2000 ఎకరాల్లో కొత్త CINEMA సిటీ ప్రతిపాదన
2024 ముగింపులో `సంథ్య` థియేటర్ ఘటన టాలీవుడ్ లో చాలా పరిణామాలకు దారితీసిన సంగతి తెలిసిందే.
2024 ముగింపులో `సంథ్య` థియేటర్ ఘటన టాలీవుడ్ లో చాలా పరిణామాలకు దారితీసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఎపిసోడ్స్ తెలుగు చిత్రసీమకు ఇబ్బందికరంగా మారాయి. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ రేట్ల పెంపు అవకాశం ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు కథనాలు రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అనంతరం టాలీవుడ్ సినీపెద్దలంతా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏపీలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోను సినీపెద్దల భేటీలు కొనసాగాయి. అయితే ఇరు రాష్ట్రాల్లోను నాయకులు కీలక నిర్ణయాలను వెలువరించారు. టాలీవుడ్ అభివృద్ధి కోసం తమవంతు సాయం చేస్తామని సినీపెద్దలకు హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వాలకు పరిశ్రమ ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని కూడా సినీపెద్దలు తమవంతుగా ప్రామిస్ చేసారు.
ఇక టాలీవుడ్ తరపున కొన్ని కీలక ప్రతిపాదనలతో తెలంగాణ- ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఒక కీలక ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారని తెలుస్తోంది. హైదరాబాద్ శంషాబాద్ కి 24 కి.మీల పరిధిలో కనీసం 1500-2000 ఎకరాల్లో సినిమా సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం సహకరించాల్సిందిగా దిల్ రాజు లేఖలో కోరినట్టు సమాచారం. తెరస ప్రభుత్వం గతంలో సినిమా సిటీ నిర్మాణానికి సహకరించేందుకు ముందుకు వచ్చిందని కూడా దీనిలో గుర్తు చేసారు.
టికెట్ రేట్లపై కీలక నిర్ణయం:
అలాగే పెద్ద సినిమాల రిలీజ్ ల సమయంలో టికెట్ రేట్ల అంశంపైనా ప్రభుత్వానికి దిల్ రాజు కొన్ని సూచనలు చేసారని తెలుస్తోంది. పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో బ్లాక్ టికెటింగ్ దందాను ఆపేందుకు ప్రభుత్వం సహకరించాల్సిందిగా లేఖలో ప్రతిపాదించారు. ఆన్‌లైన్ టికెటింగ్ ద్వారా బ్లాక్ దందాకు చెక్ పెట్టాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని అన్ని ప్రాంతాల్లోనూ అమలయ్యేలా దశల వారీగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచన చేసారు. ఇందు కోసం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఆన్ లైన్ వేదికలపై అధిక ఛార్జీల బాదుడు గురించి ప్రస్థావించిన దిల్ రాజు.. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పరిధిలోనే ఒక డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందని సూచన చేసినట్టు తెలిసింది. సింగిల్ విండో విధానంలో సినిమా లొకేషన్లకు అనుమతులు ఇవ్వాలని కూడా తాజా లేఖలో ప్రతిపాదించారు.
అయితే ఇవన్నీ చాలా కాలంగా ఉన్న డిమాండ్లే. ఇప్పుడు ఎఫ్.డి.సి అధ్యక్షుని హోదాలో దిల్ రాజు బాధ్యతలు చేపట్టారు గనుక యాక్షన్ ప్లాన్డ్ గా ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వాలు సహకరిస్తే తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందే వీలుంటుందని ఆశిస్తున్నారు.