పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోవడమెలా? విద్యార్థులకు దీపిక సూచనలు
మార్చిలో ఫెయిలైతే సెప్టెంబర్ ఉందిగా! అనుకోవడానికి లేదు. విద్యార్థులు అకడమిక్ పరీక్షల్లో విజయం సాధించేందుకు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
మార్చిలో ఫెయిలైతే సెప్టెంబర్ ఉందిగా! అనుకోవడానికి లేదు. విద్యార్థులు అకడమిక్ పరీక్షల్లో విజయం సాధించేందుకు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పరీక్షలు వస్తున్నాయంటేనే టెన్షన్ తో పుస్తకం వదలని విద్యార్థులు ఎందరో. వారికి చదివే విధానంపై సరైన సలహాలు, సూచనలు లేనప్పుడు చాలా అనర్థాలు కూడా జరుగుతున్నాయి. కొందరు విద్యార్థులు పరీక్ష సరిగా రాయలేదని ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అర్థాంతరంగా లోకాన్ని విడిచిపెట్టిన అమాయక విద్యార్థులకు ఎవరూ ఏదీ నేర్పించకపోవడం ఒక కారణంగా భావించాలి. వారికి సరైన రీతిలో పేరెంట్ మార్గదర్శనం చేయలేదని కూడా భావించాలి.
అయితే పరీక్షల కోసం టెన్షన్ కి గురయ్యే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా `పరీక్షా పే చర్చా` కార్యక్రమం సహకరిస్తోంది. ఈ కార్యక్రమ రెండవ ఎపిసోడ్ సందర్భంగా విద్యార్థి జీవితంలో మానసిక శ్రేయస్సు కోసం వారి భావాలను వ్యక్తపరచాల్సిన అవసరం, ప్రాముఖ్యతను దీపికా పదుకొనే చర్చించారు. ప్రధానమంత్రి మోడీ నిర్వహిస్తున్న ఈ వార్షిక కార్యక్రమం, విద్యార్థులు పరీక్షా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడాలనే మోటోతో నడుస్తోంది.
తాజాగా దీపిక ఇన్‌స్టాలో ఒక వీడియో ద్వారా పరీక్షా పే చర్చా ఎనిమిదవ ఎడిషన్.. రెండవ ఎపిసోడ్‌లో తన ప్రదర్శన వీడియోను షేర్ చేసారు. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ విద్యార్థుల మానసిక శ్రేయస్సుకు సహకరిస్తుంది. ఈ వీడియోలో దీపిక విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు ఎల్లప్పుడూ వారి భావాలను దాచిపెట్టకుండా వ్యక్తపరచమని ప్రోత్సహించారు. కుటుంబం, స్నేహితులతో బహిరంగ సంభాషణల ప్రాముఖ్యతను విద్యార్థులకు నొక్కి చెప్పింది. మనమంతా ఒత్తిడిని ఎదుర్కొంటాము. నేను గణితంలో బలహీనంగా ఉన్నాను.. ఇప్పటికీ అంతే! ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పుస్తకంలో భావాలను వ్యక్తపరచడం.. వాటిని అణచివేయకుండా ఉండాల్సిన ప్రాముఖ్యతను కూడా ప్రస్తావించారు. కాబట్టి ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు బయటకు వ్యక్తపరచుకోండి. అని దీపిక సూచించారు.
పరీక్ష పే చర్చ అనేది ప్రధానమంత్రి మోడీ నిర్వహించే వార్షిక కార్యక్రమం.. ఇందులో ఆయన పరీక్ష సంబంధిత ఒత్తిడి, విద్య, ఒత్తిడిని నిర్వహించడం గురించి చర్చించడానికి విద్యార్థులతో సంభాషిస్తారు. ఈ సంవత్సరం ఎనిమిదవ ఎడిషన్ సోమవారం ప్రారంభమైంది. దీనిలో ప్రధానమంత్రి ఢిల్లీలోని సుందర్ నర్సరీని సందర్శించి పరీక్ష ఒత్తిడిని మేనేజ్ చేయడానికి ప్రేరణ పొందే మార్గాల గురించి విద్యార్థులతో సంభాషించారు. దీపిక పదుకొనే, బాక్సర్ మేరీ కోమ్, ఆధ్యాత్మిక గురువు సద్గురు సహా పలువురు ప్రముఖ వ్యక్తులు షోలో జీవిత పాఠాలు చిట్కాలను విద్యార్థులతో షేర్ చేసుకున్నారు.