'డెకాయిట్' కోసం మృణాల్.. అసలు కథ ఇదే..
మృణాల్ చేతిలో గన్‌తో స్ట్రాంగ్ గేజ్ ఇచ్చి డ్రైవింగ్ సీట్లో కనిపించగా, అడివి శేష్ సిగరెట్ వెలిగించుకుంటూ తన పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ చిత్రాలు అందిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్న హీరో అడివి శేష్ లేటెస్ట్ గా తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'డెకాయిట్' తో రెడీ అవుతున్నారు. ప్రేమ, కుట్ర, ప్రతీకారం నేపథ్యంగా సాగే ఈ సినిమా ఇప్పటి నుంచే ఆసక్తి కలిగిస్తోంది. దర్శకుడు షణీల్ దేవ్ ఈ సినిమా ద్వారా డైరెక్షన్ డెబ్యూ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఒక ఆసక్తికర ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో లీడ్ హీరోయిన్‌గా అందాల నటి మృణాల్ ఠాకూర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ అడివి శేష్, మృణాల్ ఠాకూర్‌ల పాత్రల మధ్య ఉగ్రరూపాన్ని చూపించింది. మృణాల్ చేతిలో గన్‌తో స్ట్రాంగ్ గేజ్ ఇచ్చి డ్రైవింగ్ సీట్లో కనిపించగా, అడివి శేష్ సిగరెట్ వెలిగించుకుంటూ తన పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
'డెకాయిట్' కథలో ఓ కొత్త కోణం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరు మరొకరిపై ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అయ్యే ఇద్దరు మాజీ ప్రేమికుల మధ్య జరిగే కథ ఇది. ప్రేమలో నమ్మకద్రోహం జరగడంతో అడివి శేష్ పాత్ర ఒక డేంజరస్ ప్లాన్‌ను సిద్ధం చేస్తాడు. ఇదే కథలో ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు రసవత్తర అనుభవం అందిస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. తరువాత మహారాష్ట్రలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు సమాచారం.
అడివి శేష్ - షణీల్ దేవ్ కలిసి కథ, స్క్రీన్‌ప్లేను రూపొందించడం విశేషం. ఇదిలా ఉంటే, మృణాల్ ఠాకూర్ తన పాత్రపై ప్రత్యేకమైన ఆసక్తి చూపుతూ మాట్లాడుతూ, “డెకాయిట్ కథ అనేది చాలా స్టైలిష్ యాక్షన్‌తో కూడిన రస్టిక్ స్టోరీ. ఇందులో నా పాత్రలో ఇప్పటివరకు నేను చేయని కొత్త షేడ్స్‌ను ఆవిష్కరించనుంది. అడివి శేష్‌తో కలిసి పనిచేయడం కూడా చాలా ఆసక్తికరమైన అనుభవం,” అని అన్నారు.
అడివి శేష్ మాట్లాడుతూ, “డెకాయిట్ ఒక అద్భుతమైన యాక్షన్ సినిమా. ఇందులో ప్రేమకథ కూడా చాలా డీప్‌గా ఉంటుంది. మృణాల్ పాత్ర ఈ కథకు ప్రాణం పోస్తుంది. ఆమె ప్రతి పాత్రను జీవిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆమెతో కలసి పని చేయడం ఎంతో ప్రత్యేకం.. అని తెలిపారు. ఇదే సందర్భంగా మృణాల్‌ను టీమ్‌లోకి స్వాగతిస్తూ శేష్ తన పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా చేసుకున్నారు.
దర్శకుడు షణీల్ దేవ్ మాట్లాడుతూ, “మృణాల్ ఠాకూర్ మా చిత్రానికి కలిసొచ్చిన నటీమణి. ఆమె పాత్రకు ఎంతగానో న్యాయం చేస్తారని నాకు నమ్మకం. అదివి శేష్, మృణాల్ ఠాకూర్‌ల కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మరింత హైలైట్ అవుతుంది,” అని అన్నారు. ఇక ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయని మేకర్స్ తెలిపారు.