పవన్ జీ ఆ ముగ్గురు నిర్మాతల్ని అలా లాక్ చేసారా?
ఆయన బిజీ షెడ్యూల్ చూసుకుని ఎవరికి ఇవ్వాల్సిన సమయంలో వారికి డేట్లు ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'ఓజీ', 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్' నిర్మాతలు ఎవరికి వారు విడి విడిగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఎవరికి వారు పవన్ ని ముందుగా లాక్ చేసుకునే ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ పవన్ ఎవరికి డేట్లు కేటాయించలేదు. ఆయన బిజీ షెడ్యూల్ చూసుకుని ఎవరికి ఇవ్వాల్సిన సమయంలో వారికి డేట్లు ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే మరో ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్, ముంబై, మలేషియా కాకుండా తాడేపల్లిలోనే తమ సినిమా సెట్లు కుదిరితే వేసుకోండని ఓ సలహా ఇచ్చారుట. అలా అయితే వీలైనంత త్వరగా సినిమాలకు డేట్లు కేటాయించగలనని అన్నారుట. దీంతో నిర్మాతలంతా డైలమాలో పడ్డట్లు వినిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హరీశ్ శంకర్ సెట్ వేయించి రెడీగా ఉన్నాడు.
పవన్ వస్తే చాలు ఫటా ఫట్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇక 'ఓజీ' ముంబై బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఆ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ముంబై, హైదరాబాద్, మలేషియాలో జరిగింది. కొత్తగా ఇప్పుడు తాడేపల్లిలో సెట్లు వేయడం అంటే? అంత వీజీ కాదు. పైగా సెట్లు వేస్తే నేచురాల్టీ మిస్ అవుతుంది. గ్యాంగ్ స్టర్ స్టోరీ కాబట్టి వీలైనంత వరకూ ఒరిజినల్ లొకేషన్లు అయితేనే బెటర్ గా సుజిత్ భావిస్తున్నాడు.
అలాగే వీరమల్లు షూటింగ్ అంతా కూడా సెట్లలోనే పూర్తి చేయాలి. ఇది పూర్తిగా చారిత్ర నేపథ్యం గల కథ. ఇప్పటికే హైదరాబాద్ లో సెట్లు వేసి కొంత భాగం పూర్తి చేసారు. దానికి కొనసాగింపు షూటింగ్ చేయాలి. కొత్తగా తాడేపల్లిలో సెట్లు వేస్తే నిర్మాతకు తడిపి మోపుడవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ డేట్లు కేటాయింపు ఎలా ఉంటుందో చూడాలి.