ఔత్సాహిక ఫిలింమేకర్స్ కోసం వర్క్‌షాప్!
టాలీవుడ్లో ప్రవేశించాలనుకునే నవతరానికి అద్భుతమైన అవకాశం కల్పించేందుకు ఇప్పుడు మరోసారి ముందుకు వచ్చారు ఇండస్ట్రీ దిగ్గజం దిల్ రాజు.
ప్రతిభను గుర్తించడం ప్రోత్సహించడం ఏ రంగంలో అయినా చాలా అవసరం. ముఖ్యంగా గ్లామర్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించే నవతరం ఆర్టిస్టులు, ఔత్సాహిక దర్శకరచయితలు, నిర్మాతలను ప్రోత్సహించాల్సిన బాధ్యత సీనియర్లు, అనుభవజ్ఞులకు ఉంది. దశాబ్ధాల తరబడి సినీ వ్యాపారంలో నిష్ణాతులైన వారు కొందరు చొరవ తీసుకుంటనే ఇది సాధ్యం. అయితే తెలుగు ఇండస్ట్రీలో పలువురు సినీపెద్దలు ఇదే బాటలో ఉన్నారు. సీనియర్లు, అనుభవజ్ఞులు అయిన పలువురు నిర్మాతలు కొత్తతరాన్ని ప్రోత్సహించే సదుద్ధేశంతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
టాలీవుడ్లో ప్రవేశించాలనుకునే నవతరానికి అద్భుతమైన అవకాశం కల్పించేందుకు ఇప్పుడు మరోసారి ముందుకు వచ్చారు ఇండస్ట్రీ దిగ్గజం దిల్ రాజు. పంపిణీ రంగం సహా సినీనిర్మాణంలో దశాబ్ధాలుగా వేళ్లూనుకున్న దిల్ రాజు టెక్సాస్(అమెరికా)లోని వర్ధమాన ఫిలింమేకర్స్ కి ఒక అరుదైన అవకాశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
పరిశ్రమలో ప్రవేశించే కొత్తవారికి పూర్తి స్థాయి సమాచారాన్ని, విజ్ఞానాన్ని అందించే ప్రక్రియ. ఇన్ఫర్మేటివ్ సెషన్ 1 జూన్ 2024న డల్లాస్‌లోని స్టూడెంట్ సర్వీసెస్ బిల్డింగ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో జరుగుతుందని సమాచారం.
ఔత్సాహిక నటీనటులు, దర్శక రచయితలు, నవతరం నిర్మాతలు, ఛాయాగ్రాహకులు, ఎడిటర్లు ఇతర సాంకేతిక నిపుణులకు ఇక్కడ అవగాహనా సదస్సు (వర్క్‌షాప్) ని నిర్వహిస్తున్నామని.. పేర్లు నమోదు చేసుకోమని దిల్ రాజు కోరారు. నేటితరం పరిశ్రమలోకి రావాలని దిల్ రాజు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. అయితే ఇలా కొత్త తరాన్ని ప్రోత్సహించడం, ప్రతిభకు అవకాశాలు కల్పించడం దిల్ రాజు వంటి మేటి అనుభవజ్ఞులకు ఈరోజు కొత్తేమీ కాదు.
ఇప్పటికే ఎందరో ఆయన చేతుల మీదుగా లాంచ్ అయ్యి పెద్ద స్థాయికి ఎదిగిన వారు ఉన్నారు. సినిమాపై ప్యాషన్ తో వచ్చే వారికి ఆయన ఎప్పుడూ అండగా నిలిచారు. ఇప్పుడు విదేశాల్లో దాగి ఉన్న ప్రతిభావంతులకు ఆయనవంతు సహకారం అందించనున్నారు. పరిశ్రమలో చాలా కాలంగా దిల్ రాజు, అల్లు అరవింద్, డి.సురేష్ బాబు వంటి ప్రముఖులు ప్రతిభను గుర్తించి వారికి తమ వంతు అవకాశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.