ట్రైలర్‌తో 1000 కోట్ల బొమ్మో కాదో తేలిపోద్ది!
భారతదేశంలోనే తొలి పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా కల్కి రికార్డులకెక్కనుంది.
2024 మోస్ట్ అవైటెడ్ చిత్రాల జాబితాలో 'కల్కి 2898 AD' అగ్రపథాన నిలుస్తోంది. ఇప్పటివరకూ విడుదలైన పోస్టర్లు, బుజ్జి గ్లింప్స్, యానిమేటెడ్ సిరీస్ టీజర్ ఇవన్నీ మూవీపై భారీ హైప్‌ని పెంచాయి. తెలుగు సినీపరిశ్రమ నుంచి ప్రపంచమంతటా చర్చించుకునేలా ఒక అధునాతన టెక్నలాజికల్ విజువల్ వండర్ విడుదల చేయబోతున్నారని అంతటా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. దీనికి తగ్గట్టే నాగ్ అశ్విన్ భవిష్యత్ ప్రపంచం ఎలా మారుతుందో తెరపై ఆవిష్కరిస్తుండడం ఉత్కంఠ పెంచుతోంది. భారతదేశంలోనే తొలి పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా కల్కి రికార్డులకెక్కనుంది.
పెరిగిన హైప్ దృష్ట్యా ప్రభాస్ అభిమానులతో పాటు కామన్ ఆడియెన్ కూడా ఎంతో ఎగ్జయిటింగ్ ఈ మూవీ రాక కోసం వేచి చూస్తున్నారు. దానికి ముందు రాబోవు ట్రైలర్ గురించి కూడా అంతే ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ట్రైలర్ ప్రకటన వెలువడనుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుస వినిపిస్తోంది. బహుశా జూన్ 7న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
ఈరోజంతా రేపటి ఎన్నికల ఫలితాల గురించిన చర్చలతో వాతావరణం వేడెక్కిపోతోంది. ఈ మంగళవారం నాడు ఫలితాలు వెలువడనుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి సెటిల్ కావడానికి సమయం పడుతుంది. అందువల్ల ట్రైలర్‌ను రివీల్ చేయడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నారట. సరైన సమయం ఎప్పుడొస్తుంది? అంటే.. 07 జూన్ డేట్ లాక్ అయిందని గుసగుస వినిపిస్తోంది. ట్రైలర్ రాకతో ప్రభాస్ కెరీర్ లో మరో 1000 కోట్ల బొమ్మ పడుతుందో లేదో తేలిపోనుందని కూడా టాక్ వినిపిస్తోంది.
కల్కి 2898 ADలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ లాంటి దిగ్గజ స్టార్లు నటించారు. దిశా పటానీ గ్లామర్ ట్రీట్ మరో అదనపు ఆకర్షణ. వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్ జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కానుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ సినిమా కోసం దాదాపు 600 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేసారని ఒక ప్రచారం ఉంది.