టాలీవుడ్‌లో డేవిడ్ వార్నర్ ప్ర‌కంప‌నాలు

అయితే ఇప్పుడు వార్న‌ర్ మాఫియా డాన్ గా మారి గ‌న్ తో ఫైట్ చేస్తున్న కొన్ని వీడియోలు, ఫోటోలు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.

Update: 2024-09-23 17:30 GMT

ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మైదానంలో బంతిని బ‌లంగా మోద‌డంలో బౌండ‌రీలు త‌ర‌లించ‌డంలో ఎంతటి ప‌నిమంతుడో, అల్లు అర్జున్ పాట‌ల‌కు డ్యాన్సులు వేయ‌డంలోను అంతే సిద్ధ‌హ‌స్తుడు. కార‌ణం ఏదైనా అత‌డు తెలుగు ఆడియెన్ కి, భార‌తీయ వినోద ప్రియుల‌కు ఎంతో ఆప్తుడు అయ్యాడు. ముఖ్యంగా బ‌న్ని న‌టించిన పుష్ప సినిమాలో పాట‌ల‌కు స్టెప్పులేసిన వార్న‌ర్ ని తెలుగు ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. అత‌డిని మ‌న‌వాళ్లు వోన్ చేసుకుని అభిమానిస్తున్నారు. వార్న‌ర్ క‌ల్మ‌షం లేని స్ఫూఫ్ వీడియోలు ఇంట‌ర్నెట్ లో సెన్సేష‌న్ గా మారుతుంటాయి.

అయితే ఇప్పుడు వార్న‌ర్ మాఫియా డాన్ గా మారి గ‌న్ తో ఫైట్ చేస్తున్న కొన్ని వీడియోలు, ఫోటోలు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అత‌డు ఉన్న‌ట్టుండి ఇలా మారాడేమిటి? అంటూ అంద‌రూ సందేహిస్తున్నారు. అతడి వేష‌ధార‌ణ చూడ‌గానే క‌చ్ఛితంగా త‌న ఫేవ‌రెట్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప 2లో న‌టిస్తున్నాడా? అన్న సందేహాలు క‌లిగాయి. కానీ అత‌డు న‌టిస్తున్న సినిమా రాబిన్ హుడ్. నితిన్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న 'రాబిన్‌హుడ్'లో అతిధి పాత్రతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడ‌ట‌. ఛలో, భీష్మ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

వార్నర్ తన సినిమా సన్నివేశాల కోసం ఆస్ట్రేలియాలో షూట్ చేస్తున్న ఫోటోలతో సోషల్ మీడియా లో సందడి ప‌రాకాష్ఠ‌కు చేరుకుంది. హార్డ్ హిట్ట‌ర్ న‌ట‌నా ఆరంగేట్రం గురించి మరింత ఉత్సాహం నింపింది. మాజీ ఆసీస్ ఓపెనర్ అయిన వార్న‌ర్ తెలుగు సినిమాకి గొప్ప‌ అభిమాని. పుష్ప, అల వైకుంఠ‌పుర‌ములో, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాల నుండి పాట‌ల‌కు అద్భుతంగా నృత్యం చేసాడు. బ‌న్నీ ఎక్స్ ప్రెష‌న్స్, డ్యాన్సుల‌ను, మ్యానరిజమ్‌లను అనుకరిస్తూ టిక్‌టాక్ రీల్స్ చేసాడు. రెగ్యుల‌ర్ గా సోషల్ మీడియాలో తెలుగు సినిమాలతో పాటు, హైదరాబాద్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తుంటాడు. జూన్ 25న అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ రాబిన్‌హుడ్‌లో అరంగేట్రం చేసిన తర్వాత మ‌రిన్ని తెలుగు సినిమాలో న‌టించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం నితిన్ - వెంకీ కుడుముల ఇద్దరినీ సామాజిక మాధ్య‌మాల్లో అనుసరిస్తున్నందున 'రాబిన్‌హుడ్'లో న‌టిస్తున్నాడ‌ని క్లారిటీ వ‌చ్చింది. వైరల్ వీడియోల కారణంగా వార్నర్‌ను విపరీతంగా ఆరాధించిన తెలుగు అభిమానులు అతడి పెద్ద స్క్రీన్ ఆర‌గేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబిన్ హుడ్ లో ర‌ష్మిక బ‌దులుగా శ్రీ‌లీల న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నితిన్ వ‌రుస‌గా తమ్ముడు, రాబిన్‌హుడ్ చిత్రాల్లో న‌టిస్తున్నాడు.

Tags:    

Similar News