ఆ ఒక్క కూల్చివేత‌తో 900కోట్లు ఆర్జిస్తున్న స్టార్ హీరో

Update: 2023-08-04 15:32 GMT

లెజెండరీ బాలీవుడ్ న‌టుడు కీ.శే దిలీప్ కుమార్ ముంబై ఆస్తుల్లో ఒక బంగ్లాను కూల్చివేసేందుకు సిద్ధ‌మ‌వ్వ‌డం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ బంగ్లా నగరంలోని అత్యంత పాపుల‌ర్ ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఇప్పుడు ఈ బంగ్లా ఉన్న స్థ‌లం రూపురేఖ‌లు మార్చుకోనుంది. విలాసాల ఆవాస నిల‌యంగా భారీ రూపాంతరం చెందడానికి సిద్ధంగా ఉందని ముంబై మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. దివంగత నటుడు దిలీప్ కుటుంబం ఈ స్థలాన్ని కొంత భాగం నివాసాల‌కు అవ‌స‌ర‌మైన ఫ్లాట్లుగా.. మ‌రికొంత భాగం మ్యూజియంగా మార్చడానికి తమ ఆమోదం తెలిపింది. రెండు నిర్మాణాలకు వేర్వేరుగా ప్రవేశాలు ఉంటాయని తెలిసింది. సూపర్ స్టార్ దిలీప్ కుమార్ నాటి వైభ‌వ‌మైన‌ జీవితం అత‌డి విజయాలకు సంబంధించిన ఆర్టిక‌ల్స్ తో భారీ మ్యూజియం ఏర్పాట‌వుతుంది. ఇక ఇదే చోట‌ విలాసవంతమైన ఫ్లాట్ ల‌ను నిర్మిస్తార‌ని తెలిసింది.

ఈ స్థ‌లం అర ఎకరంలో విస్తరించి ఉంది. మొత్తం నిర్మాణ విస్తీర్ణంలో 1.75 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం 11 అంతస్తుల్లో పంపిణీ అవుతుంది. రెసిడెన్షియల్ టవర్ ద్వారా రూ.900 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని సమాచారం. ఈ స్థ‌లం న‌గ‌రంలో అత్యంత ప్రైమ్ ఏరియాలో ఉండ‌డంతో ఇక్క‌డ ఫ్లాట్ ల‌కు అధిక డిమాండ్ ఉంద‌ని కూడా తెలుస్తోంది.

దిలీప్ కుమార్ కుటుంబం ఆస్తిని కాజేసే ఉద్దేశ్యంతో ప్ర‌ముఖ‌ రియల్ ఎస్టేట్ సంస్థ నకిలీ పత్రాలను సృష్టించిందని ఆరోపించడంతో చాలా సంవత్సరాలుగా ఈ ఆస్తి చట్టపరమైన వివాదంలో చిక్కుకుంది. అయితే 2017లో సుదీర్ఘమైన న్యాయ పోరాటం తర్వాత దిలీప్ కుమార్ భార్య సైరా బాను ఈ కేసును గెలిచారు. చివరకు ఆస్తికి సంబంధించిన కీ(తాళాలు)లను తిరిగి పొందినట్లు క‌థ‌నాలొచ్చాయి. ఎట్ట‌కేల‌కు పాత బంగ్లాను కూల్చి ఇప్పుడు 900 కోట్ల మేర ఆదాయ ఆర్జ‌న‌కు ప్లాన్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Tags:    

Similar News