హాలీవుడ్ నుంచి అట్లీకి కాల్ వచ్చినా కానీ..!
ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ 'జవాన్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. కింగ్ ఖాన్ షారుఖ్ కి కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాన్ని అందించాడు
ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ `జవాన్` చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. కింగ్ ఖాన్ షారుఖ్ కి కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాన్ని అందించాడు. జవాన్ సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. భారీ యాక్షన్ కంటెంట్ తో రూపొందిన ఈ బాలీవుడ్ చిత్రం ఇప్పుడు అట్లీకి హాలీవుడ్ లో పనిచేయడానికి ఆఫర్ ని తెచ్చి పెట్టిందన్న చర్చ సాగుతోంది. జవాన్ విడుదలైన తర్వాత హాలీవుడ్ నుండి అక్కడ ఒక చిత్రంలో పనిచేయడానికి తనకు కాల్ వచ్చిందని దర్శకుడు అట్లీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
జవాన్ తర్వాత తెలుగు నటుడు అల్లు అర్జున్‌తో పాన్-ఇండియన్ చిత్రం కోసం అట్లీ సన్నాహకాల్లో ఉన్నాడని కథనాలొస్తున్నాయి. తదుపరి డెవలప్ మెంట్స్ పై చర్చించడానికి ఇద్దరూ ఇటీవల ముంబైలో సమావేశమయ్యారు. అయితే ఈ చిత్రం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అల్లు అర్జున్ షెడ్యూల్స్ స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ ఆధారంగా ఈ మూవీ పురోగతి ఉంటుంది.
సౌత్ ఇండస్ట్రీని వదిలేస్తాడా?
ఒకవేళ హాలీవుడ్ ఆఫర్ ని ఛేజిక్కించుకుని అట్లీ పూర్తిగా హాలీవుడ్ కి జంప్ చేస్తాడా? సౌత్ పరిశ్రమను వదిలేస్తాడా? అంటే దీనికి సమాధానం ఉంది.
నిజానికి జవాన్ ఫక్తు ఫార్ములాటిక్ సినిమా. దీనిని రొటీన్ మసాలా కంటెంట్ తో అట్లీ తెరకెక్కించాడని ఒక సెక్షన్ మీడియా విమర్శించింది. ఈ చిత్రంలో యథావిధిగా షారూఖ్ ఖాన్ తండ్రి - కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు. ఇలాంటి పాత్రలు భారతీయ సినీపరిశ్రమకు కొత్తేమీ కాదు. అయితే బాలీవుడ్ బాద్షా యాక్షన్-ప్యాక్డ్ డ్యూయల్ అవతార్ అభిమానులను ఆకట్టుకుంది. జవాన్ బాక్సాఫీస్ వద్ద చక్కని ప్రదర్శన ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా కానీ అట్లీ రొటీన్ డైరెక్షన్ స్కిల్స్ పై విమర్శలున్నాయి. అయితే అలాంటి డైరెక్టర్ కి హాలీవుడ్ నుంచి ఆఫర్ రావడం అంటే ఆసక్తి కలిగించే విషయమే.
ఇంతకీ అతడు ఏమంటున్నాడు?
అట్లీ ఏదైనా సినిమాకి పని చేయడానికి తనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. తనను ఎవరూ కొనలేరని, తనకు దేనిపై అయినా ప్రేమ ఉంటేనే పని చేస్తానని అన్నాడు. జీవితంలో ప్రేమ, ఆధిపత్య తత్వశాస్త్రం గురించి మాట్లాడుతూ అట్లీ ఏమన్నారంటే.. ``ప్రేమ లేకుండా ప్రపంచంలో ఏదీ లేదు. నా ఉద్యోగానికి గణిత సూత్రం లేదు. నా క్రాఫ్ట్ ప్రేమ గురించి. నేను దేనినైనా ప్రేమించకపోతే నేను ఆ పని చేయలేను. అందుకే నేను ప్రేమలో పడాలి.. అమ్మాయిని ఇష్టపడితే పెళ్లి చేసుకోలేను.. ఆమెతో ప్రేమలో పడ్డాను.. అలాగే సినిమా తీస్తే అది హీరోతో మాత్రమే కాదు.. నేను నిర్మాతతో కూడా ప్రేమలో పడాలి. ప్రపంచం నా ప్రేమను నడిపిస్తుంది. అది లేకుండా అంతా మెకానికల్‌గా ఉంది`` అని తన ఫిలాసఫీని బయటపెట్టాడు.
నిజాయితీ అనేది ప్రేమతో వస్తుంది. నేను వ్యక్తులతో నా సమయాన్ని వెచ్చిస్తాను. మనం నిజంగా సరిపోలుతున్నామా.. నేను వారిని ప్రేమించగలనా .. వారి నుండి ఏదైనా నేర్చుకోగలనా? అని చూస్తాను. ఎవరైనా నా వద్దకు వచ్చి, సార్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను. మీ సినిమా కోసం నేను మీతో కలిసి పని చేయాలనుకుంటున్నాను. అంటే చాలు.. నేను సంతకం చేస్తాను.. అదే నా సినిమాలకు సంతకం చేసే రహస్యం.. ఇంకా ఎవరైనా వచ్చి ``ఇంత డబ్బు ఇస్తాను, ఇదిగో బ్లాంక్ చెక్`` అని చెబితే నేను చాలా మందికి నో చెప్పాను. నన్ను కొనొద్దు.. కానీ మీరు నన్ను ప్రేమించవచ్చు. నేను మిమ్మల్ని తిరిగి ప్రేమించగలను. ప్రేమ లేకుండా నేను దేనినీ సృష్టించలేను.. అని అట్లీ అన్నారు. దీనిని బట్టి హాలీవుడ్ లో పని చేసేందుకు డబ్బు విసిరేసినా అట్లీ దానికోసం అక్కడికి వెళ్లడు అని అర్థం చేసుకోవాలి. తనకు అవసరమైన ప్రేమను కోలీవుడ్ అందిస్తోంది. అందుకే ఇక్కడ పని చేస్తున్నాడు.