ఆంధ్రాలో సినిమాకి వైబ్ ఇస్తే.. తెలంగాణలో కల్లు, మటన్ కు వైబ్ ఇస్తాం: దిల్ రాజు

ఇందులో భాగంగా 'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Update: 2025-01-07 10:41 GMT

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు రాబోయే సంక్రాంతి చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే ఆయన బ్యానర్ లో రూపొందిన 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి రెండు సినిమాలు ఈ ఫెస్టివల్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటితో పాటుగా 'డాకు మహారాజ్' మూవీని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు తన సినిమాలను అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

దిల్ రాజు స్వస్థలమైన నిజామాబాద్ లోని కలెక్టర్ గ్రౌండ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. దీనికి హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రా, తెలంగాణ ప్రాంత ప్రజల్లో సినిమాల పట్ల చూపించే ఆసక్తిలో ఉన్న వ్యత్యాసం గురించి దిల్ రాజు మాట్లాడారు. ''మా వాళ్ళకి సినిమా కంటే.. మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి, మీ దగ్గర నుంచి రియాక్షన్ తక్కువ వస్తుందని మా డైరెక్టర్ కి చెప్పా. ఆంధ్రాకి వెళ్తే సినిమాకి ఒక వైబ్ ఇస్తారు. మన దగ్గరైతే తెల్ల కల్లు, మటన్ కు వైబ్ ఇస్తాం'' అని అన్నారు.

దిల్ రాజు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిర్మాత నవ్వుతూ మాట్లాడినప్పటీ ఏపీలో సినిమాకు వైబ్ ఇస్తే.. తెలంగాణాలో మాత్రం తెల్ల కల్లు, మటన్ కు వైబ్ ఇస్తామని చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. తెలంగాణ ప్రజలు తినడానికి, తాగడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారనే విధంగా దిల్ రాజు మాట్లాడటం తెలంగాణా ప్రాంతాన్ని, కల్చర్ ని అవమానించడమే అవుతుందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన దిల్ రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఘాటుగా స్పందిస్తున్నారు.

దిల్ రాజు తన సినిమాల కోసం ఇరు రాష్ట్రాల సినీ అభిమానులను కంపేర్ చేసి, తెలంగాణాను తక్కువ చేయడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మంచి సినిమాని ఏ ప్రాంతంలోనైనా ఆదరిస్తారని, అందరూ చూస్తేనే సినిమా హిట్ అవుతుందనే విషయాన్ని అగ్ర నిర్మాత మర్చిపోకూడదని అంటున్నారు. అయితే దిల్ రాజు ఏదో క్యాజువల్ గా అలా మాట్లాడారని, తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ చేయాలనే ఉద్దేశ్యంతో అలాంటి వ్యాఖ్యలు చేయలేదని మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఏదేమైనా దిల్ రాజు మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక ఇదే వేదిక మీద దిల్ రాజు మాట్లాడుతూ.. ''నిజామాబాద్ లో ఇంతకు ముందు ఫిదా వేడుక చేశాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇక్కడే ఈవెంట్ చేద్దామని అన్నాడు. వెంకటేష్, అనిల్, శిరీష్.. వారి భుజాన వేసుకొని 72 రోజుల్లో ఇంత పెద్ద సినిమాని ఫినిష్ చేశారు. పూర్తిస్థాయిలో ఓ సినిమా ఈవెంట్ నిజామాబాద్ లో జరగడం ఇదే ఫస్ట్ టైం. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు.1980లో ఇక్కడ రూపాయి టికెట్ తో నేనూ శిరీష్ సినిమాలు చూసి వెళ్ళేవాళ్ళం. అలా సినిమాలపై ఇష్టం ఏర్పడింది. ఇండస్ట్రీలోకి వస్తామని అప్పుడు మాకు తెలియదు. అలాంటిది ఇప్పుడు మా 58వ సినిమా ఈవెంట్ ఇక్కడ చేయడం మాకు చాలా గర్వంగా వుంది. ఎంతోమంది హీరోలు, దర్శకులు సపోర్ట్ చేస్తే ఈ స్థాయిలో వున్నాం. అనిల్ మా బ్యానర్ లో ఆరు సినిమాలు చేసి ఒక పిల్లర్ లా నిలబడ్డారు. తను ఒకొక్కమెట్టు ఎదుగుతూ టాప్ డైరెక్టర్ గా అయ్యాడు'' అని అన్నారు. ఈ ఏడాది తమకు బ్లాక్ బస్టర్ పొంగల్ ఇయర్ అని, 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అని దిల్ రాజు పేర్కొన్నారు.

Tags:    

Similar News