ఫ్రెగ్నెంట్ దీపిక.. కల్కికి ప్లస్ కానీ సింగంకి?
యాధృచ్ఛికమే అయినా కానీ, నాగ్ అశ్విన్ `కల్కి 2989 ఏడి` కోసం దీపిక పదుకొనేను ఎంపిక చేసుకున్నాడు.
యాధృచ్ఛికమే అయినా కానీ, నాగ్ అశ్విన్ `కల్కి 2989 ఏడి` కోసం దీపిక పదుకొనేను ఎంపిక చేసుకున్నాడు. ఆ సినిమాలో ఒక గర్భిణి పాత్రను పోషించింది దీపిక. ఈ పాత్ర డీగ్లామరస్ లుక్ తో కనిపించింది. అయినా నటిగా స్కోప్ ఉండటంతో అది అందరికీ కనెక్టయింది. కల్కి చిత్రీకరణ సమయంలోనే దీపిక రియల్ గానే గర్భం దాల్చడంతో అది తన పాత్రలో నటించేందుకు కూడా పెద్ద ప్లస్ అయింది.
అదంతా అటుంచితే, ఇప్పుడు మరో ఆసక్తికర విషయం అభిమానుల్లో చర్చకు వచ్చింది. దీపిక గర్భిణిగా ఉండగానే `కల్కి 2989 ఏడి` చిత్రీకరణతో పాటు `సింగం ఎగైన్` షూటింగ్ కూడా జరిగింది. మరి `కల్కి 2989 ఏడి` పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు `సింగం 3` కూడా అలాంటి రిజల్ట్ అందుకుంటుందా? అన్నదే ఈ చర్చ.
సోమవారం ముంబైలో జరిగిన `సింగం ఎగైన్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రణ్‌వీర్ సింగ్ హాజరయ్యారు. ఈవెంట్లో అజయ్ దేవగన్ సహా ఇతర తారాగణం కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో తన భార్య దీపిక గర్భవతి అయినందున తమ కుమార్తె కూడా ఈ చిత్రంతోనే సినీ అరంగేట్రం చేస్తోందని రణ్ వీర్ అన్నారు. ``సింగం ఎగైన్ తో బేబి సింగం కూడా అరంగేట్రం చేస్తుంది. కాబట్టి మీరు మళ్లీ సింగంలో లేడీ సింగం, బేబీ సింగం & సింబాను చూస్తారు!`` అని ఈవెంట్‌లో సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే రణ్ వీర్ సమీకరణం బావుంది కానీ, దీపిక గర్భిణిగా ఉండగా తెరకెక్కిన సింగం ఎగైన్ (సింగం 3) ఏ మేరకు ప్రజల్ని ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ ఇది కూడా పెద్ద హిట్టయితే ఇకపై దర్శకనిర్మాతలంతా తమ సినిమాల్లో దీపికకు ఒక గర్భిణి పాత్రను ఆఫర్ చేయడం ఖాయంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. సెంటిమెంటును ఫాలో అయ్యే పరిశ్రమలో ఇలాంటివి చాలా సహజం. దీనికోసం దీపికకు కోరుకున్నంత పారితోషికం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. తను గర్భిణిగా ఉంటే హిట్టు ఖాయమని ఇండస్ట్రీ నమ్ముతుంది.
రణవీర్ - దీపిక 2018 లో ఇటలీలో సింపుల్ వేడుకలో వివాహం చేసుకున్నారు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఈ జంట 8 సెప్టెంబర్ 2024న తమ ఆడబిడ్డ రాకను ప్రకటించారు. పేరెంట్‌హుడ్‌ని స్వీకరించిన తర్వాత ఈ జంట కలిసి నటించిన మొట్టమొదటి రిలీజ్ ఇదే కావడం గమనార్హం. `కల్కి 2989 ఏడి`లో మహాభారతం ఎలిమెంట్స్ కొన్నిటిని, లార్డ్ కృష్ణుడితో ముడిపడిన అంశాలను నాగ్ అశ్విన్ టచ్ చేసాడు. ఇప్పుడు రామాయణం థీమ్ తో సింగం 3 రూపొందింది. ఇందులో పాత్రలు రామాయణంలోని ప్రధాన పాత్రలను పోలి ఉంటాయి. సీతను రావణుడి నుండి రక్షించడానికి రాముడు శ్రీలంకకు ఎలా ప్రయాణించాడో తెరపై ఆవిష్కరించారు. అయితే ఇది సీరియస్ క్రైమ్ యాక్షన్ డ్రామా కావడంతో రోహిత్ శెట్టి పురాణేతిహాసానికి సంబంధించిన థీమ్ ని ఎలా ఉపయోగించాడో చూడాలని ఆసక్తిగా ఉన్నారు.
ఈ చిత్రం సింఘం ఫ్రాంచైజీలో ఐదవ భాగం కాగా సింగం, సింగం 2, సింబా, సూర్యవంశీ ఇప్పటికే విడుదలై పెద్ద విజయం సాధించాయి. దీపిక -టైగర్ ష్రాఫ్ కాప్-యూనివర్స్‌లో కొత్త ముఖాలు. ఇది దీపావళి 2024 శుభ సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉంది.