చిన్న నిర్మాతల్లో ఆందోళన.. రీరిలీజ్ ముల్లు తీసేదెలా?
నిజానికి ప్రేక్షకులు కొత్త రిలీజ్ ల కంటే కూడా తెలిసిన ముఖాలు ఉన్న రీరిలీజ్ సినిమాలకే ప్రాధాన్యతనిస్తుండడంతో చిన్న సినిమాల పరిస్థితి అయోమయంగా మారుతోందని చెబుతున్నారు.
అగ్ర హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలు రీరిలీజవ్వడం లేటెస్ట్ ట్రెండ్. అయితే తెలుగు సినిమా రీ రిలీజ్‌ల ట్రెండ్ వల్ల లాభాలు- తలనొప్పులు రెండూ వస్తున్నాయి. ఫ్యాన్స్ థియేటర్లకు వెళ్లి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుని ఆనందిస్తుండగా అభిమానం పేరుతో థియేటర్ స్క్రీన్‌లను తగులబెడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. రీరిలీజ్ లు బాగానే ఆడుతున్నా కానీ .. ఇప్పుడు ఇవే సినిమాల వల్ల అంతగా పేరు లేని హీరోలు నటించిన చిన్న సినిమాలకు చిక్కులు వచ్చి పడుతున్నాయ్.
నిజానికి ప్రేక్షకులు కొత్త రిలీజ్ ల కంటే కూడా తెలిసిన ముఖాలు ఉన్న రీరిలీజ్ సినిమాలకే ప్రాధాన్యతనిస్తుండడంతో చిన్న సినిమాల పరిస్థితి అయోమయంగా మారుతోందని చెబుతున్నారు. చిన్న సినిమాలు కొత్త హీరోలతో రూపొందే సినిమాలు విడుదలవుతున్నా వీటిని జనం పట్టించుకోని పరిస్థితి. ఈ సమస్య ప్రస్తుతం చిన్న సినిమా నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది రీరిలీజ్ లు పెరిగే కొద్దీ మరింత ఝటిలమవుతుందని అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా చిన్న సినిమాల రిలీజ్ తేదీలను ప్రకటించాక పెద్ద సినిమాలతో పోటీపడాల్సిన సన్నివేశం ఇబ్బందికరం. ఒకసారి రిలీజ్ తేదీని ప్రకటించి దానిని వెనక్కి తీసుకోవడం సమస్యాత్మకం గనుక దీనికి పరిష్కారం అవసరం.
పరిశ్రమకు కీలకమైన ఫిల్మ్ ఛాంబర్ జోక్యం చేసుకుని శుక్రవారం నుండి ఆదివారం వరకు రీ-రిలీజ్‌లను నిషేధించాలని నిర్ణయించకపోతే చిన్న సినిమా నిర్మాతలకు కంటిపై కునుకుండదనడంలో సందేహం లేదు. అయితే బిజినెస్ లో ఎప్పుడూ లాభాలు, రాబడికి మాత్రమే ప్రాధాన్యత. దానికి రూల్స్ ఏవీ ఉండవు .. కానీ ఏం జరుగుతుందో వేచి చూడాలి.