దేవర ఈవెంట్ రద్దు.. అదీ ఓ కారణమా?

ఆ తర్వాత హీరోహీరోయిన్లు తారక్, జాన్వీ కపూర్ వీడియోస్ రిలీజ్ చేశారు.

Update: 2024-09-23 09:52 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర పార్ట్-1 మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జోరుగా ప్రమోషన్స్ చేపడుతున్న మేకర్స్.. నిన్న ఏర్పాటు చేసిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన విషయం తెలిసిందే. లిమిట్ కు మించి ఫ్యాన్స్ రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. వీఐపీ గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీలోకి కొందరు దూసుకెళ్లడంతో రచ్చ రచ్చ అయింది. దీంతో ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది.

ఆ తర్వాత హీరోహీరోయిన్లు తారక్, జాన్వీ కపూర్ వీడియోస్ రిలీజ్ చేశారు. ఈవెంట్ రద్దు అవ్వడం చాలా బాధగా ఉందని ఎన్టీఆర్ అన్నారు. అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ఫంక్షన్‌ క్యాన్సిల్‌ విషయంలో నిర్మాతలు, ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌ ను తప్పు పట్టడం సరికాదని తెలిపారు. ఈవెంట్ రద్దు అవ్వడంతో త్వరలో అందరినీ కలుస్తానని చెప్పారు జాన్వీ. అభిమానులకు సారీ చెబుతూ స్టేట్మెంట్ ను నిర్మాత విడుదల చేశారు. ఇదంతా అందరికీ తెలిసిందే.

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించే బాధ్యతలు పొందిన ప్రముఖ శ్రేయాస్ మీడియాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పరిమితికి మించి పాస్ లు ఇవ్వడం వల్లే అలా జరిగిందని కొందరు నెటిజన్లు ఆరోపించారు. కానీ ఆ తర్వాత నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. పలు కారణాల వల్ల ఓపెన్ ఈవెంట్ కు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని, అందుకే నోవాటెల్ లో ఏర్పాటు చేశామని చెప్పారు. హోటల్ సామర్థ్యం 5500 కాగా, 4 వేల పాసులు మాత్రమే ప్రింట్ చేశామని క్లారిటీ ఇచ్చారు.

కానీ దాదాపు 30,000 మంది అభిమానులు పాసులు లేకుండా వచ్చారని శ్రేయాస్ మీడియా సీఈవో శ్రీనివాస్ చెప్పారు. అందుకే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని తెలిపారు. అభిమానులకు క్షమాపణ కోరారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోగ్రాం ఒకటి చివరి నిమిషంలో ఖరారు అవ్వడం.. ఈవెంట్ రద్దుకు ఓ కారణమని నెట్టింట పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

నోవాటెల్ కు కాస్త దూరంలో ఉన్న మరో హోటల్ లో రేవంత్ రెడ్డి కార్యక్రమం జరిగిందని, అక్కడ భారీగా పోలీసులు మోహరించారని చెబుతున్నారు. అక్కడ ప్రోగ్రామ్ పూర్తైన తర్వాత.. పోలీసులు ఎక్కువ మంది నోవాటెల్ కు వచ్చారని, అప్పటికే జరగాల్సింది జరిగిందని అంటున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కార్యక్రమం రద్దు అయ్యిందని వాపోతున్నారు. ఇప్పుడు ఈ విషయం తెగ చక్కర్లు కొడుతున్నా.. ఇందులో నిజమెంత అనేది మాత్రం పూర్తిగా తెలియదు.

Tags:    

Similar News