దర్శకుడి విఫల వివాహంపై తల్లిదండ్రుల విడాకుల ప్రభావం?
అతడు తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల్లో కొన్ని ఒడిదుడుకులను కూడా చవి చూసాడు.
ఫర్హాన్ అక్తర్ పాపులర్ రచయిత జావేద్ అక్తర్ కుమారుడు. బాలీవుడ్ లో అగ్రనటుడిగా, దర్శకనిర్మాతగా సత్తా చాటిన ప్రముఖుడు. అతడు ప్రస్తుతం 2025లో విడుదల కానున్న `డాన్ 3`తో దర్శకుడిగా కంబ్యాక్ కోసం సిద్ధమవుతున్నాడు. డాన్ పాత్రలో రణవీర్ సింగ్‌ని ఫర్హాన్ ఎంపిక చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కెరీర్ లో ఫర్హాన్ విజయవంతమైన నటుడు, ఫిలింమేకర్. అతడు తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల్లో కొన్ని ఒడిదుడుకులను కూడా చవి చూసాడు. ఫర్హాన్ తన మొదటి భార్యకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత ప్రముఖ హీరోయిన్ తో స్నేహం గురించి మీడియాలో ప్రచారమైంది. అటుపై ప్రముఖ గాయని శిభానీ దండేకర్‌ని పెళ్లాడాడు. ఫర్హాన్ అక్తర్ తన గతం నుండి వర్తమానం, భవిష్యత్తును రూపొందించడానికి నిశ్చలంగా తన పని తాను చేస్తూనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఫర్హాన్ అక్తర్ జీవిత ప్రయాణం.. వివాహంతో అతని అనుభవాలు తనపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. 1970ల ప్రారంభంలో తన తల్లిదండ్రులు జావేద్ అక్తర్ - హనీ ఇరానీ విడిపోవడం అతడి పసిమనసుకు తీవ్ర గాయాన్ని చేసింది. ఫర్హాన్ చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు (1978లో) అతడి తల్లిదండ్రులు విడిపోవడం ఇబ్బందికర పరిణామం. ఇటీవలి ఇంటర్వ్యూలో అతడు దీనిని అంగీకరించాడు. మంచి సంబంధాల ఆవశ్యకతను కూడా అతడు గుర్తించాడు.
జర్నలిస్ట్ ఫాయే డిసౌజాతో హానెస్ట్ డిస్కషన్స్ లో చాలా విషయాలను ముచ్చటించారు ఫర్హాన్. తన బాల్యం, విడాకులు తీసుకున్న తల్లిదండ్రులతో గడిపిన విషయం, అధునా భబానీతో తన మొదటి వివాహాన్ని ముగించాలనే తన నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేసిందనే దాని గురించి ఫర్హాన్ ఓపెనయ్యాడు. అతడి బాల్యం తన మొదటి భార్యతో సంసారాన్ని ప్రభావితం చేసిందా? అని ప్రశ్నించగా.. ఫర్హాన్ అందులోని భావోద్వేగ సంక్లిష్టతలను వివరించాడు. తన తల్లిదండ్రుల విడాకుల వల్ల తనకు జరిగిన నష్టం.. తన విడాకులతో తన పిల్లలకు ఎదురవుతుందని అంగీకరించాడు. అమ్మా నాన్న విడిపోతే ఆ కష్టం బాధ ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఇప్పుడు నా పిల్లలకు మా విడాకుల వెనక కారణాల్ని వివరించాలి. విడిపోవడానికి కారణమేమిటో అర్థమయ్యేలా చెప్పాలి. ఏం చేసినా పిల్లల కోసం పూర్తి న్యాయం చేయలేము అని అన్నారు.
ఫర్హాన్ -అధునా 2000లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శాక్య - అకీరా వారి పేర్లు. 2016లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. మరుసటి సంవత్సరం వారి విడాకులను ఖరారు చేశారు. ఆ ఇరువురూ తమ పిల్లలకు సహతల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. అయితే తాను విడాకుల నిర్ణయం తేలికగా తీసుకోలేదని ఫర్హాన్ వివరించారు. తన పిల్లల భవిష్యత్ పై అతడు ఆందోళనను వ్యక్తం చేసాడు. కానీ విడాకులు తప్పలేదు. పిల్లల భవిష్యత్ గురించిన ఈ ఆలోచన అతడిలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంది.