మూవీ రివ్యూ : ఈగల్

Update: 2024-02-09 06:42 GMT
మూవీ రివ్యూ : ఈగల్
  • whatsapp icon

ఈగల్ మూవీ రివ్యూ

నటీనటులు: రవితేజ - కావ్య థాపర్ - అనుపమ పరమేశ్వరన్ - వినయ్ రాయ్ - నవదీప్- శ్రీనివాస్ అవసరాల- మధుబాల -నవదీప్ - శ్రీనివాసరెడ్డి - అజయ్ ఘోష్ తదితరులు

సంగీతం: డేవ్ జాండ్

ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని - కర్మ్ చావ్లా - కామిల్ ప్లాకి

కథ: కార్తీక్ ఘట్టమనేని

మాటలు: మణిబాబు కరణం

స్క్రీన్ ప్లే: కార్తీక్ ఘట్టమనేని - మణిబాబు కరణం

నిర్మాత: టి. జి. విశ్వప్రసాద్

దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని

గత ఏడాది రావణాసుర.. టైగర్ నాగేశ్వరరావు చిత్రాలతో దెబ్బ తిన్నాడు మాస్ రాజా రవితేజ. ఆయనకు ఈగల్ ఎంతో ముఖ్యమైన సినిమా. కెమెరామన్ టర్న్డ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈగల్ ఆ అంచనాలను ఏ మేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

సహదేవ్ (రవితేజ) చిత్తూరు జిల్లాలోని తలకోన ప్రాంతంలో ఒక గిరిజన ప్రాంతంలో ఫాం హౌస్ కట్టుకుని ఒక పత్తి ఫ్యాక్టరీని నడుపుతుంటాడు. అక్కడ పండే అరుదైన పత్తిని రైతులు తీసుకొచ్చి ఇదే ఫ్యాక్టరీలో నేయడం ద్వారా జీవనం సాగిస్తుంటారు. ఐతే ఈ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతంలోనే బాక్సైట్ గనులు ఉన్నాయని తెలిసి ఆ ప్రాంత ఎమ్మెల్యేతో పాటు ఒక వ్యాపారవేత్త కన్ను దానిపై పడుతుంది. ఎలాగైనా సహదేవ్ ను.. అక్కడి రైతులను అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ ప్రాంతాన్ని చెరబట్టాలని చూస్తారు. కానీ పైగా మామూలు వ్యక్తిలా కనిపించే సహదేవ్ వెనుక వేరే కథ ఉంటుంది. అతడికి ‘ఈగల్’ అనే మరో రూపం కూడా ఉంటుంది. ఆ కథేంటి.. ఆ రూపమేంటి.. తనను అంతం చేయాలని వచ్చిన వాళ్లను సహదేవ్ ఎలా ఎదుర్కొన్నాడు.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం- విశ్లేషణ:

హీరో గురించి వేర్వేరు పాత్రలతో గొప్పగా చెప్పించడం.. అతను చేసిన విధ్వంసం గురించి ఆయా పాత్రలు గగుర్పాటుకు గురవుతూ మాట్లాడడం.. ఈ క్రమంలో ఎలివేషన్ పండించే ప్రయత్నం చేయడం ఎప్పట్నుంచో ఉన్న స్టైలే. కాకపోతే ఈ మధ్య కేజీఎఫ్ అనే సినిమా ఒకటి వచ్చి ఈ స్టైల్ ను వేరే లెవెల్ కు తీసుకెళ్లింది. దీంతో అందరూ ఈ ట్రెండును అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ తరహా ఎలివేషన్ అన్నిసార్లూ వర్కవుట్ కావట్లేదు. ఇతర పాత్రలు హీరో గురించి మాట్లాడగానే ఇచ్చే ఓవర్ రియాక్షన్లు.. వాళ్ల బిల్డప్పులకు తగ్గట్లు సన్నివేశాలు ఉంటేనే ఎలివేషన్ పండుతుంది. అలా కానపుడు బ్యాలెన్స్ దెబ్బ తింటుంది. ప్రేక్షకులు ముందు ఊహించుకున్నదానికి.. తర్వాత చూసిందనానికి పొంతన కుదరక సన్నివేశాలు తేలిపోతుంటాయి. ఈ కోవలో చెప్పుకోవడానికి చాలా సినిమాలున్నాయి. ‘ఈగల్’తో ఉన్న సమస్య కూడా దాదాపు ఇలాంటిదే. సినిమా మొదలు కావడం ఆలస్యం.. విధ్వంసం.. ఉత్పాతం.. విస్ఫోటనం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుంటాయి పాత్రలు. హీరోకు ఒక్కొక్కరు ఇచ్చే బిల్డప్ మామూలుగా ఉండదు. ఇక హీరో కథను చెప్పే క్రమంలో గతం-గరుడపురాణం.. మృగసిర-మధ్యరాత్రి.. పట్టపగలు-పద్ధతైన దాడి.. కంచె-కాపరి.. అంటూ ఘనమైన పదబంధాలు వాడి తెర మీద అద్భుతం ఏదో చూపించబోతున్న భ్రమలు కల్పిస్తారు. తీరా చూస్తే.. మామూలు సన్నివేశాలే దర్శనమిస్తాయి. ఓపెన్ మైండ్ తో చూస్తే ‘ఈగల్’ డీసెంట్ గానే అనిపించవచ్చు. కానీ కథను నరేట్ చేయడంలో అవసరం లేని ఆర్భాటమే ఈ చిత్రానికి సమస్యగా మారింది.

ఇంతకుముందు ఓ సరికొత్త ఐడియాతో ‘సూర్య వెర్సస్ సూర్య’ అనే వెరైటీ సినిమా తీశాడు కార్తీక్ ఘట్టమనేని. కానీ అతడి ఐడియా బాగున్నప్పటికీ.. దాన్ని ఒక కథగా పకడ్బందీగా చెప్పడంలో.. మంచి ముగింపునివ్వడంలో తడబడ్డాడు. ఈసారి తను ఎంచుకున్న కథ మరీ కొత్తగా అనిపించకపోయినా.. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలని ప్రయత్నించాడు. హీరో నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తి.. ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు.. తన నేపథ్యమేంటో చెప్పడు.. కానీ తన బ్యాగ్రౌండ్ వల్ల ఆమె ప్రాణం పోతే.. అలాంటి నష్టం ఇంకెవరికీ జరగకుండా ప్రక్షాళనకు నడుం బిగిస్తాడు. ఈ లైన్లో చాలా సినిమాలే చూశాం. ఐతే అదే ఫార్మాట్లో కాస్త భిన్నమైన నేపథ్యాన్ని జోడించి ‘ఈగల్’కు కొత్త కలర్ తీసుకొచ్చాడు కార్తీక్. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగించదు ‘ఈగల్’. హీరో పాత్రను నిగూఢంగా ఉంచుతూ.. దాని పట్ల క్యూరియాసిటీ పెంచడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. ఐతే ముందే అన్నట్లు హీరో పాత్రకు ఒక్కొక్కరు ఇచ్చే బిల్డప్పే శ్రుతి మించిపోయింది. ఎంతకీ అసలు విషయంలోకి వెళ్లకుండా కనిపించిన ప్రతి ఒక్కరూ అతనో ఉత్పాతం.. అతను చేసింది మామూలు విధ్వంసం కాదు అంటూ బిల్డప్పులివ్వడానికే చాలా సమయం పట్టేసింది. తీరా హీరో రంగంలోకి దిగాక అతను మామూలుగానే కనిపిస్తాడు. తన పాత్ర యాక్టివేట్ కావడానికి చాలా సమయం పడుతుంది. కొండ మీద ఫామ్ హౌస్ కట్టుకుని కాటన్ ఫ్యాక్టరీని నడిపే హీరో వ్యవహారం ఏమంత ఆసక్తికరంగా అనిపించదు. మరోవైపు ‘ఈగల్’ అంటూ హీరో పాత్రలోని మరో కోణం చుట్టూ ‘రా’ వాళ్లు చేసే ఆపరేషన్లోనూ ఆసక్తి అంతంతమాత్రమే.

హీరోలోని విధ్వంస కోణాన్ని బయటపెట్టే యాక్షన్ ఎపిసోడ్ వచ్చేవరకు ‘ఈగల్’ పెద్దగా ముందుకు కదలదు. ప్రథమార్ధం చాలా వరకు బోరింగ్ గానే అనిపిస్తుంది. సెకండాఫ్ లో యాక్షన్ మోతాదు పెరగడంతో ‘ఈగల్’ ఊపందుకుంటుంది. సినిమాలో మొదట్నుంచి చెబుతున్న ‘విస్ఫోటనం’ ఎపిసోడ్ పీక్స్ కు వెళ్లాక ప్రేక్షకులు కోరుకున్న హై వస్తుంది. ఈ యాక్షన్ ఘట్టాన్ని చాలా స్టైలిష్ గా.. భారీగా.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా తీర్చిదిద్దాడు కార్తీక్ ఘట్టమనేని. ఇక యూరప్ నేపథ్యంలో సాగే హీరో ఫ్లాష్ బ్యాక్ సోసోగా అనిపిస్తుంది. హీరో-హీరోయిన్ మధ్య ప్రేమకథలో గన్ను కీలక పాత్ర పోషించడం వెరైటీ. కానీ ఈ ఎపిసోడ్లో ఎమోషన్ మాత్రం అనుకున్నంత స్థాయిలో పండలేదు. ట్విస్టులు ఒక్కొక్కటి రివీల్ కావడంతో చివరి అరగంటలో సినిమా ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది. హీరో మిషన్ ఏంటో అర్థమయ్యాక కథ క్లైమాక్స్ కు దారి తీస్తుంది. ముగింపు మెరుపులు ఓకే. ఈ కథకు కొనసాగింపు కూడా ఉంటుందనే హింట్ ఇచ్చాడు కార్తీక్. కానీ కేవలం స్టైలిష్ యాక్షన్ ఘట్టాలనే నమ్ముకున్న ‘ఈగల్’ జస్ట్ ఓకే అనిపిస్తుందే తప్ప.. ఇంకో పార్ట్ చూడాలన్నంత ఆసక్తి అయితే రేకెత్తించదు.

నటీనటులు:

రవితేజ సహదేవ్ పాత్రలో చూడ్డానికి బాగున్నాడు. గడ్డం.. లుంగీతో తన లుక్ కొత్తగా అనిపిస్తుంది. మంద స్వరంతో డైలాగ్స్ చెబుతూ రవితేజ డిఫరెంటుగా ట్రై చేశాడు. తక్కువ మాటలతోనే ఈ పాత్రతో ఇంపాక్ట్ వేయగలిగాడు. ఈ క్యారెక్టర్లో ఓవరాల్ గా రవితేజ పెర్ఫామెన్స్ బాగుంది. ఈగల్ పాత్రలో రవితేజ పెద్దగా చేసిందేమీ లేదు. అందులో సాధారణంగా అనిపిస్తాడు. అనుపమ పరమేశ్వరన్ కు ఇది అలవాటైన పాత్రే. తన నటన ఓకే. కావ్య థాపర్ కనిపించిన కాసేపు తన అందంతో ఆకట్టుకుంది. ఎప్పుడూ స్టైలిష్ విలన్ పాత్రలే చేసే వినయ్ రాయ్ ఇందులో కొంచెం భిన్నమైన పాత్ర చేశాడు. అతడి పాత్ర.. నటన జస్ట్ ఓకే అనిపిస్తాయి. హీరో పక్కనే ఉండే పాత్రలో నవదీప్ బాగానే చేశాడు. అజయ్ ఘోష్.. శ్రీనివాసరెడ్డి కొంత నవ్వించారు. రా చీఫ్ పాత్రకు మధుబాల సూటవ్వలేదు. ఆ పాత్రకు అవసరమైన పరిణతి ఆమెలో కనిపించలేదు. మిగతా నటనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘ఈగల్’లో క్వాలిటీ కనిపిస్తుంది. కొత్త సంగీత దర్శకుడు డేవ్ జాండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ భిన్నంగా ట్రై చేశాడు. నేపథ్య సంగీతం మన కమర్షియల్ సినిమాల్లో ఎప్పుడూ వినిపించేలా లౌడ్ గా ఉండదు. అది కొందరికి కొత్తగా అనిపిస్తే.. ఇంకొందరికి రుచించకపోవచ్చు. పాటలు పెద్దగా ప్రభావం చూపించలేదు. ఓవరాల్ గా మ్యూజిక్ యావరేజ్ అనిపిస్తుంది. కార్తీక్ ఘట్టమనేని.. కర్మ్ చావ్లా.. కామిల్ ప్లోకి కలిసి అందించిన ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. రిచ్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. తెర మీద ఖర్చు కనిపిస్తుంది. కాస్టింగ్.. ప్రొడక్షన్ సహా ఏ విషయంలోనూ రాజీ పడలేదు. మణిబాబు కరణం మాటలు సినిమాలో సరిగా సింక్ అవ్వలేదు. డెప్త్ ఎక్కువైపోయింది. సన్నివేశాలతో సంబంధం లేకుండా మరీ లోతైన మాటలు రాశాడు. స్క్రీన్ ప్లేలో కూడా భాగస్వామి అయిన అతడిలో విషయం ఉంది. ఇక స్క్రిప్టు రాసి డైరెక్ట్ చేయడంతో పాటు ఎడిటింగ్ కూడా చేసిన కార్తీక్ ఘట్టమనేనిపై హాలీవుడ్ సినిమాల ప్రభావం చాలా ఉన్నట్లుంది. స్క్రీన్ ప్లే విషయంలో అతను కొత్తగా ట్రై చేశాడు. కథ.. హీరో పాత్రకు సంబంధించి ఎక్కడిక్కడ ప్రశ్నలు రేకెత్తిస్తూ.. ఒక్కో పాత్రతో జవాబులు ఇప్పిస్తూ కథను పూర్తి చేసే పద్థతి వెరైటీగా అనిపిస్తుంది. కానీ అతడి కథనం మాత్రం అనుకున్నంత ఎంగేజింగ్ గా లేదు. నరేషన్ చాలా చోట్ల స్లోగా.. బోరింగ్ గా అనిపిస్తుంది. కార్తీక్ ఎంచుకున్న కథ.. తన టేకింగ్ మాత్రం బాగున్నాయి.

చివరగా: ఈగల్.. చాలా స్టైల్.. కానీ కొంచెం డల్

రేటింగ్: 2.5/5

Tags:    

Similar News