'స్పిరిట్‌' కోసం బాలీవుడ్‌ స్టార్‌ని ఢీ కొట్టనున్న ప్రభాస్‌!

అందులో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ అత్యంత ముఖ్యమైన సినిమాగా చెప్పుకోవచ్చు.

Update: 2024-10-29 05:11 GMT

సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్‌ విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజాసాబ్‌ సినిమాతో వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌లో రాజాసాబ్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. రాజా సాబ్‌తో పాటు సీతారామం చిత్ర దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ప్రభాస్ ఒక సినిమాను చేస్తున్నాడు. 2025లో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలు కాకుండా ప్రభాస్ మరిన్ని సినిమాలను చేస్తున్న విషయం తెల్సిందే. అందులో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ అత్యంత ముఖ్యమైన సినిమాగా చెప్పుకోవచ్చు.

అర్జున్‌ రెడ్డి, యానిమల్ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్‌ సినిమా రూపొందబోతుంది. సినిమా కోసం ప్రస్తుతం స్క్రిప్ట్‌ ను రెడీ చేసే పనిలో దర్శకుడు ఉన్నాడు. సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో రోజుకో పుకారు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాలో ప్రభాస్ డ్యుయెల్‌ రోల్‌ అంటూ వార్తలు వచ్చాయి. పోలీస్‌ స్టోరీ అంటూ ఇటీవలే దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ అధికారికంగా ఒక సినిమా వేడుకలో పాల్గొన్న సందర్భంగా చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌ ను సాధ్యమైనంత వరకు వైల్డ్‌గా చూపించాలని దర్శకుడు భావిస్తున్నాడని తెలుస్తోంది.

యానిమల్‌ సినిమాలో రణబీర్‌ కి ఏమాత్రం తగ్గకుండా బాబీ డియోల్‌ను విలన్‌ రోల్‌లో నటింపజేసిన విషయం తెల్సిందే. రణబీర్‌ కపూర్‌, బాబీ డియోల్‌ కాంబోలో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి అనడంలో సందేహం లేదు. అలాంటి విలన్ పాత్రను స్పిరిట్‌లోనూ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ డిజైన్ చేయడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం స్పిరిట్‌ సినిమాలో బాలీవుడ్‌ కి చెందిన ప్రముఖ నటుడు విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ స్టార్ నటుడితో ప్రభాస్ చేసే యాక్షన్ సన్నివేశాలు సూపర్బ్‌గా ఉంటాయని స్క్రిప్ట్‌ వర్క్‌ లో పాల్గొంటున్న వారు ఆఫ్ ది రికార్డ్‌ చెబుతున్నారు.

ప్రభాస్‌ని పోలీస్ పాత్రలో చూసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నామంటూ ఫ్యాన్స్ సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే కథతో పాటు వైల్డ్‌ సన్నివేశాలు ఉండటం వల్ల యూత్‌ కి స్పిరిట్‌ సైతం నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల ప్రేక్షకులు స్పిరిట్‌ సినిమాకు బ్రహ్మరథం పడితే ఈజీగా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు, ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్పిరిట్‌ సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే ఇంతగా అంచనాలు ఉంటే విడుదల సమయంలో అంచనాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. 2026లో సినిమా విడుదల అయ్యే విధంగా దర్శకుడు సందీప్ వంగ ప్లాన్‌ చేస్తున్నారట.

Tags:    

Similar News