వాయిదాల పర్వంతో కంటెంట్ పై అనుమానాలు
కొన్ని సినిమాలు ఒక సారి వాయిదా పడితే కొన్ని సినిమాలు మాత్రం రెండు మూడు సార్లు వాయిదా పడుతున్నాయి.
ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ముందు చెప్పిన డేట్ కి రాలేక పోతున్నాయి. షూటింగ్ సమయంలో ప్రకటించిన డేట్ కి కనీసం 25 శాతం సినిమాలు కూడా రాలేక పోతున్నాయి అంటూ ఆ మధ్య ఒక ప్రముఖ మీడియా సంస్థ తమ అధ్యయనం లో వెల్లడించింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉంది.
కొన్ని సినిమాలు ఒక సారి వాయిదా పడితే కొన్ని సినిమాలు మాత్రం రెండు మూడు సార్లు వాయిదా పడుతున్నాయి. అయితే నాలుగు అయిదు సార్లు వాయిదా పడే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. ఆ అరుదైన సినిమా లో బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తాజా చిత్రం 'యోధ' చేరింది.
ఈ ఏడాది ఆరంభం నుంచి కూడా యోధ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. డిసెంబర్ 8న కచ్చితంగా విడుదల చేసి తీరుతాం అంటూ నిర్మాత కరణ్ జోహార్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. హీరో సిద్దార్థ్ మల్హోత్రా కూడా డిసెంబర్ 8వ తేదీపై చాలా నమ్మకంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు.
నేడు విడుదల అవ్వాల్సిన యోధా సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ మళ్లీ ప్రకటించాడు. ఈసారి ఏకంగా నాలుగు నెలల సమయం తర్వాత అంటే వచ్చే ఏడాది మార్చి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు. ఒక ప్రముఖ నిర్మాత, ఒక స్టార్ హీరో కాంబోలో పుష్కర్ ఓజ్హా, సాగర్ అంబరీ లు సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా విడుదల ఏకంగా అయిదు సార్లు వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది.
వరుసగా ఫ్లాప్స్ అవుతున్న నేపథ్యం లో యోధా సినిమా యొక్క కంటెంట్ విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ సినిమా బాగుందా... సరిగా రాకపోవడం వల్లే నిర్మాత కరణ్ జోహార్ వాయిదా వేస్తున్నాడా అంటూ బాలీవుడ్ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. అసలు విషయం ఏంటో తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చి లో అయినా థియేట్రికల్ రిలీజ్ ఉంటుందా.. అప్పుడు తీరా సిద్దార్థ్ మల్హోత్రా గత చిత్రం మాదిరిగా ఓటీటీకి ఇచ్చేస్తారా అనేది చూడాలి.