ఊర్వశితో బాలయ్య దబిడి డిబిడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్..!
సంక్రాంతి స్పెషల్ గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''డాకు మహారాజ్''. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి స్పెషల్ గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటి వరకూ విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'ది రేజ్ ఆఫ్ డాకు', 'చిన్ని' పాటలు కూడా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో, ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ లేటెస్టుగా ''దబిడి దిబిడి'' అనే మూడో పాటను వదిలారు.
''ఉలాల్లా ఉలాల్లా.. నా మువ్వ గోపాలా.. కత్తులతోటే కాదు కంటి చూపుతోనే చంపాలా.. ఉలాల్లా ఉలాల్లా.. నా మువ్వ గోపాలా..కిస్సుల ఆటకొస్తా ప్లేసు టైం నువ్వే చెప్పాలా'' అంటూ సాగిన ఈ పాట అభిమానులను విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణ సినిమాల్లోని పాపులర్ డైలాగ్స్ తో, భారీ స్థాయిలో ఈ మాస్ డ్యాన్స్ నంబర్ ను రూపొందించారు. 'దబిడి దిబిడి' అనేది కూడా ఆయన ఫేమస్ డైలాగ్ అనే సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య, బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కలిసి కాలు కదిపారు. ఫుల్ ఎనర్జీతో, అదిరిపోయే స్టెప్పులతో మాస్ ఆడియన్స్ ను మెప్పించారు.
బాలకృష్ణ సినిమాలకు ఎస్. థమన్ ఏ రేంజ్ లో సంగీతం అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కలయికలో వచ్చే ప్రతి పాట సంగీత ప్రియులను రంజింపచేస్తుంది. ఇప్పుడు ''దబిడి దిబిడి'' సాంగ్ కూడా ఇన్స్టెంట్ హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగర్ వాగ్దేవి తన పవర్ ఫుల్ గాత్రంతో పాటను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. ఇక్కడ గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ట్యూన్ కి తగ్గట్టుగా బాలయ్య డైలాగ్ లతో క్యాచీ లిరిక్స్ అందించారు.
''దబిడి దిబిడి'' పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్, విజయ్ కార్తీక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓవరాల్ గా మ్యూజిక్, లిరిక్స్, డ్యాన్స్.. అన్నీ కలిపిన ఈ సాంగ్ నందమూరి ఫ్యాన్స్ తో పాటు, అన్ని వయసుల వారు కాలు కదిపేలా ఉంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి ఇది నిజమైన మాస్ ట్రీట్ లా ఉందని చెప్పాలి. "జై బాలయ్య" తరహాలోనే ఈ పాట కూడా అభిమానుల హృదయాల్లో నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.
నందమూరి అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉండేలా 'డాకు మహారాజ్' చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. బాలకృష్ణను దృష్టిలోపెట్టుకొనే ఈ కథ రాసుకున్నారు. ఆయనకు తగిన ఎలివేషన్స్, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో బాలయ్య రెండు భిన్నమైన లుక్స్ లో కనిపించి అలరించారు. అయితే సినిమాలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని చెబుతున్నారు. ఆయన డెకాయిట్‌గా మారే ఎలివేషన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇందులో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ సినిమాకి నిరంజన్ దేవరమానే & రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో 'డాకు మహారాజ్' చిత్రం విడుదల కానుంది.