`పుష్ప-2` కోసం మలయాళీ స్టార్ షాకిచ్చే పారితోషికం?
ఒక నటుడు లేదా హీరో కేవలం ఒకే భాషలో నటిస్తే వచ్చే క్రేజ్ వేరు. పది భాషలకు పరిచయమయ్యే సినిమాలో నటిస్తే దక్కే క్రేజ్ వేరు.
ఒక నటుడు లేదా హీరో కేవలం ఒకే భాషలో నటిస్తే వచ్చే క్రేజ్ వేరు. పది భాషలకు పరిచయమయ్యే సినిమాలో నటిస్తే దక్కే క్రేజ్ వేరు. ఈ రెండో కోవలో ఆలోచించేవారిని పాన్ ఇండియా నటులుగా భావిస్తున్నారు. మాలీవుడ్ నుంచి మోహన్ లాల్- మమ్ముట్టి వంటి వారికి తొలి నుంచి ఇలాంటి ఇమేజ్ ఉంది. ఇరుగు పొరుగు భాషల్లో ముఖ్యమైన పాత్రల్లో అవకాశాలు వచ్చినప్పుడు స్టార్ ఇమేజ్ కి భిన్నంగా నటించారు. ఇటీవలి కాలంలో ఫహద్ ఫాసిల్ బహుభాషల్లో నటిస్తూ భారీగా ఆర్జిస్తున్న నటుడిగా మారాడు. పుష్ప సినిమాతో అతడి రేంజ్ అమాంతం పెరిగింది. పుష్ప 2లోను అతడి పాత్రకు కొనసాగింపు పాత్రలో నటిస్తున్నాడు.
తాజా సమాచారం మేరకు ఫహద్ ఈ పాత్రలో నటించేందుకు భారీ మొత్తం డిమాండ్ చేశారని, అంత పెద్ద మొత్తం చెల్లించేందుకు మేకర్స్ కూడా సిద్ధమయ్యారని కథనాలొచ్చాయి. ఇంతకీ ఫహద్ ఏమేరకు డిమాండ్ చేసారు? అంటే.. దాదాపు 8కోట్ల పారితోషికం అడిగారని తెలిసింది. మైత్రి సంస్థ ఆ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించింది. యాత్ర తర్వాత యాత్ర 2 లో నటించేందుకు ఉన్న ఏకైక ఆప్షన్ కాబట్టి మమ్ముట్టి భారీ మొత్తాన్ని డిమాండ్ చేసారని అప్పట్లో టాక్ వచ్చింది. ఆ తర్వాత మాలీవుడ్ నుంచి అంత పెద్ద మొత్తం డిమాండ్ చేసిన నటుడిగా ఫహద్ పేరు మార్మోగుతోంది. ఫహద్ నిజానికి ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోను పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇంతకుముందు కమల్ హాసన్- విజయ్ సేతుపతిలతో పాటు విక్రమ్ సినిమాలో ఫహద్ అద్భుతమైన పాత్రతో మెప్పించాడు.
మునుముందు మాలీవుడ్ నుంచి మాత్రమే కాదు కోలీవుడ్ సహా ఇరుగుపొరుగు భాషల నుంచి టాలీవుడ్ కి స్టార్ల వెల్లువ పెరుగుతుంది. విజయ్ సేతుపతి కోలీవుడ్ నుంచి వచ్చి పొరుగు భాషల్లో భారీ పారితోషికాలు వసూలు చేస్తున్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. యష్, ధనుష్ వంటి వారు మునుముందు తెలుగు సినిమాలలో నటించేందుకు ఆస్కారం ఉంది. వీరంతా భారీ మల్టీస్టారర్లలో నటించి పాన్ ఇండియా స్టార్లుగా మెప్పించేందుకు ప్రణాళికల్లో ఉన్నారు.
బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, సోనూసూద్ వంటి నటులు స్థిరంగా టాలీవుడ్ లో నటిస్తూ భారీ పారితోషికాలు అందుకునే నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి వంటి వారికి అమితాబ్ గొప్ప స్నేహితుడు కావడంతో పారితోషికం అవసరమే లేకుండా నటిస్తారన్నది తెలిసిందే.