డ్రీమ్ గర్ల్ 2.0 .. గర్ల్‌ఫ్రెండ్ డాడీకి స్త్రీ స్వరంతో బిస్కెట్
ప్రియురాలి తండ్రి నుంచి తప్పించుకోవడానికి ఒక స్త్రీ స్వరాన్ని అనుకరించానని అతడు ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకున్నాడు.
కెరీర్ లో ఛాలెంజింగ్ రోల్స్ తో సత్తా చాటేవాడిగా ఆయుష్మాన్ ఖురానాకి పేరుంది. 2019 బ్లాక్ బస్టర్ మూవీ డ్రీమ్ గర్ల్ నటుడిగా అతడిలోని విలక్షణతకు అద్దం పట్టింది. ఈ సినిమా ఆయుష్మాన్ కెరీర్ కి బిగ్ బ్రేక్ ని ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి రేడియో జాకీ(ఉద్యోగం)గా స్త్రీ వాయిస్ ని అనుకరించే ప్రతిభావంతుడిగా డ్రీమ్ గర్ల్ లో అతడి పనితనం గొప్పగా వర్కవుటైంది. ఇందులో స్త్రీ పాత్రకు అమ్మాయి స్వరాన్ని అందించి వేవ్స్ క్రియేట్ చేసాడు. మగ కాలర్‌లను ఆకర్షించడానికి మహిళా కాలర్ గా అతడి అభినివేశం ప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది.
ఈ సినిమాని వీక్షించేందుకు యువతరంతో పాటు ఫ్యామిలీ ఆడియెన్ పోటీపడ్డారంటే దానికి కారణం ఆయుష్మాన్ అద్భుత నటన. అందుకే డ్రీమ్ గర్ల్ మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేసేందుకు ఇప్పుడు సీక్వెల్ తో అతడు బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. మాతృకలో పూజా (ఆయుష్మాన్) పాత్రకు ప్రాణం పోసిన ఏకైక స్వరాన్ని ఎలా సంపాదించాడో ఆయుష్మాన్ ఇటీవల బహిర్గతం చేసాడు.
ప్రియురాలి తండ్రి నుంచి తప్పించుకోవడానికి ఒక స్త్రీ స్వరాన్ని అనుకరించానని అతడు ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకున్నాడు. నేను ఆ సమయంలో ప్రియురాలికి స్నేహితురాలిగా నటించాల్సి ఉంది.. లేడీ వాయిస్ లో మాట్లాడాలి. డ్రీమ్ గర్ల్ గా మారడం కోసం చాలా ప్రాక్టీస్ చేసాను అని ఆయుష్మాన్ తెలిపాడు. "నిజానికి ఆ పాత్రలో నటించేందుకు నా రేడియో జాకీ .. థియేటర్ స్టింట్ నిజంగా నాకు బాగా సహాయపడింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నేను రేడియో స్టేషన్‌లో పనిచేస్తున్నప్పుడు ఒక మహిళగా ప్రాంక్ కాల్స్ చేసాను. అంతేకాదు.. నేను నా మొదటి స్నేహితురాలికి కాల్ చేస్తుంటాను.. ఆమె తండ్రి ల్యాండ్‌లైన్ లో టచ్ లోకి వస్తే నేను వెంటనే ఆమె స్నేహితురాలిగా నటిస్తాను.. ఆ సన్నివేశం బాగా పండింది" అంటూ డ్రీమ్ గర్ల్ సన్నివేశాన్ని అతడు గుర్తు చేసుకున్నాడు.
మోస్ట్ అవైటెడ్ 2023 సీక్వెల్ 'డ్రీమ్ గర్ల్ 2' గురించి మాట్లాడుతూ.. ఈసారి సీక్వెల్లో మరింతగా కామెడీ కంటెంట్ ని పెంచే ప్రయత్నం చేశామని తెలిపాడు. డ్రీమ్ గర్ల్ 2 తొలి భాగం కంటే రెట్టింపు వినోదాన్ని అందిస్తుందని వాగ్దానం చేశాడు. ఏక్తా (కపూర్) నేను మునుపటి భాగం కంటే సీక్వెల్ ఎంతో సరదాగా ఉండాలని కోరుకున్నాం. మేం అనుకున్నది చేయగలిగామని భావిస్తున్నాను. ఇది నిజానికి వెర్షన్ 2.0....డబుల్ ఫన్ ని ఇస్తుంది! అని తెలిపాడు.
ఇటీవల విడుదలైన డ్రీమ్ గర్ల్ 2 ట్రైలర్ ఆద్యంతం హాస్యభరితమైన డైలాగ్‌లు ఆసక్తికర ట్విస్ట్‌లతో నవ్వులు పూయించే సినిమా ఇదని స్పష్ఠతనిచ్చింది. ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ నుండి 'దిల్ కా టెలిఫోన్ 2.0' పేరుతో మొదటి ట్రాక్ విడుదల కాగా.. ఇది అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం డ్రీమ్ గర్ల్ అభిమానులు థియేటర్లలో సీక్వెల్ వీక్షణ కోసం క్యూరియస్ గా వేచి చూస్తున్నారు. ఈ చిత్రంలో పరేష్ రావల్, విజయ్ రాజ్, అన్నూ కపూర్, రాజ్‌పాల్ యాదవ్, సీమా పహ్వా, మంజోత్ సింగ్, అభిషేక్ బెనర్జీ తదితరులు నటించారు. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించగా.. ఏక్తా కపూర్- శోభా కపూర్ నిర్మించారు. డ్రీమ్ గర్ల్ 2 ఆగష్టు 25 న థియేటర్లలోకి రానుంది.