ఇకపై కొత్త ప్రభాస్ ను చూస్తామా?
ఎప్పుడొచ్చినా ఈ క్రేజీ కాంబినేషన్ మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని నమ్ముతున్నారు.
'కల్కి 2898 AD' సినిమాతో తన కెరీర్ లో రెండో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న డార్లింగ్.. త్వరలో ''స్పిరిట్'' అనే మూవీ చేయబోతున్నారు. ఇది ఆయనకు సిల్వర్ జూబ్లీ సినిమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలం అయింది. ఇది ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడొచ్చినా ఈ క్రేజీ కాంబినేషన్ మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని నమ్ముతున్నారు.
''స్పిరిట్'' సినిమాలో ప్రభాస్ ఓ సిన్సియర్ అండ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని డైరెక్టర్ సందీప్ వంగా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇంతకుముందు ఎప్పుడూ చూడని సరికొత్త లుక్ లో ఆయన్ను చూపించబోతున్నట్లు చెప్పారు. ప్రభాస్ తన కెరీర్ లోనే తొలిసారి ఖాకీ ధరించి, లాఠీ పట్టుకోబోతున్నారని ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఆయన కటౌట్ కు ఈ రోల్ సరిగ్గా సూట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలోనే సందీప్ కాస్త కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి ప్రభాస్ గత కొంతకాలంగా లుక్స్ పరంగా సరిగా కనిపించటం లేదనే మాట వినిపిస్తోంది. 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' సినిమాల్లో ఆయన లుక్స్ ని యాంటీ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. 'సలార్' లో క్లోజప్ షాట్స్ లేకుండా మేనేజ్ చేశారని, అంతా డార్క్ థీమ్ తో లాంగించేసారనే విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు 'కల్కి' సినిమాలో భైరవ పాత్ర ఎంటర్టైనింగ్ గా డిజైన్ చేసినప్పటికీ, అందులో ప్రభాస్ చాలా నీరసంగా అసౌకర్యంగా కనిపించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే 'స్పిరిట్' తో సందీప్ వాళ్ళందరికీ కొట్టినట్లు సమాధానం చెప్పాలని.. ప్రభాస్ ను చాలా ఎనర్జిటిక్ గా,యాక్టివ్ గా ఉండే క్యారక్టరైజేషన్ తో చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో హీరోలను చాలా అందంగా ప్రెజెంట్ చేస్తారు. పాత్రలో వేరియేషన్స్ కు తగ్గట్టుగా లుక్స్ కూడా మారుస్తూ వస్తుంటారు. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాల్లో విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్ పాత్రలను సరిగ్గా మలిచారు. వాళ్ళు స్క్రీన్ మీద ఎనర్జిటిక్ గా కనిపించకపోయినా, ఎక్కడా నీరసంగా అయితే కనిపించరు. అదే విధంగా ఇప్పుడు సందీప్ 'స్పిరిట్' లోనూ ప్రభాస్ ను ఆకర్షణీయంగా చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. పోలీస్ పాత్ర కాబట్టి డల్ గా కనిపించే అవకాశం ఉండదు కాబట్టి, స్క్రీన్ మీద కాస్త ఉత్సాహంగా కనిపిస్తే చాలని అంటున్నారు.
'స్పిరిట్' కంటే ముందుగా 'ది రాజా సాబ్' సినిమాలో కనిపించబోతున్నారు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ లో గళ్ల లుంగీ కట్టుకుని ఆకట్టుకున్నారు. హెయిర్ స్టైల్, గడ్డంతో లుక్ లో వేరియేషన్ తీసుకొచ్చారు. దీంట్లో చాలా జీవియల్ గా ఉండే రోల్ లో కనిపిస్తారని టాక్. ఇక హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా కమిట్ అయ్యారు. ఇది లవ్ స్టోరీ మిక్స్ చేసిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని అంటున్నారు. కాబట్టి ఇందులోనూ ప్రభాస్ న్యూ లుక్ లో కనిపించే అవకాశముంది. ఏదేమైనా రాబోయే సినిమాల్లో ఒక కొత్త ప్రభాస్ ను చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మన దర్శకులు డార్లింగ్ ను ఎలా చూపిస్తారో వేచి చూడాలి.