230 కోట్ల నికర ఆస్తితో సౌత్ హీరో విలాసాలు
ధనుష్ బహుభాషా స్టార్‌గా మారడానికి తన నైపుణ్యాలను బాగా అభివృద్ధి చేసుకున్నాడు.
తమిళ స్టార్ హీరో ధనుష్ డైనమిక్ పెర్ఫామర్‌గా పాపులర్ అయ్యాడు. అతడు తనను తాను చురుకుగా ఉంచుకుంటాడు. నటుడిగా ప్రయోగాలకు వెనకాడడు. కెరీర్ తొలిదశలో తన లుక్ విషయంలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. కానీ తన అపార ప్రతిభ, అద్భుత నటప్రదర్శనలతో సమాధానాలు ఇస్తూ ట్రోలర్ల నోళ్లు మూయించాడు. ధనుష్ బహుభాషా స్టార్‌గా మారడానికి తన నైపుణ్యాలను బాగా అభివృద్ధి చేసుకున్నాడు. అతడు నటుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా బాధ్యత వహిస్తూ మల్టీ టాస్కింగ్ చేయగలడు.
ధనుష్ ఇటీవల తెలుగు, హిందీలో స్ట్రెయిట్ చిత్రాలను అందించడం ద్వారా పాన్-ఇండియన్ స్టార్ అయ్యాడు అతడి సినిమాలకు ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా అతడి సినిమాలు భారీగా విడుదలవుతున్నాయి. అన్ని పరిశ్రమల్లోను ప్రొడక్షన్ హౌస్‌లు, దర్శకులతో కలిసి పని చేయడం ద్వారా, ధనుష్ భాషాభేధం లేకుండా విస్తృతమైన అభిమానులను నిర్మించుకున్నాడు. ఇది అతడి బాక్సాఫీస్ బేస్‌ను సమాంతరంగా విస్తరించింది. గత కొన్ని సంవత్సరాలుగా అతడి ఎదుగుదలకు ఈ ప్రణాళిక సహకరించింది.
నటుడిగా ధనుష్ ఒక్కో సినిమాకి దాదాపు రూ. 30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. దర్శకుడిగా లేదా గాయకుడిగా తన సహకారానికి కూడా డబ్బు సంపాదిస్తున్నాడు. నిర్మాతగా నాణ్యమైన చిత్రాలలో పెట్టుబడి పెడతాడు. ధనుష్ ఒకేసారి నటుడిగా, నిర్మాతగా వివిధ చిత్రాల పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. అతడు తన సినిమాల పనులను వేగంగా పూర్తి చేస్తున్నాడు. కాబట్టి ధనుష్ ఎంపిక చేసుకున్న ఫార్ములా వల్ల ప్రతి సంవత్సరం కనీసం రెండు విడుదలతో..ఆర్జన పెరిగింది.
కొన్ని సంవత్సరాల క్రితం జాతీయ మీడియా అందించిన వివరాల ప్రకారం.. ధనుష్ నికర ఆస్తి విలువ దాదాపు రూ. 160 కోట్లుగా ఉంది. అయితే ప్రస్తుత ఆస్తి విలువ దాదాపు రూ. 230 కోట్లు ఉంటుందని అంచనా. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ధనుష్ ఇటీవల నిర్మించిన ఇంటికి రూ.25 కోట్లు వెచ్చించారు. ధనుష్ భారతదేశం అంతటా రియల్ ఎస్టేట్ రంగంలో ఆస్తులను కలిగి ఉన్నాడు. అతడి వద్ద రోల్స్ రాయిస్ ఘోస్ట్ .. బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.