ఢిల్లీ హైకోర్టులో మంచు విష్ణుకు ఊరట.. ఇది అసలు మ్యాటర్
ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్ లో ఉన్న వీడియోలు వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సోషల్ మీడియా వేదికగా కొద్ది రోజుల నుంచి కొందరు ఆకతాయిలు సెలబ్రిటీల ప్రతిష్ఠను దిగజార్చేలా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. వైరల్ అవ్వడం కోసం ఫేక్ వీడియోస్ ను క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు. ఇటీవల అలాంటి పరిస్థితి ఎదుర్కొన్న తెలుగు హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్ లో ఉన్న వీడియోలు వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే మంచు విష్ణు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, వారి కుటుంబాల పై అవమానకరమైన సమాచారాన్ని అరికట్టేందుకు విష్ణు చేపట్టిన విస్తృత ప్రయత్నాలను హైకోర్టు తీర్పు బలపరుస్తోందని చెబుతున్నారు. సెలబ్రిటీలకు ఒక సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం ముందడుగు పడినట్లు అయిందని అంటున్నారు. కళాకారుల గౌరవాన్ని రక్షించాలనే విష్ణు మంచు సంకల్పానికి మరింత బలం చేకూరిందని కామెంట్స్ పెడుతున్నారు.
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు.. ప్రముఖ వ్యక్తుల హక్కులు రక్షించడంలో ఒక కీలక ముందడుగని ప్రఖ్యాత న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ అభివర్ణించారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విష్ణు.. అనైతిక యూట్యూబ్ ఛానళ్ల పై.. అవమానకరమైన సమాచారాన్ని పోస్ట్ చేసే వారి పై చర్యలు తీసుకోవడంలో ఇప్పటికే ముందడుగు వేశారు. ఇప్పటివరకు ఆయన చేపట్టిన చర్యల ద్వారా 75 అవమానకరమైన యూట్యూబ్ లింకులు తొలగించారు అధికారులు.
ఇప్పుడు ఆయన విషయంలో జరిగిన దుష్ప్రచారం పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మంచు విష్ణు స్వరం, పేరు, ఆయన చేసిన సినిమాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని ఆదేశించింది. పిటిషనర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఘటనలకు పాల్పడుతున్న ఎవరిపై అయినా చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు వెసులుబాటు ఇచ్చింది. మంచు విష్ణుపై పోస్టు చేసిన పది యూఆర్ ఎల్ లింకులను తొలగించాలని కేంద్ర సమాచారశాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను ఆదేశించింది.
సంబంధిత లింకులను తొలగించాలని ఆయా యూట్యూబ్ ఛానళ్లకు స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు. ఆయా ఛానళ్లు 48 గంటల్లో తొలగించకపోతే వాటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని యూట్యూబ్ సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మిని పుష్కర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. తన ప్రతిష్ఠను దిగజార్చేలా పలు యూట్యూబ్ ఛానళ్లు వీడియోలు ప్రసారం చేయడాన్ని సవాలు చేస్తూ మంచు విష్ణు కొన్ని రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు.