లండ‌న్‌లోను ఎమ‌ర్జెన్సీకి బ్రేక్. థియేట‌ర్‌లో ఖ‌లీస్తానీల‌ గ‌లాటా

ఇంత‌లోనే ఈ సోమవారం లండన్‌లోని ఒక థియేటర్‌లో ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తలు సినిమా హాల్‌లోకి చొరబడి సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేయడంతో అంతరాయం కలిగింది.

Update: 2025-01-20 07:48 GMT

కంగనా రనౌత్ న‌టించిన `ఎమర్జెన్సీ` ఎన్నో క‌ష్టాల న‌డుమ విడుద‌లై, చివ‌రికి బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని అందుకోక‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. ఈ సినిమా విడుద‌లైన మూడు రోజుల్లో కేవ‌లం 10కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ పాత్ర‌లో కంగ‌న అద్భుతంగా న‌టించింద‌ని ప్ర‌శంస‌లు కురిసినా కానీ, బాక్సాఫీస్ వ‌సూళ్ల ప‌రంగా తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.

దీనికి తోడు పంజాబ్‌లో ఈ సినిమాని ఆడ‌నివ్వ‌కుండా శిక్కు సంస్థ‌లు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసాయి. థియేట‌ర్ల ఎదుట గ‌లాటా వాతావ‌ర‌ణం షాకిచ్చింది. ఇంత‌లోనే ఈ సోమవారం లండన్‌లోని ఒక థియేటర్‌లో ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తలు సినిమా హాల్‌లోకి చొరబడి సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేయడంతో అంతరాయం కలిగింది. థియేటర్ లోపల ప్రేక్షకులతో వారు మాటల యుద్ధానికి దిగారు. లండన్‌లోని హారో సినిమా హాల్‌లోకి ఎమర్జెన్సీ స్క్రీనింగ్ మధ్యలో కొంద‌రు ప్రేక్ష‌కుల ముందుకు దూసుకువచ్చి నినాదాలు చేస్తున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. `ఖలిస్తాన్ జిందాబాద్!` అంటూ స్క్రీన్ ముందు నిన‌దించ‌డంతో షోకు అంత‌రాయం ఏర్ప‌డింది. థియేటర్‌లోని ప్రేక్షకులతో ఖ‌లిస్తానీ కార్యకర్తలు వాదించారు. ఈ చిత్రం సమాజాన్ని చెడుగా చూపించిందని వారు ప‌దే ప‌దే వాదించ‌డం క‌నిపించింది. దుండగులపై థియేటర్ అధికారులు ఇంకా ఫిర్యాదు చేయలేదు.

భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ బయోపిక్ అయిన ఎమర్జెన్సీ చిత్రంతో కంగనా దర్శకురాలిగా ఆరంగేట్రం చేసింది. కంగ‌న ఇందిర‌గా ప్రధాన పాత్ర పోషించింది. త‌న న‌ట‌న‌కు అద్బుత ప్ర‌శంస‌లు కురిసాయి. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండి వివాదాలకు కేంద్రంగా ఉంది. ప‌లుమార్లు విడుద‌ల ఆల‌స్య‌మైంది. ఈ చిత్రం ముందుగా సెప్టెంబర్ 2024లో విడుదల కావాల్సి ఉన్నా సెన్సార్ బోర్డు దీనికి సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడంతో చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ చిత్రంలో సిక్కు సమాజాన్ని చిత్రీకరించడాన్ని అనేక సిక్కు సంస్థలు వ్యతిరేకించాయి. దీనివ‌ల్ల సీబీఎఫ్‌సి సూచించిన కట్స్ , మార్పులను పాటించాక రిలీజ్ కి లైన్ క్లియ‌రైంది.

Tags:    

Similar News