష్ రాజ్ ఏడెక‌రాల కొండ భూమిలో నిర్మాణాలు చేప‌ట్టార‌ని, బాబి ఒక ఎక‌రంలో భ‌వంతిని నిర్మిస్తున్నార‌ని కూడా క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

Update: 2024-01-05 15:21 GMT

కొడైకెనాల్‌లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకు ప్ర‌ముఖ న‌టులు ప్రకాష్‌రాజ్, బాబీ సింహాలకు గ‌త ఏడాదిలో నోటీసులు అందిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందే త‌మిళ‌నాడు దేవాదాయ శాఖ స‌మ‌క్షంలో రెవెన్యూ అధికారులు ఇరువురి భూములను పరిశీలించారు. కొడైకెనాల్‌లోని విల్‌పట్టి పంచాయతీలో ప్రభుత్వ భూమిని బంగ్లాల నిర్మాణం కోసం ఆక్రమించారనే ఆరోపణలపై వివరణ కోరుతూ కొడైకెనాల్ జోనల్ డిప్యూటీ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ నటులు ప్రకాష్ రాజ్, బాబీ సింహాలకు నోటీసులు జారీ చేయ‌గా చెన్నై హైకోర్టులో విచార‌ణ సాగుతోంది.

జాతీయ మీడియా స‌మాచారం మేర‌కు.. విల్పట్టి పంచాయతీ పరిధిలోని పెతుపరై - భారతీపురం అన్నానగర్ సమీపంలోని ప్రభుత్వ భూమిని తమ బంగ్లాల నిర్మాణం కోసం నటులు ప్రకాష్ రాజ్- బాబీ సింహా ఆక్రమించారని పెతుపరై గ్రామ అధ్యక్షుడు కెవి మహేంద్రన్ కం రైతు ఫిర్యాదు చేసారు. ఇద్దరు నటులు సంబంధిత అధికారుల నుండి అనుమతి పొందకుండానే బంగ్లాలు నిర్మించారని, పబ్లిక్ రోడ్డును ఆక్రమించారని, దారులు నిర్మించారని, దీని వల్ల నివాసితులు రహదారిని ఉపయోగించకుండా చేశారని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు. దీంతో దేవాదాయ శాఖ అధికారులు ఇరువురి భూములను పరిశీలించారు. కొడైకెనాల్ రెవెన్యూ డివిజనల్ అధికారి రాజా వివ‌రాల‌ ప్ర‌కారం.. తహశీల్దార్, సర్వేయర్ నటీనటుల భూములను పరిశీలించారు. తనిఖీ పూర్తయిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధ‌మైంది. అయితే ఆ ఇద్ద‌రూ పెద్ద స్టార్లు గ‌నుక ఇప్ప‌టివ‌ర‌కూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

తాజాగా దీనిపై చెన్నై హైకోర్టులో విచార‌ణ సాగుతోంది. ప్ర‌కాష్ రాజ్ ఏడెక‌రాల కొండ భూమిలో నిర్మాణాలు చేప‌ట్టార‌ని, బాబి ఒక ఎక‌రంలో భ‌వంతిని నిర్మిస్తున్నార‌ని కూడా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే కొండ‌భూమిలో భారీగా ఉండే బండ రాళ్ల‌ను ప‌గుల గొట్టేందుకు మెషిన‌రీ ఉప‌యోగిస్తుండ‌డంతో అవి మార్గంలో వెళ్లే వారికి ఆటంకాలు క‌ల‌గజేస్తున్నాయ‌ని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. ప్ర‌స్తుతం కోర్టుల ప‌రిధిలో విచార‌ణ కొన‌సాగుతోంది. దీనిపై తుది తీర్పు వెలువ‌డాల్సి ఉంది.

ప‌ట్టాలు ఉన్నాయి కానీ..!

విల్పట్టి పంచాయతీ ప్రెసిడెంట్ పాకియలక్ష్మి రామచంద్రన్ తరపున ఆమె భర్త రామచంద్రన్ మాట్లాడుతూ నటుడు బాబీ సింహ భూమి తల్లిదండ్రులు కృష్ణకుమారి, రామకృష్ణన్‌ల పేర్లపై ఉందని, అది పెతుపరై గ్రామ పరిధిలోకి వచ్చే పట్టా భూమి అని అన్నారు. 2021లో ప్రత్యేక అధికారి హయాంలో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించేందుకు ఆమోదం పొందారు. అయితే, తర్వాత తమ ఆమోదాన్ని పునరుద్ధరించి 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారని ప్ర‌ముఖ జాతీయ మీడియాలో క‌థ‌నం వెలువ‌డింది.

నటుడు ప్రకాష్ రాజ్‌కు కూడా భారతీపురం అన్నానగర్ గ్రామంలో పట్టా భూమి ఉందని, అక్కడ పంచాయతీ అనుమతి లేకుండా తన బంగ్లాను నిర్మించారని ఆయన అన్నారు. సంబంధిత అధికారులు ఇరువురు నటులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నిర్మాణ‌ ప్లాన్ డ్రాయింగ్‌తో పాటు వారి ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు నటులకు నోటీసు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు గ‌తంలో చెప్పారు.

Tags:    

Similar News