దిల్ రాజు కమ్‌బ్యాక్ ఇస్తాడా?
కొవిడ్ తర్వాత కెరీర్ పరంగా తాను ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని, కొందరి మాటలు విని తాను ఎంతో భయపడ్డానని చెప్పారు.
'గేమ్ ఛేంజర్' సినిమాతో తప్పకుండా కమ్‌బ్యాక్ ఇస్తానని అనుకుంటున్నానని అగ్ర నిర్మాత దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేసారు. ఆయన బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 50వ చిత్రమిది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీకి ఎస్.శంకర్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించి సినిమా విశేషాలు పంచుకున్నారు. కొవిడ్ తర్వాత కెరీర్ పరంగా తాను ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని, కొందరి మాటలు విని తాను ఎంతో భయపడ్డానని చెప్పారు. సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో ఉండలేమని అన్నారు.
'వకీల్ సాబ్' సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని భావించానని, కానీ కొవిడ్ కారణంగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయానని దిల్ రాజు తెలిపారు. తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ తో తీసిన సినిమా ఆడలేదనే బాధతో, రిలీజైన వారానికే యూఎస్ వెళ్లిపోయానని, ఆ తర్వాత తలపతి విజయ్ తో 'వారిసు' మూవీ తీశానని చెప్పారు. అయితే కొలీవుడ్ హీరోతో తీయడం వల్ల అది తమిళ సినిమా అయిందని, తెలుగులో అనుకున్నంత రాకపోయినా తమిళంలో మంచి లాభాలు పొందానన్నారు. 'బలగం' సినిమా చేసి ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ, అది తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో చేయడం వల్ల ఇక్కడ వంద మార్కులు వస్తే మిగిలినచోట్ల మాత్రం 70 మార్కులే పడ్డాయని పేర్కొన్నారు.
యూనివర్సల్‌గా సక్సెస్ అందుకోలేకపోయానని, అలా మూడున్నరేళ్ల ప్రయాణంలో తనను తాను విశ్లేషించుకున్నట్లుగా దిల్ రాజు చెప్పారు. 'ఫ్యామిలీ స్టార్' విడుదలైన తర్వాత తన ఏడేళ్ల మనవడు ఫోన్ చేసి.. 'తాత.. నువ్వు బాధలో ఉన్నావని తెలుసు. నీ చేతిలో 'గేమ్ ఛేంజర్' ఉంది. తప్పకుండా హిట్ కొడతావు' అని అన్నాడని తెలిపారు. మనవడి మాటలు తనను భావోద్వేగానికి గురి చేశాయని, చుట్టుపక్కల వాళ్లు కూడా తన గురించి అలాగే మాట్లాడుకున్నారన్నారు. సినిమాల విషయంలో తన జడ్జిమెంట్ పోయిందని చాలామంది అనుకున్నారని, వాళ్ల మాటలకు తను ఎంతో భయపడ్డానని తెలిపారు.
'గేమ్ ఛేంజర్' ఒక ప్రత్యేకమైన చిత్రమని, దాదాపు మూడున్నరేళ్ల జర్నీ అని దిల్ రాజు అన్నారు. 2021 ఆగస్టులో సినిమా మొదలుపెడితే, ఈ మూడున్నరేళ్లలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశానని తెలిపారు. నిర్మాతకు డైరెక్టర్ శంకర్ క్రియేటివ్ స్పేస్ ఇవ్వడని తెలిసినా, సినిమాని హిట్ చేయాలన్న తపనతో ఆయనతో కలిసి పని చేశానని గుర్తు చేసుకొన్నారు. శంకర్ కి తనకు ఈ సినిమా రిజల్ట్ చాలా ముఖ్యమని, ఈ సినిమాతో సంక్రాంతికి దిల్ రాజు కంబ్యాక్ అని అందరూ రాస్తారని పేర్కొన్నారు.
ప్రొడ్యూసర్ గా తాను ఫ్లాపుల్లో ఉన్నానని, 'ఇండియన్ 2' సినిమాతో శంకర్ కూడా డౌన్‌లో ఉన్నాడని, ఒక్క రామ్ చరణ్ తప్ప ఈ సినిమాలో పాజిటివ్ విషయాలు లేవని అన్నారు. అయితే 'భారతీయుడు 2' ఫ్లాప్ అయినా నాలుగేళ్ల క్రితం దర్శకుడు చెప్పిన కథపై తనకు నమ్మకం ఉందని, చెప్పింది చెప్పినట్టు తీస్తున్నాడా లేదా అనేది మాత్రమే చూసుకొన్నానని తెలిపారు. 100 శాతం ఈ విషయంలో సంతృప్తిగా ఉన్నానని, ఫ్యాన్స్ విజిల్స్ వేసే మూమెంట్స్ సినిమాలో ఉన్నాయని చెప్పారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విషయంలోనూ పూర్తి నమ్మకంతో ఉన్నానని, ఆ సినిమా పూర్తి క్రెడిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడికే చెందుతుందన్నారు. ఈ సంక్రాంతికి రెండు సినిమాలతోనూ రెండు సిక్సర్లు కొట్టడం ఖాయని ధీమా వ్యక్తం చేసారు.
నిజానికి దిల్ రాజు గత కొంతకాలంగా ఆశించిన విజయాలను అందుకోలేకపోతున్నారు. 'బలగం' తర్వాత ఆ రేంజ్ లో హిట్టు కొట్టలేకపోయారు. 'థ్యాంక్యూ', 'శాకుంతలం', 'ఫ్యామిలీ స్టార్', 'లవ్ మీ', 'జనక అయితే గనక' లాంటి చిత్రాలు తీవ్ర నిరాశ పరిచాయి. అటు డిస్ట్రిబ్యూషన్ లోనూ పెద్దగా ప్రాఫిట్స్ రాలేదు. ఈ నేపథ్యంలో పొంగల్ కి రాబోతున్న 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు నిర్మాత కెరీర్ కు కీలకంగా మారాయి. మరి దిల్ రాజు బౌన్స్ బ్యాక్ అవుతాడా? సంక్రాంతి రాజు అనిపించుకుంటాడా? అనేది చూడాలి.